జగన్ కు సహాయం చేయనున్న మోడీ

టీడీపీతో తెగదెంపుల పర్వం కొనసాగుతోంది. పైకి కలిసి ఉండాలని బీజేపీ చెబుతున్నా… చంద్రబాబుకు దూరంగా జరగాలనే అభిప్రాయానికి వచ్చింది కమలం పార్టీ. అందుకే చంద్రబాబుకు ప్రయోజనం చేకూర్చే ఏ ఒక్క అంశాన్ని వదలడం లేదు. రాజధాని నిర్మాణానికి రూ.2500 కోట్లు ఇచ్చినా ఒక్క ఇటుక నిర్మాణానికి ఉపయోగించలేదు చంద్రబాబు. డిజైన్ల పేరుతో నాలుగేళ్ల పాటు కాలయాపన చేశారు బాబు. రానున్న కాలంలో ఏం చేస్తారో ఆ దేవుడికే ఎరుక. ఇక ఎన్నికల సమయం వచ్చింది. ఇలాంటి సమయంలో రాజధాని నిర్మాణం చేయడం అంత తేలిక కాదు. అందుకే చంద్రబాబు తీరును బీజేపీ వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల నిర్మాణంలో చేతి వాటం, కేంద్రం ఇచ్చిన నిధుల విషయంలో క్లారిటీ లేదనే సంగతిని బీజేపీ ప్రస్తావిస్తోంది. నిధుల విషయంలో అవినీతి, అక్రమాలు జరిగాయనేది బీజేపీ నేతలు చెప్పే మాట. పోలవరం పై శ్వేత పత్రం ఇచ్చేందుకు చంద్రబాబు భయపడటమే ఇందుకు కారణం. పవన్ కల్యాణ్, విపక్షాలు సైతం అదే అంశాన్ని ప్రస్తావించాయి. అయినా సరే చంద్రబాబు ధైర్యం చేయలేకపోతున్నారు. ప్రజాస్వామ్య బద్దంగా పనులు జరుగుతున్నప్పుడు శ్వేత పత్రం ఇచ్చేందుకు ఇబ్బంది లేదు. కానీ ఇందులో మతలబు ఉందని.. అందుకే చంద్రబాబుపై అనుమానాలు వస్తున్నాయంటున్నారు బీజేపీ నేతలు. అదే రేపు చంద్రబాబును ఇబ్బంది పెడుతుందనే ప్రచారం లేకపోలేదు. 
ఏపీని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లే పనిలో ఉన్న దార్శనీకుడు చంద్రబాబు. అందులో తిరుగులేదు. కానీ లెక్కల విషయంలో ఎందుకు వెనక్కు తగ్గుతున్నారు. విపక్షాలు చేసే విమర్శలకు ఎందుకు సమాధానం చెప్పడంలేదనేది ఆసక్తికరమే. మరోవైపు తిరుపతిలో ఇచ్చిన హోదా హామీని నిలబెట్టుకోవడంలో బీజేపీ పూర్తిగా విఫలమైంది. ఆంధ్రప్రజలు అంటే ఎంత చులకనో మోడీ తీరును చూస్తేనే అర్థమవుతోంది. 
జగన్ తో ఒప్పందం జరిగిందా…
జగన్‌తో మాకు రహస్య ఒప్పందం లేదు. వచ్చే ఎన్నికల్లో జగన్‌తో చేతులు కలపాలన్న ఉద్దేశం కూడా మాకు లేదన్నారు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా.  మీరు అనవసరంగా అపోహ పడుతున్నారు అని తనను కలిసిన టీడీపీ నేతలకు చెప్పారు అమిత్ షా. వాస్తవంగా బీజేపీ బడ్జెట్ బాగుందని గతంలో విజయసాయిరెడ్డి చెప్పారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతునిచ్చారు. మోడీ మాట్లాడే సమయంలో సభ నుంచి వాకౌట్ చేశారు. సభలో నిరసన తెలిపే అవకాశం ఉన్నా ఆ పని చేయలేదు. ఈ సంకేతాలు బీజేపీతో జగన్ పార్టీ లోపాయికారీ పొత్తు పెట్టుకుందనే ప్రచారానికి ఊతం ఇచ్చాయి. రాజకీయ, అధికార వర్గాలు అదే నిజం అని భావిస్తున్నాయి. జగన్‌, బీజేపీ పెద్దల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఒక బడా వ్యాపార సంస్థతోపాటు కొన్ని రాజకీయ శక్తులు రంగంలోకి దిగాయంటున్నారు.
జగన్‌ కంపెనీల ఆడిటర్‌, ఎంపీ విజయ సాయి రెడ్డి ఢిల్లీలో అమిత్‌ షా, మోడీలను రహస్యంగా కలుస్తున్నారని తెలుస్తోంది. జగన్‌కు ఈడీ కేసుల్లో క్లీన్‌ చిట్‌ ఇవ్వడం, కేసుల విషయంలో సీబీఐ తదుపరి చర్యలు తీసుకోకపోవడం వంటి వాటిపై బీజేపీ, వైకాపా మధ్య అవగాహన కుదిరిందనే ప్రచారం సాగుతోంది. జగన్ రాజకీయంగా బలోపేతం కావడానికి పరోక్ష సహకారం అందించే ఆలోచన ఉందట. జగతి పబ్లికేషన్‌కు చెందిన రూ.34.6 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ల జప్తు కేసులో ఈడీ అప్పీలేట్‌ అథారిటీ క్లీన్‌ చిట్‌ ఇవ్వడం ఇందులో భాగమేనంటారు. మాధవ్‌ రామచంద్రన్‌, ఏకే దండమూడి, టీఆర్‌ కన్నన్‌ల నుంచి పెట్టుబడులు స్వీకరించినందుకు ఇదే కేసులో సీబీఐ ఐపీసీ, మనీ లాండరింగ్‌, అవినీతి నిరోధక చట్టాల కింద చార్జిషీటు దాఖలు చేసింది. ఈ విషయంలో క్విడ్‌ ప్రోకో జరగలేదని ఈడీ అప్పిలేట్‌ అథారిటీ క్లీన్‌ చిట్‌ ఇవ్వడం ఆసక్తికరమే. అంతే కాదు…జగన్ కేసుల్లో వేగాన్ని తగ్గించే ఆలోచన చేస్తుందనే వాదన సాగుతోంది. 

2 Comments

  1. ఏపీ కి సాయం చేయటం రాదు. జగన్ కి సాయం చేస్తాడు. సాయం అంటే తెలుసు గదా…

  2. చంద్రబాబుకు చేయాల్సిన సహాయం చేసేసాడు, ఈ రోజే త్రిపురలో అద్వానీ గారికి పంగనామం పెట్టాడు,ఇక ఇప్పుడు జగన్ వంతు, జగన్ చిప్ప పట్టుకుని రెడీగా నిలబడడమే ఆలస్యం.

Leave a Reply

Your email address will not be published.


*