జగన్ ను గద్దెక్కించడమే ఎర్రపార్టీల లక్ష్యం!

ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎం గా అధికారపీఠంపై కూర్చోబెట్టడమే రాష్ట్రంలోని వామపక్ష పార్టీల లక్ష్యంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సంకీర్ణం ఏర్పడే పరిస్థితే వస్తే గనుక.. జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చి ఆయన ప్రభుత్వం ఏర్పడేలా తాము కీలకంగా వ్యవహరించాలని ఎర్ర పార్టీలు కలగంటున్నట్లుగా  ప్రజలు భావిస్తున్నారు. ఈ పార్టీలు ప్రస్తుతం… పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీతో జట్టు కట్టి.. ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఎన్నికల ఫలితాల అనంతర పరిణామాలను ఊహించేట్లయితే.. ఈ కూటమి పటాపంచలైనా ఆశ్చర్యం లేదని పలువురు భావిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. తాజాగా కడపలో జరుగుతున్న సీపీఐ మహాసభలకు సీపీఎం నాయకుడు మధు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబునాయుడు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎంతమాత్రమూ లేదని జోస్యం చెప్పారు. రాబోయే ఎన్నికలో జనసేనతో జట్టుగా ఉన్న వామపక్షాలు కూడా కీలకంగా ఉండి, కొన్ని సీట్లకు పోటీచేసే అవకాశం ఉందని  పలువురు భావిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తమ కూటమి ఏకంగా అధికారంలోకి వచ్చేస్తుందనే భ్రమ.. రాజకీయాల్లో సీనియర్ అయిన మధుకు కూడా ఉండకపోవచ్చు.

అంటే- ఆయన పరోక్షంగా జగన్మోహన రెడ్డి ముఖ్యమంత్రి కావడాన్నే కోరుకుంటున్నట్లుగా ఉన్నదని ప్రజలు భావిస్తున్నారు.  జగన్ సొంత పార్టీ స్థాపించిన నాటినుంచి.. సీపీఎంతో ఆయన సత్సంబంధాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ తరుణంలో  సీపీఎం పవన్ కల్యాణ్ తో జట్టు కట్టి ఉన్నది గానీ.. రేపు ఎన్నికల అనంతరం ఉండగల బలాబలాలను బట్టి.. వారు జగన్ వైపు ఫిరాయించి.. ఆయనను ముఖ్యమంత్రిని చేయడానికి తమ శక్తివంచన లేకుండా పాటుపడే అవకాశం లేకపోలేదని పలువురు విశ్లేషిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో తమకు రెండు మూడు సీట్లు దక్కినా సరే.. సీపీఎం వంటి పార్టీలు ఆ సమయానికి గెలిపించిన జనసేనను కూడా కాదనుకుని.. అధికారం ఉంటుందనిపిస్తే జగన్ పంచన చేరినా.. ఆశ్చర్యం లేదని… అందుకే ఇప్పటినుంచి పరోక్షంగా జగన్ సీఎం అవుతారనే సంకేతాలు ఇస్తున్నారని ప్రజలు అంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*