కేటీఆర్ కోసం కేసీఆర్ వ్యూహం

రాబోయే కాలంలో తెలంగాణలో కాబోయే సిఎం కేటీఆర్ అని గులాబీ నేతల మధ్య జరుగుతున్న చర్చ. బయటకు చెప్పక పోయినా కొడుకు కేటీఆర్ కోసం సిఎం కేసీఆర్ వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే తన మేనల్లుడు హరీష్ రావుకు పెద్దగా ప్రాధాన్యత లేకుండా చేస్తున్నాడు. మరోవైపు కేటీఆర్ కు ఇబ్బంది కలిగిస్తారనుకుంటున్న నేతలెవరినీ తెలంగాణలో ఉంచరట. వారిని పార్లమెంటుకు పోటీ చేయించి అసెంబ్లీలో ఇబ్బంది లేకుండా చేసే ఆలోచన చేస్తున్నారట. అదే సమయంలో తాను జాతీయ రాజకీయాల వైపు దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో మెజారిటీ ఎంపీ సీట్లు గెలుచుకోవడం ద్వారా ఢిల్లీలో చక్రం తిప్పాలని ఆలోచిస్తున్నారు. ఇదంతా ఇంట్లో వచ్చిన గొడవలే కారణమనే వాదన లేకపోలేదు. 
కేసీఆర్ ఇప్పుడు థర్డ్ ఫ్రంట్ అవసరం ఉందని చెబుతున్నాడు. కొందరితో మాట్లాడుతున్నట్లు ప్రచారం చేస్తున్నారు టీఆర్ఎస్ నేతలు. అది నిజమో కాదో తెలియదు. కానీ వీలున్నంత ఎక్కువ మందిని తమ కూటమిలో కలుపుకునేందుకు వారు పావులు కదుపుతున్నట్లు సమాచారం వస్తోంది. హస్తినలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే అని అంచనా వేస్తున్న కేసీఆర్.. అందుకు అనుగుణంగానే పావులు కదుపుతున్నారు. తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. హైదరాబాద్ ఎలాగు ఎం.ఐఎందే. మరొకరు అక్కడ గెలిచే అవకాశం లేదు. 
విపక్షాల నుంచి బలమైన అభ్యర్ధులు రంగంలోకి దిగే అవకాశం ఉన్న చోట తమ పార్టీ నేతలను అక్కడ దింపే ఆలోచన చేస్తున్నారు కేసీఆర్. అందుకు మంత్రుల్లో ఎక్కువ మందినీ ఈ సారి లోక్ సభకు పోటీ చేయించే ఆలోచన చేస్తున్నారట. ఎంపీ సీట్లతో పాటు ఆ పార్లమెంట్ స్థానాల పరిధిలోని అన్ని అసెంబ్లీ సీట్లను గెలుచుకోవచ్చనేది అంచనా. సీనియర్ మంత్రులను పార్లమెంట్ కు పంపిస్తే ఆ మేరకు కేటీఆర్ కు రాష్ట్రంలో ఇబ్బంది లేకుండా చేయాలనేది ఆయన ఆలోచనగా ఉందట. 
మంత్రి హరీష్ రావును మెదక్ పార్లమెంట్ సీటుకు పోటీ చేయించాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. హరీష్ అసెంబ్లీలో ఉంటే తన కుమారుడు సీటుకు ఎసరు వస్తుందని బలంగా భావిస్తున్నారు కేసీఆర్. అందుకే ముందుగా హరీష్ రావును ఢిల్లీకి పంపుతున్నారట. అదే సమయంలో హరీష్ రావు గెలుపుకు అక్కడ ఢోకా ఉండదంటున్నారు. తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించడంతో మెదక్ ఎంపీగా ఆయన గెలుపు నల్లేరు మీద నడకే అవుతుందని కేసీఆర్ అంచనా. ఇందుకు ఆయన్ను ఒప్పించే పని జరుగుతుందంటున్నారు. రానున్న ఎన్నికల్లో మెదక్ నుంచి హరీష్ పోటీ చేస్తారనే ప్రచారం నడుస్తోంది. 
మరోవైపు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ను కరీంనగర్ ఎంపీగా పోటీ చేయించాలని కేసీఆర్ భావన. వాస్తవంగా కేసీఆర్ ఫ్యామిలీలో నలుగురు తర్వాత ఈటెలకే పార్టీలో మంచి పేరుంది. పైగా బీసీ నేత. అందరికీ దగ్గరి వాడిగా ఉంటాడు. ఎంపీగా ఆయన్ను పంపడం ద్వారా కేటీఆర్ దారి సులువు అవుతుందట. కరీంనగర్ ఎంపీగా పంపి.. హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఆయన సతీమణి జమునకు అవకాశం ఇచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది.  
ఇక డిప్యూటీ సీఎంగా ఉన్న కడియం శ్రీహరిని మరోసారి ఢిల్లీకి పంపించాలనుకుంటున్నారు కేసీఆర్. గత ఎన్నికల్లో ఎంపీగా గెలిచాడు కడియం. కానీ రాష్ట్ర రాజకీయ అవసరాల కోసం ఆయన్ను అసెంబ్లీకి తీసుకువచ్చారు కేసీఆర్. రాజయ్య సరిగా పని చేయలేకపోవడంతో ఆయన్ను తప్పించి కీలకమైన డిప్యూటీ సిఎం పదవిని కడియం శ్రీహరికి ఇచ్చారు కేసీఆర్. రాబోయే ఎన్నికల్లో కడియంను వరంగల్ నుంచి బరిలో నిలపాలని భావిస్తున్నారు. 
ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ హవా అంతగా లేదు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఒక్క సీటు రాలేదు. అందుకే వ్యూహాత్మకంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన తుమ్మల నాగేశ్వరరావును పార్టీలో చేర్చుకుని ఆ వర్గాన్ని ఆకట్టుకునే పని చేశారు. ఆ తర్వాత ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి తన సత్తా చాటారు తుమ్మల. పార్టీలో ఈటెల రాజేందర్ తర్వాత తుమ్మలకే అంతగా పట్టు ఉందంటారు. ఈ సారి మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఎంపీగా పోటీ చేయించడం ద్వారా ఖమ్మం పరిధిలోని ఏడు నియోజకర్గాలను తమ ఖాతాలో వేసుకోవాలనేది ఆయన ఆలోచనగా ఉందట. ఇక నిజమాబాద్ ఎంపీగా మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిని పోటీ చేయించే ఆలోచన చేస్తున్నారట. కేసీఆర్ కూతురు కవిత కన్నా ఆయన్ను పోటీ చేయిస్తే కుటుంబపాలన అన్న అపవాదును పొగొట్టుకుంటారట. నల్గొండ ఎంపీగా మంత్రి జగదీష్ రెడ్డిని పోటీ చేయించాలని ఆలోచిస్తున్నారట. అది కుదరకపోతే తానే స్వయంగా నల్గొండలో పోటీ చేసే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. నల్గొండ ఎంపీగా కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి వంటి కీలక నేతలు ఉన్నారు. అందుకే చాలా జాగ్రత్తగా పావులు కదుపుతున్నారు. 
రంగారెడ్డి జిల్లా మంత్రి మహేందర్ రెడ్డిని చేవెళ్ల నుంచి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ను సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేయించాలనే ఆలోచన ఉందట. అలానే కవిత, వినోద్ కుమార్, జితేందర్ రెడ్డిలు తిరిగి పార్లమెంటుకు పోటీ చేయనున్నారట. మొత్తంగా కేసీఆర్ ఆలోచన బాగానే ఉంది. ఇందుకు వారంతా ఒప్పుకుంటారా లేదా అనేది తేలాల్సి ఉంది.  
 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*