వైదొలిగిన తొగాడియా..సంబరాల్లో మోడీ, షాలు

మూడు దశాబ్దాల పాటు విశ్వ హిందూ పరిషత్‌(వీహెచ్‌పీ)లో కీలక బాధ్యతలు నిర్వహించారు ప్రవీణ్‌ తొగాడియా. నేడు ఆ సంస్థ నుంచి పూర్తిగా వైదొలిగారు. వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో ఆయన నామినేట్‌ చేసిన రాఘవరెడ్డి పరాజయం పాలయ్యారు. అందుకే ఆయన అసలు విహెచ్ పీ నుంచి పక్కకు వెళ్లారు. తొగాడియా 2011 నుంచి వీహెచ్‌పీకి ఇంటర్నేషనల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు. వీహెచ్‌పీ కొత్త ఇంటర్నేషనల్‌ ప్రెసిడెంట్‌గా హిమాచల్‌ప్రదేశ్‌ మాజీ గవర్నర్‌ వీఎస్‌ కోక్జె బాధ్యతలు తీసుకున్నారు. కోక్జెకు131 ఓట్లు రాగా, ప్రస్తుత అధ్యక్షుడు రాఘవరెడ్డికి 60 ఓట్లే దక్కాయి. తొగాడియా టీమ్ పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. తాను ఎంతగా సంస్థను ముందుకు తీసుకెళ్లినా సభ్యులు తన మీద సానుకూలంగా లేరనే అక్కసుతో ఆయన అసలు సంస్థ నుంచే వైదొలగడం ఆశ్చర్యం.
విహెచ్ పీ అధ్యక్ష పదవికి ఎన్నికలు ఐదు దశాబ్దాల తర్వాత తొలిసారి జరిగాయి. ఎప్పుడూ కీలక నేతను చూసి ఎన్నుకోవడమే తప్ప ఎన్నికల ఊసే లేదు. కానీ ఈ సారి అలా జరగలేదు. ఎందుకంటే ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలకు కంట్లో నలుసుగా మారాడు తొగాడియా. అనేక విషయాల్లో వారికి ఎసరు పెడుతున్నారు. అలా అయినా తొగాడియాను పక్కన పెట్టారనుకున్నారు వాళ్లు. అధ్యక్ష ఎన్నికలు వారికి కలిసొచ్చింది. అంతే మూడో కంటికి తెలియకుండా పావులు కదిపారు. అసలు విహెచ్ పీలోనే తొగాడియాకు చెక్ పెట్టడంతో దిమ్మె తిరిగి మైండ్ బ్లాంక్ అయిందట. అంతే పూర్తి నిరాశలో కూరుకుపోయాడు తొగాడియా. ముప్పై ఏళ్ల పాటు సేవలందించిన సంస్థ నుంచి ఆయనకై ఆయనే వైదొలగడం ఆశ్చర్యమే. 
మరోవైపు అధ్యక్ష పదవి ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని తొగాడియా ఆరోపించారు. వీహెచ్‌పీ నుంచి వైదొలిగినా హిందువుల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తానని చెప్పారాయన. 
ఏం చేశారంటే…
తాము తీసుకున్న నిర్ణయాలను చాలా వరకు తొగాడియా తిప్పికొడుతున్నారు. పక్కలో బల్లెంలా మారారు. అందుకే ముందుకు ఏనుగు కుంభస్థలం కొడితే మిగతా వారు దారిలోకి వస్తారని భావించారు. అందుకే విహెచ్ పీ ఎన్నికల్లో జోక్యం చేసుకున్నారు. తమ అనుచరులను రంగంలోకి దింపారు. అవసరమైన కసరత్తు పూర్తి చేశారు. ఎప్పటిలానే ఏకగ్రీవం అవుతుందనుకున్నారు తొగాడియా. అందుకే పెద్దగా కసరత్తు చేయలేదు. అదే కొంపముంచింది. మూడు దశాబ్దాల పాటు తనతో ఉన్న వారు ఎదురు తిరుగుతారు అనుకోలేదు. అందుకే అతి విశ్వాసానికి పోయాడు. అదే చివరకు పరాజయం పాలు అయ్యేలా చేసింది. ఓటమిని జీర్ణించుకోలేక పోయారు. తాను ఇంతగా సంస్థ అభివృద్ధికి కృషి చేశాను. అయినా తన పై నమ్మకం ఉంచలేదని రుసరుసలాడారు. చివరకు విశ్వ హిందూ పరిషత్ నే కాదనుకున్నారు. పక్కకు తప్పుకున్నారు. అలా తప్పుకోవడంలో కీలక పాత్ర పోషించిన మోడీ, అమిత్ షా లు ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్నారట. తాము పార్టీలో తీసుకున్న చాలా నిర్ణయాలను తొగాడియా ప్రభావితం చేసేవారనేది వారి అభిప్రాయం. అందుకే తమకు అడ్డుగా ఉన్న వారు లేకపోయేసరికి ఇక వారికి తిరుగే లేదంటున్నారు.  

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*