అశోక్ బాబును దించే ఆలోచనలో వైరి వర్గం

కూరలో కరివేపాకులా మారాడు ఏపీ ఎన్.జి.ఓల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు. ఉద్యోగుల ప్రయోజనాల కంటే అధికారిక పార్టీల ప్రయోజనాలే ఆయనకు ముఖ్యమనే విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఎమ్మెల్సీ ఎస్.వేణుగోపాలరెడ్డితో పాటు.. ఉద్యోగ సంఘాల నేతలు ఆయనపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఉద్యోగులకు పిఆర్సీ వేయవలసి ఉంది. ఇంతవరకు దాని గురించి అశోక్ బాబు ప్రశ్నించడం లేదు. ఉద్యోగులకు డిఎ రావల్సి ఉన్నా.. ఆ సంగతి ప్రస్తావించడం లేదు. అసలు ప్రత్యేక హోదా గురించి మాట్లాడని అశోక్ బాబుకు ఇప్పుడు ఆ సంగతి గుర్తుకు వచ్చింది. అంతే ఉద్యోగుల ప్రయోజనాల కన్నా హోదా ముఖ్యమంటున్నారు. ఉద్యోగ సంఘాల నేతలు పార్టీలకతీతంగా వ్యవహరించాలనే వాదనుంది. కానీ అలా చేయకపోవడంతో అశోక్ బాబును దించే ప్రయత్నం చేస్తోంది వైరి వర్గం.  
జీవిత కాలం బాబునే సిఎం…
సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో బాగా హడావుడి చేశారు ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు. ఆ తర్వాత అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి వెళ్లడం తప్ప ఏం చేయడం లేదు. చంద్రబాబు సర్కార్ ను పొగడ్తలతో ముంచెత్తెతున్నాడు. జీవితాంతం చంద్రబాబునే సి.ఎంగా చూడాలనే కోరికను గతంలో వెళ్లడించారు అశోక్ బాబు. టీడీపీ నేతలెవరు అలాంటి మాటలు చెప్పే సాహసం చేయలేదు. అంతగా చంద్రబాబుతో అశోక్ ఆకాశానికెత్తడం వెనుక రాబోయే కాలంలో పార్టీ సీటు వస్తుందనే ఆలోచనే కారణమంటున్నారు. అమరావతికి ఉద్యోగుల తరలింపు విషయంలో స్థానిక నేతలకు ఆయనకు మధ్య గొడవలు వచ్చాయి. ఎమ్మార్వో వనజాక్షి పై దాడి జరిగిన సమయంలో కనీసం ఖండన ఇవ్వలేదనే విమర్శలున్నాయి. ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడుగా ఉంటూ ఉద్యోగులకు అండగా నిలవాలి. కానీ అశోక్ బాబు అందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*