బుల్లెట్ రైలు భాజపాకు గట్టిగానే కొడుతోంది!

తెలుగుదేశం పార్టీ కేంద్ర చేస్తున్న వంచన, ఏపీ పట్ల చూపిస్తున్న వివక్షపై అలుపెరగని పోరాటానికి సిద్ధ పడిన సంగతి తెలిసిందే. కేంద్రం ఏపీకి ఎలా అన్యాయం చేస్తున్నది అనే సంగతిని మాత్రమే కాకుండా.. మోడీ తానేదో గుజరాత్ ప్రధానమంత్రి అయినట్లుగా ఆ రాష్ట్రానికి ఎంత అతిగా లబ్ది చేకూరుస్తున్నారో కూడా.. ఏపీ సర్కారు పోరాటంలో బయటపెట్టబోతున్నారు. ఆ పోరాటంలో భాగంగా గుజరాత్ కు మోడీ సర్కార్ ప్రత్యేకంగా ఏర్పాటుచేస్తున్న బుల్లెట్ రైలు ప్రస్తావన కూడా ఉంది. ఈ బుల్లెట్ రైలు ఎంత వేగంతో ప్రయాణికుల్ని ముంబాయినుంచి అహ్మదాబాద్ కు చేరుస్తుందో మనకు తెలియదు గానీ.. అంతకంటె వేగంగా.. ఏపీ ప్రజల్లో మోడీ పట్ల ప్రతికూల భావనను కలిగించడానికి మాత్రం ఉపయోగపడుతున్నదని పలువురు అంటున్నారు.

మోడీ సర్కారు ముంబాయి టూ అహ్మదాబాద్.. బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులను ఇటీవల ప్రారంభించిన నంగతి అందరికీ తెలుసు. కేవలం ఈ రెండు నగరాల మధ్య తిరిగే ప్రజల, వ్యాపారవేత్తల సౌకర్యార్థం ఏర్పాటుచేస్తున్న ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు కేంద్రం తన వంతుగా లక్ష కోట్ల రూపాయల నిధులను కేటాయించింది.

రెండు నగరాల మధ్య రైలు సదుపాయానికి లక్ష కోట్ల రూపాయలు కేటాయించి.. ఒక అనాథ రాష్ట్రానికి రాజధాని నిర్మాణానికి 48 వేల కోట్ల  రూపాయలు అడిగితే వెటకారాలు చేస్తారా అనేది ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్రవ్యాప్తంగా వెలుస్తున్న కేంద్రం వంచనకు సంబంధించిన ఫ్లెక్సి పోస్టర్లలో ఈ అంశం ప్రధానంగా ప్రస్తావనకు వస్తోంది.

ప్రపంచం తలెత్తి చూసే స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని నిలబెట్టాలనే సంకల్పంతో చంద్రబాబు నాయుడు ప్లాన్ చేస్తున్న నిర్మాణాలు మొత్తం కావడానికి ఎంత వ్యయమైనా కావొచ్చు గాక.. కానీ కోర్ కేపిటల్ నిర్మాణానికి 48 వేల కోట్ల నిదులు  కేంద్రం ఇవ్వాలని మాత్రమే రాష్ట్రప్రభుత్వం అడుగుతోంది. అయితే ఇప్పటికే 2500 కోట్లు ఇచ్చేశాం.. అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్న కేంద్ర సర్కారు ఒక రకంగా మాట్లాడుతోంటే.. అక్కడేమైనా మయసభ కట్టబోతున్నారా.. రాజధాని నిర్మాణాలకు 48వేల కోట్లు ఎందుకు అంటూ రాష్ట్ర భాజపా నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. అలాంటి వారికి భాజపా కొత్తగా ఎంపీ పదవులు కూడా ఇచ్చి సముచితరీతిలో థాంక్స్ చెప్పుకోవడం విశేషం.

ఈ రకంగా నిధుల విషయంలో పక్షపాత ధోరణి చూపిస్తున్న కేంద్రంపై తెలుగుదేశం ఏర్పాటుచేస్తున్న బుల్లెట్ రైలు పోస్టర్లు.. ఏపీ ప్రజల్లో ఆలోచన కలిగిస్తున్నాయని పలువురు అంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*