రైల్వే జోన్ ఎందుకండి బాబు…

ఆంధ్రప్రదేశ్ కు రైల్వే జోన్‌ ఇచ్చేది లేదనిచెప్పింది కేంద్ర రైల్వే బోర్డు. ‘మీకు రైల్వేజోన్‌ కావాలా? రైల్వే లైన్‌ కావాలా?’ అని ప్రశ్నించింది. దీంతో బిత్తరపోవడం ప్రభుత్వం, ప్రజల వంతు అయింది. హోదా సంగతి పక్కన పెట్టారు. ప్యాకేజిని పట్టించుకోలేదు. ఇప్పుడు రైల్వే జోన్ విషయంలోను అదే తీరు. విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు ఆయనే. కానీ తన నియోజకవర్గానికి కావాల్సిన రైల్వే జోన్ విషయంలో ఆయన పోరాడలేకపోతున్నారు. ఎవరు ఎన్ని చెప్పినా..ఆందోళనలు చేసినా ప్రయోజనం లేకపోయింది. రాష్ట్ర విభజన చట్టంలోని 13వ షెడ్యూల్‌లో పేర్కొన్న హామీలను అమలు చేయలేకపోతోంది. 
                కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్‌ గాబాతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అధికారులు సమావేశమైన సందర్బంలో తీసేసినట్లు మాట్లాడారు కేంద్ర అధికారులు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌ కుమార్‌, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాశ్‌ భేటీ అయిన సందర్భంలో కీలకాంశాలు ప్రస్తావనకు వచ్చాయి. రైల్వే జోన్‌ సాధ్యం కాదని కేంద్రం చెప్పింది. విశాఖ రైల్వేజోన్‌ ఏర్పడి తీరాలని ఏపీ అడిగింది. కాదని చెప్పింది కేంద్రం. దుగరాజపట్నం పోర్టు ఆర్థికంగా లాభదాయకం కాదని చెప్పేసింది. దానికి బదులుగా రామాయపట్నంలో పోర్టును ఏర్పాటు చేయాలని కోరారు. కడపలో ఉక్కు కర్మాగారంపై నిర్ణయం తీసుకోలేదు. కాకినాడ పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌కు వయబిలిటీ గ్యాప్‌ ఫండ్‌గా రాష్ట్రం నుంచి రూ.5,600 కోట్లు ఇవ్వాలని కేంద్రం చెబుతోంది. ఇందుకు ప్రాజెక్టు వ్యయంలో 14శాతం కట్టాలంటోంది. అసోం, రాజస్థాన్‌లలో పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ను ఏర్పాటుచేసినప్పుడు ఇలానే చేశామని చెబుతోంది. అనంతపురంలో సెంట్రల్‌ యూనివర్సిటీ, విశాఖపట్నం జిల్లాలో గిరిజన వర్సిటీ ఏర్పాటు అంశం పరిశీలిస్తామని చెప్పింది. ఇంకోవైపు పెట్రోలియం యూనివర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూముల్లో 25 ఎకరాలు వివాదాల్లో ఉందని చెప్పింది. 
రాజధానికి ఇచ్చింది ఎంత….
అమరావతి రాజధాని నిర్మాణానికి రూ.2500 కోట్లు ఇచ్చామని చెబుతోంది కేంద్రం. అందులో గుంటూరు, విజయవాడలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి ఇచ్చిన రూ.1000 కోట్లు చేర్చారు. దాన్ని రాజధాని నిర్మాణంలో చేర్చవద్దని..ఏపీ చెబుతుండగా…మేము అధికారికంగా ఇచ్చాం. దాన్ని మిగతా అవసరాలకు ఉపయోగిస్తే మేము ఏం చెప్పగలమంటోంది కేంద్రం. మొత్తంగా కేంద్రం, రాష్ట్రం మధ్య జరిగిన చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి.  

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*