‘పవన్ కు స్పష్టత ఉందంట’

ఒక వ్యక్తి తనకు ఫలానా ఉన్నది అని చెప్పుకుంటున్నారంటేనే దాని అర్థం.. అతను దాన్ని కలిగి ఉండడం గురించి ఇతరుల్లో చాలా సందేహాలు ఉన్నాయని! నా దగ్గర ఆస్తి ఉంది, నా దగ్గర డబ్బులున్నాయి అని ఓ వ్యాపారవేత్త స్టేట్ మెంట్ ఇచ్చాడంటే అర్థం… అతను దివాలా తీసినట్లు ప్రచారం జరుగుతున్నదని! నా చేతిలో అవకాశాలు ఉన్నాయి.. నిర్మాతలతో డిస్కషన్లు జరుగుతున్నాయి.. అని ఓ హీరోయిన్ ప్రకటిస్తే గనుక.. ఆమె ఖాళీ అయిపోయిందని ప్రచారం జరుగుతున్నట్లు లెక్క! ఈ సూత్రం బహుశా పవన్ కల్యాణ్ కు తెలియని సంగతి కాకపోవచ్చు. కాకుంటే.. ఆయన ఇప్పుడు ‘‘నాకు  అన్ని విషయాల మీద స్పష్టత ఉంది’’ అని చెప్పుకుంటున్నారు. చూడబోతే.. ఆయనలోని స్పష్టత గురించి ప్రజల్లో సందేహాలు ప్రచారం అవుతున్నాయేమో అనిపిస్తోంది.

మంగళగిరిలో కాజ వద్ద తన కొత్త ఇల్లు కోసం శంకుస్థాపన చేసిన పవన్ చాలా ముచ్చట్లు పంచుకున్నారు.

‘మంగళగిరిలో మా నాన్న కానిస్టేబుల్‌గా పనిచేశారు… మా నాన్న పనిచేసిన స్థలంలో ఇల్లు కట్టుకోవడం సంతోషంగా ఉందన్న పవన్, జనసేన పార్టీపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని దాన్ని నిలబెట్టుకోవాలని ఆశించడం విశేషం. కీలకాంశాలను మాత్రం ఆయన ఎల్లుండ సభకోసం దాచిపెట్టుకున్నారు.

రాష్ట్రానికి జరిగిన అన్యాయం, బీజేపీ, టీడీపీతో అనుసరించాల్సిన విధానంపై ఈ నెల 14న క్లారిటీ ఇస్తానన్న

పవన్ కొత్త వ్యక్తులను పార్టీలోకి తీసుకోవాలన్నదే ప్లాన్ అంటున్నారు గానీ.. ఆల్రెడీ ఎంట్రీ ఇచ్చిన వాళ్లంతా పాతవాళ్లే కదా.. అని ప్రజలు అనుకుంటున్నారు. తొలి విడతగా 12 మందితో స్పీకర్ ప్యానెల్‌ని రెడీ చేశాం అని చెబుతున్నారు. ముందుగా మాటలు చెప్పేవాళ్లుంటే.. ఆ తర్వాత పనిచేసేవాళ్లని నిదానంగా ఎంపిక చేయవచ్చునని ఆయన అనుకుంటున్నట్టుంది.

‘నా ఆస్తులు ఎవరినీ దోచేసినవి కావు… నేను కష్టపడి సంపాదించుకున్నా… ప్రజలిచ్చిన ఆస్తులు… కొన్ని సార్లు పోగొట్టుకున్నా మళ్లీ తిరిగి సంపాదించుకున్నా, అవసరం వస్తే ఆస్తులు ప్రకటిస్తా’ అంటున్న పవన్ తద్వారా రాజకీయాల్లో అందరూ దోచుకుంటూ ఉంటారు అని చెప్పదలచుకున్నట్లున్నది గానీ.. ఆస్తుల ప్రకటనలో ‘అవసరం వస్తే’ అనే మెలిక పెట్టకుండా.. రాజకీయాల్లోకి వచ్చినందుకు ప్రతి ఏటా ప్రకటించే అలవాటు చేసుకుంటే బాగుంటుంది.

‘నాకు చాలా స్పష్టత ఉంది… నా అభిప్రాయాలను ఎప్పుడూ దాచుకోను… సమస్యల నుంచి పారిపోన’ అంటున్న పవన్ కల్యాణ్ ఈ మూడు విషయాల్లో ప్రజల్లో చాలా సందేహాలు రేగుతున్న సందేహాలను సరిగ్గానే గుర్తించినట్లున్నారు. అందుకే పదేపదే వివరణ ఇచ్చుకుంటున్నారని అనిపిస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*