అమీతుమీ : ఇది న్యాయపోరాటానికి సంకేతం

తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించే విషయంలోను, విభజన చట్టంలోని హామీలు అన్నిటినీ నెరవేర్చే విషయంలోనూ అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధం అవుతోంది. తాజాగా మంగళవారం నాడు శాసనసభలో కేంద్రం ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపడం అనేది సాంకేతికంగా చాలా తీవ్రమైన చర్య. చంద్రబాబునాయుడు ప్రభుత్వం వేస్తున్న అడుగులు.. సుప్రీం కోర్టు ద్వారా న్యాయపోరాటానికి ప్రభుత్వం సిద్ధపడుతున్న వైనాన్ని తెలియజేస్తున్నాయి.

కేంద్రంతో పోరాడి విభజన చట్టం ప్రసాదించే హక్కులు అన్నిటినీ సంపాదించుకోవడంలో.. న్యాయపోరాటం అనేది అంతిమ పరిష్కారంగా పరిగణిస్తాం అంటూ.. చంద్రబాబునాయుడు తొలినుంచి చెబుతూనే ఉన్నారు. కేంద్రం ప్రభుత్వం చట్ట ఉల్లంఘనకు పాల్పడుతున్నదని.. పార్లమెంటు చేసిన చట్టం ద్వారా తమకు సంప్రాప్తించవలసిన వాటిని ఆపుతున్నదని ఫిర్యాదు చేస్తూ సుప్రీంను ఆశ్రయించడానికి ఒక మార్గం ఉంది. కేంద్రానికి ఇవ్వగల అన్ని అవకాశాలను వారు దుర్వినియోగం చేసుకుంటే గనుక.. అదే మనకున్న ప్రత్యమ్నాయం. ఇప్పటికే ప్రత్యేకహోదా విషయంలో గానీ, విశాఖ రైల్వేజోన్ విషయంలో గానీ.. చట్టోల్లంఘనకు కేంద్రం పాల్పడినట్టే లెక్క. ‘ఇవ్వడం కుదరదు’ అని ఏదో అంత తేలిగ్గా చెప్పేస్తే సరిపోదు.

ఇంకా కడప ఉక్కు ఫ్యాక్టరీ కీలకమైన ఇతర కొన్ని సంగతుల విషయం కూడా కేంద్రం ఏదో ఒకటి ఇంతే స్పస్టంగా తేల్చి చెప్పేంత వరకు చంద్రబాబు వేచిచూడవచ్చు. ఆ తర్వాత మాత్రం సుప్రీం న్యాయస్థానాన్ని కదిలిస్తారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

తెలుగుదేశం లీగల్ సెల్ అధ్యక్షుడు , పార్టీకి న్యాయవిభాగంలో ఎంతోకాలంగా సేవలందిస్తున్న కనకమేడల రవీంద్రకుమార్ ను రాజ్యసభ ఎంపీ చేయడం వెనుక ఉన్న కీలకమైన సంగతుల్లో ఇది కూడా ఒకటి అని.. పలువురు పేర్కొంటున్నారు. ఆయనకు హైకోర్టు న్యాయవాదిగా సుదీర్ఘమైన అనుభవం ఉంది. న్యాయపరమైన విషయాల్లో, రాజ్యాంగ వ్యవహారాల్లో తల పండిన వ్యక్తి. ఆయన సేవలను రాష్ట్రం కోసం మరింత విస్తృతాం వాడుకోవడానికి, ఇప్పుడున్న న్యాయపరమైన అవసరాల దృష్ట్యా వినియోగించుకోవడానికి ఎంపీ పదవి ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

తెదేపా న్యాయపోరాటం చేస్తే గనుక.. కేంద్ర ప్రభుత్వానికి ప్రమాద ఘంటికలు మోగినట్టే అని కూడా పలువురు విశ్లేషిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*