భాజపా నేతలు పారిపోవాల్సిందేనా?

ఏపీ లోని భారతీయ జనతా పార్టీ నాయకులు ఇప్పుడు మొహం ఎక్కడ దాచుకుంటారు . ఇదిగో విశాఖ రైల్వేజోన్, అదిగో కడప ఉక్కు ఫ్యాక్టరీ వచ్చేస్తున్నాయి వచ్చేస్తున్నాయి… చంద్రబాబు నాయుడు అనవసరంగా మా మీద నోరు పారేసుకుంటున్నారు అంటూ పదేపదే ఆరోపించిన భారతీయ జనతా పార్టీ నాయకులకు ఇప్పుడు మొహం చెల్లడంలేదు. రైల్వేజోన్ అనేది అసాధ్యం అంటూ కేంద్రం తేల్చేసిన నేపథ్యంలో తమ మాటలను ఎలా సమర్ధించుకోవడం తెలియక  వారు సతమతం అయిపోతున్నారు.

కేంద్ర ప్రభుత్వంనుంచి రాష్ట్రానికి వరుస వంచనలు తప్పడం లేదు. ప్రత్యేకహోదా విషయంలో ‘ఇవ్వంగాక ఇవ్వం’ అంటూ ప్రకటించేసి.. ఏపీ ప్రజల ఆగ్రహానికి గురవుతున్న కేంద్రంలోని మోడీ సర్కార్.. ఏదో ఉపశమన చర్యలు అన్నట్లుగా రైల్వే జోన్ ఇస్తున్నాం అంటూ మాయమాటలు చెప్పింది. ఒదిశాతో చర్చలు కూడా పూర్తయ్యాయని.. నేడో రేపో రైల్వేజోన్ ప్రకటన వచ్చేస్తుందని అంతా అనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో మరో అశనిపాతం లాంటి వార్త. రెండు రాష్ట్రాల ఉన్నతాధికార్లతో జరిగిన సమావేశంలో కేంద్ర హోంశాఖ అధికారులు రైల్వేజోన్ ఇవ్వడం అసాధ్యం అని తేల్చేశారు.

చూడబోతే.. కేంద్రం రాష్ట్రానికి దక్కవలసిన అన్నిటినీ కూడా.. అంచెలంచెలుగా మంటగలపడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. నిన్నటిదాకా.. రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ నాయకులు అనవసరంగా మామీద నిందలు వేస్తున్నారు. ఇదిగో రైల్వేజోన్ వచ్చేస్తున్నది.. కడపలో ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి కూడా పనులు వేగం పుంజుకున్నాయి.. అంటూ నాటకాలు ఆడుతూ వచ్చారు. అంత లేదని తేలిపోయింది. ఇక కడప ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో వారి వంచన నేటికో రేపటికో తేలిపోతే.. అక్కడితో అంతా సంపూర్ణం అవుతుంది.

అసలే ఇప్పుడున్న పరిస్థితులకు.. ఏపీలో భాజపా ఒక్క ఓటు వేయించుకునే స్థితిలో లేదు. ప్రజలు ఆ పార్టీని ఛీకొడుతున్నారు. ఏదో ఒక రకంగా తమ పరువు కాపాడుకోవడానికి రాష్ట్ర నాయకులు రైల్వేజోన్ మాటు చెబుతూ వచ్చారు. ఇప్పుడు అది కూడా లేదని తేలిపోవడంతో.. ఇక వారు రాష్ట్రం నుంచి పరారై పోవాల్సిందే అని ప్రజలు అంటున్నారు. కమల నాయకులకు ఇక ఏపీలో ఏమాత్రం మొహం చెల్లదని అంతా అనుకుంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*