టి కాంగ్రెస్ నేత‌ల మధ్య బ‌స్సు యాత్ర చిచ్చుపెట్టింది..

టీ- పీసీసీ ప్రతిష్టాత్మకంగా చేప‌ట్టిన ప్రజాచైత‌న్య బ‌స్సుయాత్ర కాంగ్రెస్‌ క్యాడ‌ర్‌లో జోష్ నింపుతుండగా.. నేత‌ల్లో మాత్రం నైరాశాన్ని పెంచుతోందట. రాష్ట్రవ్యాప్తంగా నిస్తేజంగా ఉన్న కార్యక‌ర్తలు ఈ సందర్భంగా ఐక్యంగా క‌దంతొక్కుతుంటే.. రాష్ట్రస్థాయి నాయ‌కుల మధ్య వైరం పెరుగుతోందట. అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల నుంచి ఎమ్మెల్యేలను స‌స్పెండ్ చేసి ఇద్దరు ఎమ్మెల్యేల స‌భ్యత్వాన్ని ర‌ద్దుచేసిన‌ సంగతి తెలిసిందే! ఆ త‌ర్వాత కాంగ్రెస్ పార్టీ తిరిగి బ‌స్సుయాత్రను కంటిన్యూ చేస్తోంది. ఇప్పటికే ఇర‌వై నియోజ‌క‌వ‌ర్గాల‌లో బ‌స్సుయాత్ర పూర్తయ్యింది. ఇంకా కొన‌సాగుతూనే ఉంది. అయితే బ‌స్సుయాత్ర ప్రారంభమైన తొలినాళ్లలో కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్య కొంత ఐక్యత క‌నిపించింది. ఎడ‌మొహంగా ఉన్న నేత‌ల‌ను సైతం ఈ యాత్ర ఏకంచేసింది. ఇక అంతా సాఫీగా సాగుతోంద‌ని కాంగ్రెస్ శ్రేణులు సంబ‌ర‌ప‌డుతోన్న స‌మ‌యంలోనే పాల‌కుర్తిలో సభ జరిగింది.
ఈ స‌భతో సీనియ‌ర్ల మ‌ధ్య ఒక్కసారిగా గ్యాప్ ఏర్పడిందన్న ప్రచారం జ‌రుగుతోంది. నిజానికి ఇప్పటివ‌ర‌కు జ‌రిగిన కాంగ్రెస్ స‌భ‌ల్లో పాల‌కుర్తి స‌భే గ్రాండ్ స‌క్సస్ అయిందని చెప్పాలి. టీఆర్ఎస్ బ‌లంగా ఉన్నచోట.. అప‌జ‌యం ఎరుగ‌ని నేత‌గా పేరు తెచ్చుకున్న ఎర్రబెల్లి ప్రాతినిధ్యం వ‌హిస్తోన్న పాల‌కుర్తిలో వేలాదిగా ప్రజలు తమ సభకి త‌ర‌లిరావ‌డం చూసి కాంగ్రెస్ నేత‌లు సంబరపడిపోయారు. ఆ ఊపు కాంగ్రెస్ నేత‌ల ప్రసంగాల్లోనూ స్పష్టంగా క‌నిపించింది. అదే జోష్‌లో మాట్లాడిన ప‌రిగి రామ్మోహ‌న్‌రెడ్డి, జంగా రాఘ‌వరెడ్డి, మాజీఎంపీ ర‌వీంద్రనాయ‌క్ వంటి నేత‌లు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కాబోయో ముఖ్యమంత్రిగా అభివ‌ర్ణించారు. అంతేకాకుండా- “రేవంత్‌రెడ్డిని ముందుకు పంపండి ఉత్తమ్ జీ! మీరే సీఎం” అంటూ ర‌వీంద్రనాయ‌క్ చేసిన ప్రసంగం పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇదే స‌మ‌యంలో ఉత్తమ్‌ కూడా కాంగ్రెస్‌ అధికారంలోకి వ‌స్తే ఏమి చేస్తుందో హామీల రూపంలో స్పష్టంచేస్తున్నారు. పనిలో అక్కడ‌క్కడ అభ్యర్థుల‌ను కూడా ప్రక‌టించేస్తున్నారు. పాల‌కుర్తి స‌భ‌లో జంగా రాఘ‌వ‌రెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రక‌టించేశారు. ఈ అంశమే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వేడిపుట్టిస్తోంది. జానారెడ్డి వంటి సీనియ‌ర్లకు ఉత్తమ్ వ్యవ‌హారం రుచించ‌డం లేద‌న్న వాద‌న‌లు బలంగా వినిపిస‌్తున్నాయి.
ఎన్నిక‌ల్లో విజయం సాధించి, ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ వచ్చిన తర్వాత ఏఐసీసీ నేతలు ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపికచేసి.. సీల్డ్ క‌వ‌ర్ ద్వారా ఆ స‌మాచారాన్ని తెలియజేయడం అనేది ఇప్పటివరకూ సంప్రదాయంగా వస్తోంది. పార్టీ పక్షాన బ‌రిలో నిలిచే అభ్యర్థుల జాబితాను కూడా కాంగ్రెస్ హైక‌మాండే ప్రక‌టిస్తుంది. కానీ అందుకు భిన్నంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యవ‌హ‌రిస్తున్నార‌ని పార్టీలోని ప‌లువురు నేత‌లు గుర్రుగా ఉన్నారట. ఉత్తమ్ ప‌క్కా ప్లాన్ ప్రకారమే త‌న‌ను తాను సీఎం అభ్యర్థిగా ఎస్టాబ్లిష్‌  చేసుకుంటున్నార‌నే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పాల‌కుర్తి స‌భ‌లో ప‌లువురు నేతలు ఉత్తమ్‌ను కాబోయే సీఎం అంటూ ప్రసంగించ‌డంతో అదే వేదిక మీద ఉన్న జానారెడ్డికి ఆ అంశం రుచించ‌లేద‌ట. ఇలా అని పార్టీ శ్రేణుల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అందుకే ఆయ‌న త‌న ప్రసంగాన్ని ముగించుకుని స‌భ‌ జరుగుతుండనే వెళ్లిపోయారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పార్టీని ప్రజ‌ల్లోకి తీసుకెళ్లడం కంటే నేత‌లు వ్యక్తిగ‌తంగా ప్రయోజ‌నం పొందాల‌నే ల‌క్ష్యంతో బస్సుయాత్ర సాగుతున్నట్లుగా ఉంద‌ని కొందరు అంటున్నారట. చూద్దాం.. ఈ పరిణామం ఎటు దారితీస్తుందో!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*