ఏపీలో.. నాలుగు స్తంభాలాట‌!

ఏపీ రాజ‌కీయాలు అంతుచిక్క‌కుండా ఉన్నాయి. ప్ర‌ధాన నాలుగు పార్టీల వ్యూహాలు… పొత్తులు ఎత్తులు ఎలా ఉండ‌బోతున్నాయ‌నేది అంచ‌నా వేయ‌టం కూడా క‌ష్టంగా మారింది. ఎవ‌రు ఎవ‌రితో క‌లుస్తారు.. ఇంకెవ‌రు.. ప్ర‌త్య‌ర్థులుగా మార‌తార‌నేది ఇప్పుడే తేల్చ‌టం క‌ష్టమంటున్నారు విశ్లేష‌కులు. 2014 నాటి ప‌రిస్థితుల‌కు భిన్నంగా ఉంటాయా! అదే విధ‌మైన రాజ‌కీయాలు కొన‌సాగుతాయా అంటే.. నిశ్చ‌బ్ధ‌మే స‌మాధానంగా ఎదుర‌వుతోంది. నాటి ఎన్నిక‌ల్లో బీజేపీ, టీడీపీ పొత్తు.. జ‌న‌సేన మ‌ద్ద‌తుతో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీతో త‌ల‌ప‌డ్డాయి. రాష్ట్ర విభ‌జ‌న పాపం త‌ల‌కెత్తుకున్న కాంగ్రెస్ పార్టీకు క‌నీసం డిపాజిట్లు కూడా ద‌క్క‌లేదు. “చెప్పు”పార్టీ కూడా చెప్పుకోలేక‌పోయింది. ఫ‌లితంగా.. పురందేశ్వ‌రి, కావూరి, క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ వంటి సీనియ‌ర్లు హ‌స్తం వ‌దిలేసి క‌మ‌లం గూటిలో చేరారు. ఈ సారి కాంగ్రెస్ ప‌రిస్థితి ఎంత వ‌ర‌కూ మెరుగ్గా ఉంటుంద‌నేది కూడా అనుమాన‌మే. ఇక టీడీపీ.. బీజేపీ ఇచ్చిన షాక్‌తో ఒంట‌రిగా బ‌రిలోకి దిగాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చింది.  బీజేపీ.. హోదా ప్ర‌భావంతో.. ఒంట‌రిగా  త‌ల‌ప‌డినా నెగ్గ‌టం క‌ష్ట‌మే. ఇక జ‌న‌సేన‌.. ఇప్ప‌టి వ‌ర‌కూ చంద్ర‌బాబునాయుడుకే మ‌ద్ద‌తు నిస్తూ వ‌చ్చిన ప‌వ‌న్‌..

త‌న ఎన్నిక‌ల వ్యూహం.. పొత్తుల గురించి ఇప్పుడే తేల్చ‌నేనంటూ చెప్పారు. వైసీపీ.. బీజేపీకు ద‌గ్గ‌ర‌వుదామ‌ని ప్ర‌య‌త్నించినా.. ప్ర‌స్తుతం ఏపీలో నెల‌కొన్న ప‌రిస్థితులు.. ప్ర‌జ‌ల్లో మోదీపై  పెల్లుబుకుతున్న వ్య‌తిరేక‌త‌తో అంత‌టి సాహ‌సం చేస్తుందా! అనేది కూడా అనుమాన‌మే. ఎందుకంటే.. ఒక‌వేళ వైసీపీ బీజేపీతో జ‌త‌క‌డితే.. వైసీపీ గెలిచే స్థానాలు కూడా కోల్పోవాల్సి వ‌స్తుంద‌నే భ‌యం జ‌గ‌న్ శిబిరాన్ని వెంటాడుతుంది. మ‌రోవైపు మూడో కూటమి ముచ్చ‌ట కూడా తెర‌మీద‌కు రావ‌టం.. మ‌ద్ద‌తు కోసం.. కేసీఆర్ తానే స్వ‌యంగా దేశ‌వ్యాప్త ప్ర‌చారం చేస్తాన‌ని చెప్ప‌టం కూడా.. ప్రాంతీయ పార్టీల‌ను ఏక‌తాటిపైకి తెస్తుంద‌నే అభిప్రాయం కూడా వ్య‌క్త‌మ‌వుతోంది. అయితే ఎన్నిక‌లు మ‌రో ఏడాది స‌మ‌యం ఉండ‌టంతో.. ఇప్పుడు ఎవ‌రు బ‌య‌ట‌ప‌డినా.. ప్ర‌జ‌ల్లోకి ప్ర‌తికూల సంకేతాలు పోతాయ‌నే భ‌యం కూడా అన్ని పార్టీల్లో నెల‌కొని ఉంది. నాలుగు పార్టీలు.. నాలుగు ర‌కాలుగా ఆలోచిస్తున్న వేళ‌..  పార్టీల పొత్తులు ఎలా ఉండ‌బోతున్నాయ‌నేది.. తెలియాలంటే మ‌రికొద్దికాలం ఓపిక‌ప‌ట్టాల్సిందే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*