గంటా సీటు అదేనట

మంత్రి గంటా శ్రీనివాసరావు ఏం చేసినా చాలా జాగ్రత్తగా స్టెప్పులు ఉంటాయి. అది తనకు అనుకూలంగా మార్చుకునేలా ఉంటోంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా మంత్రిగా ఉండటం ఆయనకు కలిసి వచ్చే అంశం. విశాఖలో నాలుగు నియోజకవర్గాలు మారిన గంటా ఇప్పుడు పక్క జిల్లా వైపు చూస్తున్నారు. గంటా శ్రీనివాసరావు స్వస్థలం ప్రకాశం జిల్లా. కానీ విశాఖ జిల్లా కేంద్రంగా ఉత్తరాంధ్ర రాజకీయాలను శాసిస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా నియోజకవర్గంతోపాటు.. పార్టీ మారడం ఆయనకు అలవాటుగా మారింది. తొలిగా టీడీపీ, ఆ తర్వాత ప్రజా రాజ్యం, అక్కడ నుంచి కాంగ్రెస్. తిరిగి టీడీపీకి ఆయన మారిపోయారు. పార్టీ మారిన ప్రతిసారీ నియోజకవర్గం మారుస్తూ వస్తున్నాడు. గెలుస్తున్నారు. గెలవడమే కాదు తనకంటూ ఒక వర్గాన్ని తయారు చేసుకోవడం ఆయనకు తెలిసినట్లుగా మిగతా నేతలకు తెలియదు. వారే ఆయన్ను గెలిపించే కసరత్తు చేస్తారు. ఇప్పుడు గంటా చూపు విశాఖ నుంచి విజయనగరానికి మారిందంటున్నారు. 
మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గం విశాఖ జిల్లాలోని భీమిలి. సినిమా షూటింగ్ లకు నిలయమైన ప్రాంతం. పర్యాటకంగాను మంచి పేరుంది. కానీ మరోసారి అక్కడ నుంచి పోటీ చేసేందుకు గంటా సిద్దపడటం లేదు. ఆయన స్థానంలో అనకాపల్లి ఎంపీ శ్రీనివాస్ ఈ సారి బరిలోకి దిగుతారంటున్నారు. అదే జరిగితే… వైకాపా నుంచి బొత్స సత్యనారాయణను రంగంలోకి దింపే పని చేస్తున్నారు జగన్. బొత్స పోటీ చేస్తే గంటాకు ఇబ్బందే. అదే అనకాపల్లి ఎంపీ శ్రీనివాసరావు భీమిలిలో గంటాకు బదులు టీడీపీ పక్షాన బరిలోకి దిగితే తన బంధువు చిన శ్రీనును బొత్స బరిలోకి దింపుతారంటున్నారు. చిన శీనును గెలిపించుకునే బాధ్యతను తాను తీసుకుంటానని చెప్పారు సత్తిబాబు. 
పిల్లి పిల్లలను మార్చినట్లు…
గంటా నియోజకవర్గ ప్రజలకు పెద్దగా అందుబాటులో ఉండటం లేదనే వాదనుంది. అభివృద్ధి పనుల విషయంలో గంటాను కలుద్దామనుకున్న ప్రజలకు నిరాశ మిగులుతోంది. మళ్లీ కొత్త నియోజకవర్గంలో అడుగు పెట్టేందుకు గంటా ఆలోచన చేయడంతోనే ప్రజలను పట్టించుకోడవం లేదనే విమర్శ ఉంది. 1999లో టీడీపీ నుంచి అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి గెలిచారు గంటా. ఆ తర్వాత 2004లో చోడవరంలో ఎమ్మెల్యేగా రేసులో నిలిచి విజయం సాధించారు. టీడీపీలో కలిసి రాలేదని ఆయన పార్టీ మారారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ పక్షాన అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా పని చేశారు. 2014లో గంటా పార్టీనే కాదు.. నియోజకవర్గాన్ని మార్చారు. కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరాడు. ఆ తరువాత భీమిలి నుంచి పోటీ చేసి గెలిచాడు. టీడీపీ నుంచి ప్రజారాజ్యం.. ఆ తర్వాత కాంగ్రెస్, తిరిగి టీడీపీకి మారినా ఓటమి ఎదురుకాలేదు. ఈ సారి టీడీపీలోనే ఉంటారా.. లేదా అనే చర్చ సాగుతోంది. అంతే కాదు.. భీమిలి నుంచి ఇంకోసారి పోటీ చేస్తే గెలుస్తానా లేదా అనే అనుమానం వచ్చిందట. అందుకే ఈ సారి గంటా మరో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే చర్చ సాగుతోంది. 
భూ కుంభకోణంలో గంటా శ్రీనివాసరావు పాత్ర ఉందని ఆ జిల్లా మంత్రి అయ్యన్న పాత్రుడు చేసిన ఆరోపణ. చాలా ఆధారాలనే చూపించారు. కాకపోతే సిఎం చంద్రబాబు ఆయన్ను శాంతపరిచారు. లేకపోతే టీడీపీ ప్రభుత్వం కూసలను ఆ కుంభకోణం కదిలించేది. ఇప్పుడు గంటా భీమిలి నుంచి మరో నియోజవర్గానికి మారేందుకు సిద్దమయ్యారు. ఈసారి యలమంచిలి లేకపోతే విజయనగరం జిల్లా నెల్లిమర్లను ఎంచుకుంటారని పార్టీ వర్గాలంటున్నాయి. 
కొడుకు కోసం…
మంత్రి గంటా శ్రీనివాసరావు కొడుకు రవి తేజ. జయదేవ్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. పూర్తిగా ఆ సినిమా నిరాశపరిచింది. ఫలితంగా ఆయన సినిమాలను పక్కనపెట్టి రాజకీయాల వైపు చూస్తున్నారు. చోడవరం నియోజవర్గం నుంచి పోటీచేసే ఆలోచన చేస్తున్నారు. అక్కడ టీడీపీ ఎమ్మెల్యే రాజు మరోసారి పోటీ చేస్తానంటున్నారు. ఒకవేళ టీడీపీ నుంచి టిక్కెట్ రాకపోతే జనసేనలో చేరి చోడవరంలో పోటీ చేసేందుకు రవి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే రాజకీయం రసవత్తరంగా మారనుంది.  
విజయనగరం జిల్లా నెల్లిమర్ల నుంచి పోటీ చేసే యోచనలో ఉన్నారట గంటా. కడప జిల్లా ఇంచార్జ్ మంత్రిగా ఉన్న ఆయన విజయనగరం జిల్లా ఇంచార్జ్ మంత్రిగా రావడానికి కారణం కూడా అదేనని టీడీపీ వర్గాల్లో చెబుతున్నాయి. విశాఖ జిల్లాలో మంత్రి అయ్యన్నపాత్రుడితో పడకపోవడం, చిన్న దానికి, పెద్ద దానికి విమర్శలు చేయడాన్ని తట్టుకోలేక పోతున్నారట. నెల్లిమర్ల ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత పతివాడ నారాయణస్వామికి వయోభారంలో పడ్డారు. ఈసారి టికెట్ దక్కే చాన్స్ లేదని తెలుస్తోంది. ఆయన వారసులపైనా నియోజకవర్గంలో అవినీతి ఆరోపణలు ఉన్నాయి. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకునే పని చేస్తున్నారు గంటా. సిఎం చంద్రబాబు ఇందుకు అనుమతిస్తారో లేదో చూడాలి. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*