
ఏపీ రాజకీయాలను కుల సమీకరణాలు ప్రభావం చేయనున్నాయి. రాష్ట్ర విభజన తరువాత కాపు, మాల, బీసీల ఓట్లు మాత్రమే రాజకీయ పార్టీల గెలుపోటములను నిర్ణయిస్తాయనే అంచనాకు దాదాపు అన్ని పార్టీలు వచ్చాయి. పర్సంటేజ్ ప్రకారం చూసుకున్నా నాలుగైదు జిల్లాలు.. ఏ పార్టీ అధికారం చేపట్టాలనేది నిర్ణయించేంతటి శక్తిగా రూపుదిద్దుకున్నాయి. అందుకే.. ఏ పార్టీ అధికార పగ్గాలు చేపట్టినా ఆ జిల్లాలను నెత్తిన పెట్టుకుంటాయి. ప్రజారాజ్యం పార్టీ రాకతో కాపు సామాజికవర్గం కొంతమేర చిరంజీవివైపు నడచింది. దీనివల్ల కాంగ్రెస్ ఓట్లు చీలుతాయని భావించినా.. దాని ప్రభావం టీడీపీపై పడింది. అందుకే.. 2009లో మహాకూటమిగా బరిలో దిగినా ఓటమి చవిచూడకతప్పలేదు. ఇప్పుడు 2019లో సేమ్ ఇటువంటి పరిస్థితే ఎదురైతే నష్టం ఎవరికి అనేది కూడా ఇప్పుడు పార్టీలను వేధిస్తున్న ప్రశ్న. కాపు, మాల సామాజికవర్గాలు ఇప్పటి వరకూ కాంగ్రెస్, టీడీపీ వైపు ఉంటూ వచ్చాయి. గత ఎన్నికల్లో కొంతమేర కాపులు బీజేపీ వైపు మొగ్గుచూపారు. బీజేపీ ఏపీలో పాగా వేసేందుకు కాపుల ఓట్లకు గాలం వేయాలని భావించింది. హోదా విషయంలో వేసిన తప్పటడుగులతో అది కాస్తా బెడసికొట్టింది. దీంతో ఏపీలో ఓట్లు ఎంత వరకూ కమలానికి పడతాయనేది కూడా అనుమానమే.
ఇకపోతే.. జనసేన.. పవన్‌కళ్యాణ్ తాను ఏ కులానికి ప్రాముఖ్యత ఇవ్వనని చెప్పినా.. కాపుల్లో అధికశాతం యువత పవన్ వైపే ఉన్నారు. 18-25 ఏళ్ల వయసు గల ఓటర్లే.. గెలుపోటములను నిర్ణయించనున్న నేపథ్యంలో.. జనసేన చాలా వరకూ ఆ వర్గాన్ని తనవైపు తిప్పుకుంది. టీడీపీ కాపు కార్పొరేషన్ ద్వారా చేరువయ్యేందుకు ప్రయత్నించినా.. పర్యవేక్షణ లోపంతో అది పేదల వరకూ చేరలేకపోయింది. పైగా టీడీపీలోని కాపు నేతలు.. నిధులు బాగానే కాజేశారనే అపవాదు మూటగట్టుకున్నారు. అవినీతిలో వున్నది ఆ సామాజికవర్గం నేతలే అయినా.. దాని ప్రభావం టీడీపీపై పడుతుందనేది అంచనా. రాజకీయ చిత్రపటం మారుతున్న క్రమంలో కాపు నేతలు పవన్‌తో కలసి వెళతారా! లేక.. ఇప్పుడున్న పార్టీల్లోనే కొనసాగుతారా! అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నేతలు వెళ్లినా.. లబ్దిపొందిన కార్యకర్తలు, ప్రజలు టీడీపీ వైపు నిలుస్తారా అనేది కూడా చర్చనీయాంశమే. ఇదే జరిగితే.. వైసీపీలోని కాపు నేతలు బొత్స, వంగవీటి, ధర్మాన, ఉమ్మారెడ్డి వంటి నేతలతో సహా బీజేపీలో వున్న కన్నా లక్ష్మినారాయణ, మాణిక్యాలరావు వంటి నేతలు.. జనసేనలోకి రావచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఇవన్నీ.. గుసగుసలే అయినా.. వాస్తవానికి దగ్గరగా ఉండటమే విశేషం.
Be the first to comment