గడ్డం తీసిన రాఘవేంద్రరావుకు షాక్

ఏపీలో హోదా ఉద్యమం జోరుగా సాగుతోంది. నిన్నటి దాకా హోదా అంటే మండిపడ్డ సిఎం చంద్రబాబు వద్దకు వెళ్లి మద్దతు ప్రకటించారు పలువురు సినీ ప్రముఖులు. సినీ పరిశ్రమ అంతా మీతో ఉంటుందని చెప్పారు. అంతే పత్రికల్లో తాటికాయంత అక్షరాలతో వార్తలు వచ్చాయి.  వాస్తవంగా మొదటి నుంచి హోదా ఉద్యమం చేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్. వామపక్షాలు తమ వంతుగా పోరాడుతున్నాయి. అందులో సందేహం లేదు. అలాంటి స్థితిలో హోదా కోసం పోరాడాలని కొత్తగా పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇలాంటి సమయంలో ప్రత్యేక హోదా ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని కొందరు సినీ ప్రముఖులు చెప్పారు. ఈ మేరకు సిఎం చంద్రబాబును కలిసి మద్దతు పలికారు. దీన్ని ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళీ తప్పు పట్టారు. మొత్తం సినీ పరిశ్రమ తరఫున వకాల్తా పుచ్చుకొని చంద్రబాబుకు మద్దతు ఇవ్వడానికి మీరు ఎవరు అని ప్రశ్నించారు. అశ్వనీదత్‌, కేఎల్‌ నారాయణ, రాఘవేంద్రరావు, కే నారాయణ, వెంకటేశ్వర్‌రావు, కిరణ్‌ తదితరులు చంద్రబాబును కలిసిన వారిలో ఉన్నారు. 
చిత్ర పరిశ్రమలో మిగతా వారిని సంప్రదించకుండా ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఆయన అడిగిన దాంట్లో లాజిక్ ఉంది. మొదటి నుంచి హోదా కోసం పోరాడుతున్న పదవులకు రాజీనామా చేసి ఆమరణ దీక్ష చేస్తున్న వారిని ఈ సినీ ప్రముఖులు పట్టించుకోలేదు. కానీ కొత్తగా హోదా అంటున్న వారి వద్దకు వెళ్లి సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. అదే ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. ప్రత్యేక హోదా కోసం బీజేపీ తప్ప మిగతా పార్టీలన్నీ ఉద్యమాలు చేస్తున్నాయి. వారి ఉద్యమానికి వీరు ఎందుకు మద్దతు ఇవ్వలేదని సినీ పెద్దలను నిలదీశారు పోసాని. సీఎంకు ఇలా మద్దతు ఇవ్వడం కులం రంగు పులుముకుంటోందని, చంద్రబాబు కమ్మ ముఖ్యమంత్రి కాబట్టి.. మేమంతా కమ్మోళ్లం చంద్రబాబుకు సపోర్టుగా ఉంటాం అన్నట్టుగా ఉందని ఆయన మండిపడ్డారు. సినీ పరిశ్రమలో పవన్ కల్యాణ్, చిరంజీవి, మోహన్ బాబు, ఎన్టీఆర్ వంటి ఎంతో మంది ఉన్నారు. వారెవరినీ సంప్రదించకుండా పరిశ్రమ అంతా మీతో పాటు ఉంటుందని ఎలా చెబుతారని గట్టిగానే అడిగేశారు పోసాని. పోయి పోయి పోసాని నోట్లో తల పెట్టడం ఎందుకు అని మిగతా వారు గమ్ముగా ఉన్నారు. లేకపోతే పోసానికి కౌంటర్ ఇచ్చేవారు టీడీపీ నేతలు.  

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*