యూపీలో బీజేపీకి చుక్కెదురు

బీహార్- ఉత్తరప్రదేశ్ లోక్ సభ ఉప ఎన్నికల్లో బీజేపీకి షాక్ త‌గిలింది. ఉత్తరప్రదేశ్‌లోని గోరక్‌పూర్, ఫూల్పూర్ స్థానాలకు, బీహార్‌లోని ఆరారియ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ గోరక్‌పూర్ స్థానానికి, డిప్యూటీ సిఎం కేశవ ప్రసాద్ మౌర్య రాజీనామాలు చేయడంతో రెండు స్థానాలకు ఉప ఎన్నికలు జరిపారు. గోరక్ పూర్ లో తొలిగా బీజేపీ విజయం సాధించే దిశగా వెళ్లింది. ఆ తర్వాత ఎస్పీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ నిషాద్ బిజెపి అభ్యర్థిపై 29 వేల ఓట్లకు పైగా మెజారిటీతో ఉన్నారు. పుల్పూరులో ఎస్పీ అభ్యర్థి బిజెపి అభ్యర్థిపై 16 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
ఫలితంగా ఉత్తర్‌ప్రదేశ్‌ ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి యోగీ ఆద్యిత్యనాథ్‌ కు ఎదురు దెబ్బ తగిలినట్లే. యూపీలో ఉప ఎన్నికలను భారతీయ జనతాపార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇక బీహార్‌ ఉప ఎన్నికల ఫలితాల్లో అరారియా లోక్‌సభా స్థానంలో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఆధ్వర్యంలోని ఆర్జేడీ ఆధిక్యంలో కొనసాగుతోంది. జెహనాబాద్‌ అసెంబ్లీ స్థానంలోనూ ఆ పార్టీ అభ్యర్థే ముందంజలో ఉండటం విశేషం. భబువాలో మాత్రం భాజపా అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
యూపీలో ప్రత్యర్థులుగా ఉంటూ వచ్చిన బహుజన సమాజ్ పార్టీ (బిఎస్పీ), సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) దోస్తీకి ఇది పరీక్షలాంటిదే. ఉప ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు ఏకం కావడం బీజేపీని ఇరుకున పడేసింది. ఈ ఉప ఎన్నికలను యోగి ఆదిత్యానాథ్ వచ్చే సాధారణ ఎన్నికలకు రిహార్సల్‌గా భావించారు. 2017 శాసనసభ ఎన్నికల్లో ఎస్పీతో కలిసి పోటీ చేసిన కాంగ్రెసు సొంతంగా అభ్యర్థులను నిలబెట్టింది. గోరక్‌పూర్ లోకసభ స్థానానికి యోగి ఆదిత్యానాథ్ ఐదు విడతలు ప్రాతినిధ్యం వహించడం విశేషం. 2017 శాసనసభ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పదవిని చేపట్టడంతో లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. పుల్పూర్ స్థానానికి మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ప్రాతినిధ్యం వహించిన చరిత్ర ఉంది. తొలిసారి 2014 ఎన్నికల్లో ఆ సీటును బిజెపి కైవసం చేసుకుంది. ఆ స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసిన కేశవ్ ప్రసాద్ మౌర్య విజయం సాధించిన సంగతి తెలిసిందే. 
2014లో జరిగిన యూపీ ఎన్నికల్లో చక్రం తిప్పిన బీజేపీకి ఇంత పెద్ద స్థాయిలో వ్యతిరేకత రావడం ఆశ్చర్యమే. ప్రధాని మోడీ పాలన తీరుతో పాటు.. యోగీ ఆదిత్యానాధ్ తీరును జనాలు వ్యతిరేకిస్తున్నారని అర్థమవుతోంది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*