రంగ స్థలం సినిమా రివ్యూ

రేటింగ్: 3.25/5
నటీనటులు : రామ్‌చరణ్, సమంత, ఆది, ప్రకాష్‌రాజ్, జగపతిబాబు, అనసూయ, నరేష్, రోహిణి తదితరులు
నిర్మాతలు : నవీన్ ఏర్నేని, వై.రవిశంకర్, మోహన్
దర్శకత్వం : సుకుమార్
సంగీతం : దేవిశ్రీప్రసాద్
కెమెరా : ఆర్.రత్నవేలు
పాటలు : చంద్రబోస్
పరిచయ మాటలు…
మెగా పవర్ స్టార్ రాం చరణ్ ను 1980 దశకంలోకి తీసుకెళతానని మొదటి నుంచి చెబుతున్నాడు సుక్కు. అదేనండి దర్శకుడు సుకుమార్. అలానే చేశారా లేక ఆధునిక కాలంలో తీసుకెళ్లారా ఏం చేశారు. ఈ మూవీకి సంబంధించి దర్శకుడు సుకుమార్ సమీకరణాలు ఎలా ఉన్నాయి. ఏంటనేది ఆసక్తిని రేపింది. పెళ్లైయిన తర్వాత సమంత తెలుగు సినిమాలో నటించడం. అందులోను అత్తగా అనసూయ పాత్ర పోషించడం అన్ని ప్రత్యేకతలే. సుకుమార్ అంటనే లెక్కలు తూకాలు ఉంటాయి. రంగస్థలం అనే పేరే నాటకరంగానికి సంబంధించింది. రామ్‌చరణ్ చెవిటివాడి పాత్రను పోషించడం మరింత విశేషం. సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్ ఎలా ఉందో చూడాలంటే కథలోకి వెళ్లాల్సిందే. 
కథలోకి వెళితే….
కోనసీమలో రంగస్థలం అనే గ్రామం ఉంది. ఆ ఊళ్లో చిట్టిబాబు (రామ్‌చరణ్) పొలాలకు నీళ్లు పెట్టే ఇంజిన్‌ను నడుపుతుంటాడు. అందరితోను బాగుంటాడు. కాకపోతే కొంచెం చెవుడు. చాలా పెద్దగా మాట్లాడితే కాని వినిపించదు చిట్టిబాబుకు. ఊళ్లో వుండే రామలక్ష్మిని(సమంత) ప్రేమిస్తాడు. రంగస్థలం గ్రామ సర్పంచ్ ఫణీంద్ర భూపతి (జగపతిబాబు) 30 ఏళ్లుగా అదే పదవిలో కొనసాగుతుంటాడు. తన అధికారాన్ని ప్రశ్నిస్తే ఊరుకోడు. అడ్డు వస్తే చాలు చంపేయడానికి వెనుకాడడు. రైతులకు అప్పులిచ్చి వారి నుంచి బలవంతంగా భూములు రాయించుకుంటాడు. ప్రభుత్వం నుంచి మంజూరి అయిన రుణాలను కాజేస్తాడు. ప్రెసిడెంట్ ముందు చెప్పులు వేసుకొని నడవడానికి ప్రజలు వణుకుతారంటే నమ్మండి.
చిట్టిబాబు అన్న కుమార్‌బాబు (ఆది పినిశెట్టి) దుబాయ్ నుంచి రంగస్థలం ఊరికొస్తాడు. చాలా మంచోడు. అన్న అంటే చిట్టిబాబుకు ప్రాణం. ఓసారి రామలక్ష్మి పొలానికి సంబంధించిన అప్పు చెల్లించే విషయమై మాట్లాడేందుకు ప్రెసిడెంట్‌ ఇంటికి వెళతాడు కుమార్‌బాబు. ఇద్దరి మధ్య మాటలు పెరుగుతాయి. అది గొడవకు దారి తీసింది. ఫణీంద్రభూపతిని అడ్డుకునేందుకు ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంటాడు కుమార్‌బాబు. ఎమ్మెల్యే దక్షిణామూర్తి (పకాష్‌రాజ్) సహాయం తీసుకుని రంగంలోకి దిగుతాడు. అతన్ని హతమార్చేందుకు సర్పంచ్ మనుషులు రంగంలోకి దిగుతారు. ఈ విషయం తెలుసుకున్న చిట్టిబాబు అతన్ని రక్షిస్తాడు. ఈ నేపధ్యంలో అసలు ఏం జరిగింది.. ఏంటనేది ఆసక్తికరం. ఫణీంద్రభూపతికి ఎదురు నిలిచిన కుమార్‌బాబును ప్రత్యర్థులు ఏం చేస్తారు.. అన్న కోసం చిట్టిబాబు చేసిన పని ఏంటి… రంగస్థలం రాజకీయ రణక్షేత్రంలో ఎత్తుకు పై ఎత్తులు ఎవరివి… గెలుపు ఎవరి వశం అవుతుందనేది తెలుసుకోవాలంటే మూవీకి వెళ్లాల్సిందే. 
విశ్లేషణ….
1980వ దశకంలో గ్రామాల్లో ఉన్న పరిస్థితిని వివరించే ప్రయత్నం చేశాడు దర్శకుడు సుకుమార్. భూస్వామికి ఎదురొడ్డి పోరాడిన అన్నదమ్ముల చరిత్రనే కథ. తనదైన శైలిలో స్క్రిప్టు రాసుకుని రంగంలోకి దిగాడు సుకుమార్. చిట్టిబాబు, రామలక్ష్మి మధ్య వచ్చే సన్నివేశాలు చాలా బాగుంటాయి. పాటలు బయటకు వచ్చాక హమ్ చేస్తాం. చిట్టిబాబు-రామలక్ష్మి మధ్య జరిగే సరదా సంఘటనలు, ప్రెసిడెంట్ అరాచకాలను బాగానే నడిపించారు దర్శకుడు. ప్రెసిడెంట్ ఫణీంద్ర భూపతిని ఎదిరిస్తూ కుమార్‌బాబు ఎలక్షన్లలో పోటీ చేయడంతో అసలు కథలోకి వెళుతోంది. ఇక సెకండాఫ్ అనేక మలుపులు, భావోద్వేగభరిత సన్నివేశాలతో బాగానే కసరత్తు చేశారు. ఎలక్షన్ల ప్రచారానికి ఎమ్మెల్యే దక్షిణామూర్తి రంగస్థలం గ్రామానికి రావడం.. డబ్బులు తీసుకున్నాడని చిట్టిబాబుపై ఊరి ప్రజలు అనుమానపడటం వంటి సన్నివేశాలు ఆసక్తిని రేపుతాయి. కుమార్‌బాబుపై దాడి జరిగిన తర్వాత అసలు కథ మొదలవుతోంది. 
ఇక చిట్టిబాబుకు ఎప్పుడు అండగా నిలిచే పాత్రలో రంగమ్మత్త (అనసూయ) కీలకం. స్క్రీన్‌ప్లే బాగుంది. దక్షిణామూర్తితో చిట్టిబాబు వాదించడం, భావోద్వేగాలతో ఆడుకోవడంతో సినిమాపై ఉత్కంఠను పెంచింది.
పాత్రల పోషణ….
చిట్టిబాబు పాత్రలో రామ్‌చరణ్ దూరిపోయాడు. ఇటు అమాయకత్వం, అటు ధీరత్వం కలగలిసి ఉంటాయి. వినికిడిలోపం వల్ల చాలా సన్నివేశాల్లో అద్భుతమైన హాస్యం పండుతుంది.  గోదావరి యాసలో మాటలు చాలా బాగా సహజంగా పలికారు. అసలు ఇలాంటి భాష, యాస చిట్టిబాబుకు రావడం ఆశ్చర్యమే. రామ్‌చరణ్ కెరీర్‌లో ఇదో మంచి సినిమాగా నిలిచిపోతోంది. రామ్‌చరణ్ పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడని చెప్పాలి. మరోవైపు అందాల ముద్దుగుమ్మ రామలక్ష్మిగా అందం, అమాయకత్వం, చిలిపిదనం, కాస్త పొగరు ఉన్న పాత్రలో సమంత ప్రేక్షకుల్ని రంజింపజేసింది. రంగమ్మ మంగమ్మ’ పాటలో సమంత ఇరగదీసిందనే చెప్పాలి. రామలక్ష్మి పాత్ర సమంత కెరీర్ లో అలా నిలిచిపోతోంది. ఆది పినిశెట్టి బాగా చేసారు. ఇక ఎమ్మెల్యేగా ప్రకాష్‌రాజ్, దాదాపు విలన్ లాంటి భూస్వామ్య లక్షణాలున్న పాత్రలో ఫణీంద్రభూపతిగా జగపతిబాబు తమ పాత్రల్ని బాగా పోషించారు. చిట్టిబాబు అమ్మానాన్న పాత్రల్లో రోహిణి, నరేష్ నటన అదుర్స్. దేవిశ్రీప్రసాద్ సంగీతం ఆకట్టుకుంది. 
పాటలన్నీ సందర్భానికి అనుగుణంగానే ఉన్నాయి. పూజాహెగ్డే చేసిన ‘జిగేలు రాణి’ ఐటెంసాంగ్ మాస్ జనాలను హుషారెత్తించేలా ఉంది. కళా దర్శకులు రామకృష్ణ-మౌనికలు గ్రామీణ వాతావరణాన్ని గుర్తుకు తెప్పించారు. రంగస్థలం గ్రామీణ సెట్‌ను వారు తీర్చిదిద్దిన విధానం అద్భుతం. ఛాయాగ్రాహకుడు రత్నవేలు గోదావరి అందాల్ని, కోనసీమ కొబ్బరి సోయగాల్ని బాగా చూపారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. 
ప్లస్ పాయింట్స్…
+ రామ్‌చ‌ర‌ణ్, సమంత, జగపతిబాబుల నటన
+ సంగీతం
+ సినిమాటోగ్ర‌ఫీ
+ కళ దర్శకత్వ ప్రతిభ
మైన‌స్ పాయింట్స్‌…
– సినిమా లెంగ్త్ ఎక్కువ
– లాజిక్ లేని స‌న్నివేశాలు
– నత్తనడకగా కథనం
– ఆధునిక మేళవింపులు

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*