కియా కార్ల కంపెనీ రాక ఎలా సాధ్య‌మైంది అంటే…

కార్ల తయారీలో ప్రపంచంలోనే పేరెన్నికగన్న సంస్థ కియా! దక్షిణ కొరియాకు చెందిన ఈ పరిశ్రమ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టింది…దేశంలో అత్యంత తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లాలలో ఒకటైన అనంతపురంలోని పెనుగొండలో కియా కార్ల పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పరిశ్రమ రాకతో పెనుగొండే కాదు.. చుట్టుపక్కల నియోజకవర్గాల ఆర్ధిక స్థితిగతులు మారబోతున్నాయి.. ప్రజల జీవనవిధానం మెరుగుపడనుంది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో పెడుతున్న అతి పెద్ద పరిశ్రమ ఇదే కావడం విశేషం! కియాను ఏపీకి తీసుకురావడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పడిన శ్రమ అంతా ఇంతా కాదు! తన బ్రాండ్‌ ఇమేజ్‌ను పణంగా పెట్టి మరీ అనుకున్నది సాధించారు. ఏపీ ఎకనమిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు.. రాష్ట్ర అధికారులు కూడా చాలా కష్టపడ్డారు. మొత్తంమీద అనుకున్నది సాధించగలిగారు.. 
కియా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్‌కు వస్తుందని తెలుసుకుని గుజరాత్‌ లాబీ అప్రమత్తమయ్యింది. కియాను గుజరాత్‌లో ఏర్పాటు చేస్తే అత్యధిక రాయితీలు ఇస్తామని.. గుజరాత్‌ అయితే కార్ల మార్కెటింగ్‌కు కూడా అనువుగా ఉంటుందని చెప్పుకొచ్చింది… పైగా గుజరాత్‌ ప్రధానమంత్రి స్వరాష్ట్రమని చెబుతూ… ఆ రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న పరిశ్రమల జాబితాను.. అక్కడ ఇస్తున్న రాయితీలను కియా అధికారులు పంపింది గుజరాత్‌ లాబీ! గుజరాత్‌ నుంచి.. చివరకు ఢిల్లీ నుంచి కూడా కియా యాజమాన్యానికి పదేపదే ఫోన్‌లు వెళ్లాయి.. ఈ ఫోన్‌కాల్స్‌తో కియా యాజమాన్యం కూడా విసిగిపోయింది.. తాము పరిశ్రమ ఏర్పాటు చేసేటప్పుడు అంతర్జాతీయ ప్రమాణాలను దృష్టిలో పెట్టుకుంటామని.. రాజకీయ సుస్థిరత.. వాతావరణం.. భూమి.. నీరు.. రాయితీలు.. తమకు లభించే ఆదరణ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని భారత అధికారులకు స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే తాము ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చామని వివరించారు.. ఏపీ ప్రభుత్వం  తమకు నెల రోజుల్లోనే అనుమతులన్నీ ఇచ్చేసిందని చెప్పారు.. ఇంతటితో గుజరాత్‌ అధికారులు ఊరుకోవాలి కదా!  చివరి ప్రయత్నంగా ఢిల్లీలోని కేంద్ర మంత్రిత్వ శాఖల్లో కూడా కొన్ని అనుమతులు తీసుకోవలసి ఉంటుందని చిన్నపాటి హెచ్చరికలాంటిది చేశారు. తాము నిబంధనలకు అనుగుణంగానే ప్రతిపాదనలు పంపుతామని…వాటిని తప్పకుండా ఆమోదించాల్సి ఉంటుందని కియా బదులిచ్చింది.. ఇక చేసేదేమీ లేక గుజరాత్‌ అధికారులు మిన్నకుండిపోయారు.  పెనుగొండలో తమ పరిశ్రమ నిర్మాణాన్ని కియా పరుగులు పెట్టిస్తోంది.. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కియాకు ఎలాంటి ఆటంకాలు కలుగకుండా చర్యలు తీసుకోవాలని అనంతపురం అధికారులకు.. అక్కడ ఉన్న రాజకీయ నేతలకు ఆదేశాలు పంపించారు. ఎన్డీయే మిత్రపక్షాలైన బీజేపీ-టీడీపీల మధ్య దూరం పెరిగిన మాట వాస్తవం.. రెండు పార్టీల మధ్య మాట యుద్ధం జరుగుతుండటం కూడా నిజమే! ఈ నేపథ్యంలోనే కియా వెనుక కథ ఏపీ సచివాలయంలో చక్కర్లు కొడుతోంది.. నిధులు ఇవ్వకపోగా.. వచ్చే పరిశ్రమలను కూడా బీజేపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తుందనే ప్రచారం సాగుతోంది.. కియా పరిశ్రమను గుజరాత్‌వైపుకు మళ్లించేందుకు ప్రయత్నించారని సాక్షాత్తూ సీనియర్‌ అధికారులే చెబుతుండటం గమనార్హం.. 
 
 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*