బీజేపీలో చేరిన టాలీవుడ్ నటి

వైజాగ్ లో జరిగిన టీడీపీ మహానాడు వేదిక మీదకు పిలవలేదని అలిగింది సినీనటి కవిత. అంతే కాదు..మీడియా ముందు బోరును ఏడ్వడంతో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తనను వాడుకుని వదిలేశారనే తరహాలో మాట్లాడింది. టీడీపీ అధికారంలో లేనప్పుడు కవితను మహానాడు వేదిక మీదకు పిలిచేవారు. కానీ అధికారంలోకి వచ్చాక పట్టించుకోలేదు. ఫలితంగా ఆమె అప్పటి నుంచి అసంతృప్తిగానే ఉన్నారు. 
అందుకే ఇప్పుడు ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు సమక్షంలో విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆమె కమలం కండువా కప్పుకున్నారు. రాబోయే కాలంలో టీడీపీకి వ్యతిరేకంగా పని చేసేందుకు సిద్దం కావడం ఆసక్తికరం. 
సినీ నటి కవిత టీడీపీలో కొంతకాలం కిందటి వరకు చురుగ్గా వ్యవహరించారు. బాధతోనే టీడీపీకి రాజీనామా చేశానని, టీడీపీ నుంచి తనను అవమానించి గెంటేశారని కవిత ఆరోపించారు. 1983 నుంచి టీడీపీలోనే కొనసాగారామె. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన అనేక  పథకాలు నచ్చి బీజేపీలో చేరారట. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వక పోవడం, అద్వానీ లాంటి నేతను అవమానించడం ఆమెకు నచ్చినట్లున్నాయి. అందుకే బీజేపీ చేరారనే సెటైర్లు వేస్తున్నారు నేతలు. 
పార్టీ మారుతూ సంచలన ఆరోపణలు చేసారు కవిత. చంద్రబాబు మోసకారి అని మిగతా వారు చెబితే నమ్మలేదట. కానీ ఇప్పుడే అర్థమైందని కాస్తంత ఘాటు తగిలించారు కవిత. ఎన్టీఆర్‌పై నమ్మకంతో టీడీపీలో చేరానని, చంద్రబాబు ఎన్టీఆర్ హామీని తుంగలో తొక్కారని చెప్పారు. పేరుకు ఉత్సవ విగ్రహంలా ఉంటే పార్టీకి భారమని…పని చేస్తేనే పదవులు వస్తాయని చెబుతున్నారు మరోవైపు తెలుగు తమ్ముళ్లు. పొరపాటున సభా వేదిక మీదకు పిలవక పోతే దానికి ఏడుస్తూ మీడియా ముందుకు వెళ్లాలా అంటున్నారు. అందుకే కవిత పార్టీ మారినా వచ్చే నష్టం లేదని..ఇంకా పార్టీకే లాభం అంటున్నారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*