కార్యాచరణ ప్రకటించిన చంద్రబాబు

హోదా పోరులో కొన్ని పార్టీలు వెనుకబడగా.. బంద్ తో మరికొన్ని పార్టీ ముందుకు వచ్చాయి. బంద్ కు దూరంగా ఉన్న టీడీపీ కొత్త ఆలోచనలు చేస్తోంది. ఏం చేసినా తమకు మైలేజ్ వచ్చేలా చూడటం సిఎం చంద్రబాబుకు తెలిసినట్లుగా మరెవరికీ తెలియదు. అంత వ్యూహకర్త చంద్రబాబు. అందుకే ఇప్పుడు ఈనెల 20న చంద్రబాబు పుట్టిన రోజునాడు దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ తెల్లారి నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నారు. ఈ విషయంపై చర్చించేందుకు టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు చంద్రబాబు. అక్కడే కార్యాచరణపై వ్యూహ రచన చేశారు.  
నియోజకవర్గ కేంద్రాల్లో సైకిల్ ర్యాలీలు…
వైఎస్సార్సీపీ చేస్తున్న మాటల దాడికి గట్టిగా కౌంటరివ్వాలని నేతలకు సూచించారు. అంతే కాదు.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైకాపా పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ ఫేక్‌ పార్టీ.. ఫేక్‌ ఫొటోలు, ఫేక్‌ వీడియోలు అని విమర్శించారు. వైసీపీ రాజకీయమే ఫేక్‌ అని వ్యాఖ్యానించడం విశేషం. దీక్ష తెల్లారి నుంచి హోదా ఉద్యమాన్ని మరింతగా విస్తరించనున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 21నుంచి నియోజకవర్గాల్లో సైకిల్ యాత్రలు చేపట్టనుంది టీడీపీ. ప్రతి నియోజకవర్గ కేంద్రాల్లో భారీ బహిరంగ సభలు జరపాలని పిలుపునిచ్చారు. అన్ని నియోజకవర్గాల్లో ప్రభుత్వ విజయాల పండుగలు నిర్వహించాలని వారికి చెప్పారు. ప్రభుత్వ విజయాలపై రోజుకో అంశంపై ప్రచారం చేయాలన్నారు. పనులు చేయడం ఎంత ముఖ్యమో ప్రజల్లోకి తీసుకెళ్లడం అంతే ముఖ్యమని చంద్రబాబు చెప్పడం ఆశ్చర్యమే. రాబోయే కాలంలో ఎన్నికలు వస్తున్నాయి. మనం చాలా మంచి పనులు చేసాం. ఆ సంగతి జనాలకు తెలియక పోతే ఇబ్బందే. అందుకే ఎప్పటికప్పుడు ప్రచారాల ద్వారా వారికి తెలియజేయాలని కోరారు చంద్రబాబు. 
సామూహిక దీక్షలు
ఏపీలో అభివృద్ధి అద్భుతంగా ఉందని పక్క రాష్ట్రాల వారు చెబుతున్నారు. కానీ మన జనాలకు తీసుకెళ్లకపోతే ఎలా అంటున్నారు చంద్రబాబు.  విజయవాడలో ఈనెల 20న జరిగే నిరసన దీక్షపై సమావేశంలో చర్చించారు. 175 నియోజకవర్గాల్లో సామూహిక దీక్షలు నిర్వహించాలని, దీక్షలలో ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జ్‌లు పాల్గొనాలని పిలుపునిచ్చారు. మొత్తం ఏపీలోని 13 జిల్లాల్లో 13మంది మంత్రులు దీక్షలలో కూర్చోవాలని ఆదేశించారు చంద్రబాబు. మిగిలిన మంత్రులు విజయవాడ దీక్షలో పాల్గొనాలని చంద్రబాబు కోరడం హాట్ టాపికైంది. మరోవైపు ఎంపీల నియోజకవర్గ ర్యాలీల విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎంపీల రాజీనామాల విషయంలోను కీలక నిర్ణయం తీసుకోలేక పోయారు చంద్రబాబు. వారి రాజీనామాల వల్ల వచ్చే ప్రయోజనం ఏం లేదు. వైకాపా నేతలు దొంగ రాజీనామాలు చేశారు. ఆమోదం పొందకుండా చూసుకున్నారు. ఆ సంగతి జనాలకు చెప్పాలన్నారు. ఫలితంగా ఇప్పుడు టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.  
 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*