చంద్రబాబు హస్తిన రాజకీయం

హస్తినకు వెళుతున్నారు సిఎం చంద్రబాబునాయుడు. ఏపీకి న్యాయం చేసే దిశగా ఆయన ఎత్తులు వేయనున్నారు. ఇందులో భాగంగా జాతీయ నేతలతో భేటీ కానున్నారు. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సమాజ్‌వాదీ పార్టీ ముఖ్యనేత ములాయంసింగ్‌ యాదవ్‌, బీఎస్పీ అధినేత్రి మాయావతి, జేడీఎస్‌ అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవగౌడ, ఢిల్లీ సీఎం, ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు సుదీప్‌ బందోపాధ్యాయ, బీజేడీ లోక్‌సభాపక్ష నేత భర్తృహరి మెహతాబ్‌, శిరోమణి అకాలీదళ్‌ సీనియర్‌ నాయకుడు, పంజాబ్‌ మాజీ సీఎం ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌, ఎల్‌జేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌, శివసేన ముఖ్యులతోను ఆయన మాట్లాడనున్నారు. కాంగ్రెస్ లోక్ సభా పక్ష నేత మల్లిఖార్జున ఖర్గేతోను వివిధ అంశాలపై చర్చించనున్నారు. 
రాష్ట్ర విభజన బిల్లులో పేర్కొన్న అంశాల అమలులో బీజేపీ తీరును ఆయన తప్పు పట్టారు. అందుకే తమకు మద్దతు కూడగట్టేందుకు చంద్రబాబు పావులు కదుపుతున్నారు. తిరుపతి సభలో మోడీ ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని చంద్రబాబు కోరనున్నారు. ఢిల్లీకి మించిన రాజధాని నిర్మాణ హామీతోపాటు.. విభజన చట్టంలో పేర్కొని రాష్ట్రానికి రావల్సిన ప్రయోజనాలు అమల కోసం పోరాడనున్నారు. 14 ఆర్థిక సంఘం పేరుచెప్పి హోదా విషయంలో తప్పించుకుంటోంది కేంద్రం. అలా కాకుండా హోదా ప్రకటన చేసేలా ఒత్తిడి తేనుంది. అంతే కాదు… తృతీయ ఫ్రంట్ ఏర్పాటు పైనా కసరత్తు చేయనున్నారు. 
ఢిల్లీ చేరుకోగానే ముందుగా సీఎం టీడీపీ ఎంపీలతో అవిశ్వాసంపై పార్లమెంటు లోపల, బయట అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు. ఒకవైపు రాజ్యసభలో కొత్త సభ్యుల ప్రమాణస్వీకారాలు, మరోవైపు.. అవిశ్వాస తీర్మానాల అస్త్రాలు, బాబు పర్యటనతో ఢిల్లీ వాతావరణం రసవత్తరంగా మారనుంది. మూడు రోజుల పాటు ఢిల్లీలోనే చంద్రబాబు మకాం వేయనుండటంతో బీజేపీ నేతలు ఏం జరుగుతుందనే అంశంపై ఉత్కంఠగా ఉన్నారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*