కేసీఆర్ దళిత వ్యతిరేకినా…

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుడ్ని ముఖ్యమంత్రిచేస్తానని చెప్పారు కేసీఆర్. ఆచరణలో ఆ పని చేయలేదు. దళితులంటే చిన్న చూపులా చూస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఎస్సీ రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న  మంద కృష్ణ మాదిగ వంటి వారి పై అక్రమ కేసులు బనాయిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. అసలు తనను కేసీఆర్ చంపేందుకు ప్రయత్నిస్తున్నారని మంద కృష్ణనే స్వయంగా ఆందోళన చేశారు. తనకు రక్షణ కల్పించాలని గద్దర్ లాంటి ప్రజా గాయకులు డిజిపిని కలిసి కోరడం తెలిసిందే. 
అంతే కాదు…నాలుగేళ్లల్లో ఒక్క రోజు రాజ్యంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూల మాలలు వేసి నివాళులర్పించలేదంటారు. ఫలితంగా టీఆర్ఎస్ పార్టీలోని దళితులే కేసీఆర్ తీరుకు విస్తుబోతున్నారు. ఉద్యమకాలంలోఅన్ని వర్గాలను కలుపుకుపోయినా ఆయన ఆ తర్వాత దళితులను దూరం పెడుతున్నారంటున్నారు. డిప్యూటీ సిఎం రాజయ్యను పక్కన పెట్టారు. ఆ తర్వాత మిగతా వారికి సరైన ప్రయార్టీ ఇవ్వడం లేదు. నియంతృత్వ రాజ్యంలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. సర్వస్వం తానే అ్నన రీతిలో వ్యవహరిస్తున్నారనే వాదన వస్తోంది. అంబేద్కర్ జయంతికి సీఎం కేసీఆర్ గైర్హాజరు కావడం ఇదేం కొత్త కాదు. నాలుగేళ్లుగా ఇదే జరుగుతోంది. ప్రత్యేక విమానం వేసుకుని బెంగళూరు, కోల్ కత్తా వెళ్లడానికి తీరిక ఉంది. కానీ రాజ్యంగ నిర్మాతకు ఆ మాత్రం గౌరవం ఇవ్వడం చేతగాదా అంటున్నారు దళితులు. 
అంబేద్కర్ అంటే పడదా…
రాజ్యాంగ నిర్మాతగా అందరితో కీర్తించబడే అంబేద్కర్ జయంతికి కేసీఆర్ దూరంగా ఉండటం విమర్శలకు తావిస్తోంది. ఇలాంటి మంచి అవకాశం వస్తే ప్రధానప్రతిపక్షమైన కాంగ్రెస్ ఊరుకోదు కదా. అదే జరుగుతోంది. కాంగ్రెస్ నే కాదు…టీడీపీ,  బీజేపీ, కమ్యూనిస్టులు, ప్రజా సంఘాలు కేసీఆర్ తీరును తప్పుపడుతున్నాయి. దళితుడిని సీఎం చేస్తానన్న సీఎం కేసీఆర్ ఆ హామీని నిలబెట్టుకోలేదు. దళిత జనబాంధవుడైన అంబేద్కర్ విషయంలో ఇలాంటి నిర్లక్ష్యపూరిత వైఖరి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తీరును అంబేద్కర్ జయంతి అధికార ఉత్సవాల్లో దళిత సంఘాల నేతలు ప్రశ్నించారు. అంబేద్కర్ దళితుడు అయినందునే దండ వేయడానికి సీఎం ఇష్టపడటం లేదంటున్నారు.  దళిత వ్యతిరేక ప్రభుత్వాలైనా కేంద్రంలోని బీజేపీ – రాష్ట్రంలోని టీఆర్ఎస్ పార్టీలను గద్దె దించాలని వారు పిలుపునిస్తున్నారు. 
చెప్పుకోలేక పోతున్న టీఆర్ఎస్ దళిత నేతలు…
అంబేద్కర్ 127వ జయంతిని పురస్కరించుకొని ట్యాంక్ బండ్ పైనున్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఉత్సవాలను నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో ఎస్సీ కార్పొరేషన్ చైర్మెన్ పిడమర్తి రవి – బీసీ కమిషన్ చైర్మెన్ బీఎస్ రాములు, దళిత సంఘాల నేతలు పాల్గొన్నారు. మాల మహానాడు అధ్యక్షుడు జి చెన్నయ్య ఈ కార్యక్రమంలో పాల్గొని కేసీఆర్ తీరును తప్పు పట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దళితులపై దాడులు పెరిగాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో దళితులకు సుఖం లేకుండా పోయిందని చెబుతున్నారు. ఇసుక మాఫియాకు అండగా నిలిచి దళితుల పై అందులోను బాధితుల పై కేసులు పెట్టిన వైనాన్ని దళిత సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. 
దళితులకే కాదు.. దళిత సంఘాల నేతలను కూడా అరెస్టు చేసి జైల్లో పెడుతున్న వైనం  పై భగ్గుమంటున్నాయి వివిధ పార్టీలు. రేపు ఎన్నికల్లో అదే వర్గాల ఓట్ల కోసం కేసీఆర్ చేతులు పట్టుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నం కాక మానదు. అందుకే కేసీఆర్ ముందు చూపుతో వ్యవహరిస్తే మేలు. లేకపోతే చరిత్రలో ఆయన దళిత వ్యతిరేకిగా ముద్రపడే వీలుంది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*