కేటీఆర్‌.. లోకేష్‌ల‌కు 2019 స‌వాల్‌!

తెలుగు రాష్ట్రాల్లో వ‌చ్చే ఎన్నిక‌లు వార‌సుల‌కు స‌వాల్ కాబోతున్నాయి. గ‌తానికి భిన్నంగా మారుతున్న రాజ‌కీయ ప‌రిస్థితులు అంచ‌నా వేయ‌టం కూడా క‌ష్టంగానే ఉంది. ఎవ‌రెటువైపు ఉంటారు.. మ‌రెలాంటి వ్యూహాల‌కు ప‌ద‌ును పెడ‌తార‌నేది బుర్ర‌కు అంద‌కుండా ఉంద‌నేది రాజ‌కీయ పండితుల ఆందోళ‌న‌. ఇటువంటి విప‌త్క‌ర వేళ‌.. కొద్దిపాటి రాజ‌కీయ అనుభ‌వం నెగ్గుకురావ‌టం.. అంత ఈజీయేం కాద‌నే చెప్పాలి. ముఖ్యంగా ఇటు తెలంగాణ‌, అటు ఏపీల్లోని ముఖ్య‌మంత్రులు.. చంద్ర‌శేఖ‌ర్‌, చంద్ర‌బాబులిద్ద‌రూ రాజ‌కీయంగా ఎంతో ప‌రిణితి వున్న నేత‌లు. పాల‌నాప‌ర‌మైన అనుభ‌వం వున్న వ్య‌క్తులు. వీరి వార‌సులు.. కేవ‌లం నాలుగేళ్ల పాల‌నా అనుభ‌వం వున్న‌ వారే. రాజ‌కీయంగా వ్యూహాల‌కు ప్ర‌తివ్యూహ ర‌చ‌న‌లు తెలియ‌వ‌నే చెప్పాలి. ప్ర‌త్య‌ర్థుల బ‌లాలు, బ‌ల‌హీన‌త‌లు అంచ‌నా వేయ‌టంలో ఇద్ద‌రిలో ఏ ఒక్క‌రికీ అనుభ‌వం లేదు. పైగా.. త‌మ వెన్నంటే ఉండి.. దెబ్బ‌తీసే కోవ‌ర్టుల గురించి ఆలోచించ‌గ‌ల ప‌రిణితి లేద‌నే చెప్పాలి. ఇద్ద‌రూ విదేశాల్లో చ‌దివినా.. స్వ‌దేశీ రాజ‌కీయాల‌పై పూర్తిస్థాయి అనుభ‌వం లేదు. వీరిద్ద‌రినీ అధికార పార్టీ కార్య‌క‌ర్త‌లు, నేత‌లు నెత్తిన పెట్టుకుని చూస్తున్నా.. అది అధికారంలో ఉన్నంత వ‌ర‌కే. ఒక్క‌సారి బ‌రిలోకి దిగాక‌.. అవ‌న్నీ ప‌టాపంచ‌ల‌వుతాయి.
అధికారం తారుమారైతే.. అప్ప‌టి వ‌ర‌కూ తాము చ‌విచూసిన ప‌రిస్థితుల‌కు భిన్నంగా ఉండాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా వున్న సొంత‌పార్టీ నేత‌లు వ‌ర్గాలు.. వాటి తాలూకూ ప్ర‌భావం ఇవ‌న్నీ వార‌సుల‌కు తెలుసా! అంటే క‌ష్ట‌మే. అఖిలేష్‌ యాద‌వ్ కు మంచి పేరున్నా.. చ‌దువుకున్నాడ‌నే అభిప్రాయం ప్ర‌జ‌ల్లో ఉన్నా.. చివ‌రి నిమిషంలో రాజ‌కీయ ఎత్తుగ‌డలు వేయ‌లేక‌పోవ‌టం, త‌న‌వారి వ‌ల్ల‌నే అధికారం చేజార‌డం ముందుగానే గ్ర‌హించ‌లేక‌పోయాడు. త‌మిళ‌నాడులోనూ ఇదే ప‌రిస్థితి.. ఇప్పుడున్న రాజ‌కీయ శూన్య‌త‌లో క‌రుణానిధి వంటి నాయ‌కుడు స‌మ‌ర్థంగా ఎదుర్కోవ‌టం కాదు.. ఏకంగా అధికారం చేతుల్లోకి తీసుకునేందుకు వీలైన ఎత్తులు వేసేవారు. వార‌సుడిగా స్టాలిన్ ఆ మేర ప‌రిణితి చెంద‌లేక‌పోయారు. పైగా.. కేంద్రంతో ఢీకొట్టే అనే సందేహం వ‌ద్ద ఆగిపోయారు.  తండ్రికి వార‌సులుగా మాత్ర‌మే రాజ‌కీయ తెర‌పైకి వ‌చ్చిన  కేటీఆర్‌, లోకేష్‌లకు 2019 చాలా క్రూషియ‌ల్ అనేది ఆ పార్టీ పెద్ద‌ల ఆలోచ‌న‌.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*