ఏకిపారేసిన‌… జ‌న‌సేనాని!

జ‌న‌సేనాని.. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ త‌మ రాజ‌కీయ వ్యూహం ఏమిటో చెప్పేశారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌తోపాటు.. వైసీపీపై తాము ఏమ‌నుకుంటున్నామ‌నేది బ‌హిర్గ‌తం చేశారు. అరుణ్‌జైట్లీను వ‌దల్లేదు.. చంద్ర‌బాబును వీడ‌లేదు.. లోకేష్‌పై కూడా దుమ్మెత్తిపోశాడు. గుంటూరులో జ‌రుగుతున్న జ‌న‌సేన 4వ వార్షికోత్స‌వ వేదిక‌పై ప‌వ‌న్ ప్ర‌సంగం జై భార‌త్‌మాతాకీ జై అంటూ మొద‌లైనా.. క్ర‌మంగా ఏపీకు  ప్ర‌త్యేక‌హోదా నుంచి ఏపీలో జ‌రుగుతున్న అవినీతి వ‌ర‌కూ అన్నింటిపై త‌న‌దైనశైలిలో స్పందించారు. 2014లో టీడీపీ మ‌ద్ద‌తు ఇవ్వ‌టం వెనుక‌.. కేవ‌లం ఆంధ్ర పునఃనిర్మాణ‌మే కానీ.. తెలుగుదేశం పార్టీ పునః నిర్మాణం కాద‌ని స్ప‌ష్టం చేశారు. గత నాలుగేళ్ల‌లో ఏపీలో ప్ర‌భుత్వం సాధించిన ప్ర‌గ‌తి కంటే.. అవినీతి అధిక‌మంటూ విమ‌ర్శించారు. క‌ర‌ప్ష‌న్ ఆంధ్ర‌గా మార‌టానికి చంద్ర‌బాబు వైఖ‌రి కార‌ణ‌మంటూనే.. లోకేష్ కూడా దానిలో పాత్ర కావ‌టాన్ని ప్ర‌స్తావించారు. లోకేష్ అవినీతి మీకు తెలియ‌దా అంటూ ప్ర‌శ్నించారు. అదిలాబాద్ జిల్లాలో ఓ ఆదివాసీ ఇంట‌.. ఎన్‌టీఆర్‌ను దేవుడిగా పూజించార‌ని.. కిలో రెండురూపాయ‌ల‌కు బియ్యం ఇచ్చిన మ‌హానుభావుడు అంటూ గుర్తు చేశారు. అటువంటి నేత మ‌నుమ‌లు ఇప్పుడేం చేస్తున్నారంటూ ప్ర‌శ్నించారు. జ‌గ‌న్ సీబీఐ కేసుల‌కు భ‌య‌ప‌డి కేంద్రంతో లాలూచీ ప‌డ్డారంటూ.. శాస‌న‌స‌భ‌కు రాకుండా వైసీపీ ఎమ్మెల్యేలు బాయ్‌కాట్ చేయ‌టాన్ని ఎద్దేవా చేశారు. స‌భ‌కు వెళ్ల‌కుండా నేను సీఎం అయ్యాకేనంటూ చెప్ప‌టంపై జ‌గ‌న్‌ను దుయ్య‌బ‌ట్టారు. వ‌చ్చే పంచాయ‌తీ, మున్సిపాలిటీ ఎన్నిక‌ల్లో మ‌న‌మేదో చాటుదామంటూ పిలుపునిచ్చారు. ఫాతిమా మెడిక‌ల్ క‌ళాశాల విద్యార్థుల‌కు న్యాయం చేయ‌క‌పోవ‌టాన్ని ప్ర‌శ్నించారు. వారికి న్యాయం చేస్తామంటూ.. హామీనిచ్చిన నేత‌లు ఎలా మ‌ర‌చిపోతార‌న్నారు. 1980 నాటి యువ‌త కాద‌ని.. ఇప్పుడున్న యువ‌త ర‌క్తం వేడెక్కి ఉంద‌న్నారు. స‌రికొత్త రాజ‌కీయ శ‌కం ప్రారంభ‌మైంద‌ని.. ప్రారంభం కాబోతుందన్నారు. తెలుగుదేశం ప్ర‌భుత్వానికి.. ఈ రోజు నుంచి వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌డ‌తామంటూ జ‌న‌సేనాని పిలుపునిచ్చారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*