క‌న్‌ఫ్యూజ‌న్‌లో.. ప‌వ‌న్‌!

ఏదో అనుకుంటే.. ఇంకేదో అయిందే అన్న‌ట్లుంద‌ట ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప‌రిస్థితి. మంచి ఆలోచ‌న‌.. ఉన్న‌త ఆశ‌యం.. అన్నీ బాగానే ఉన్నాయి. ఆచ‌ర‌ణ‌లో మాత్ర‌మే ప‌రిణితి ప్ర‌ద‌ర్శించ‌లేక‌పోతున్నార‌నే అప‌వాదును మూట‌గ‌ట్టుకున్నారు. స‌వాళ్లు విసిరే ముందు.. త‌రువాత వాటిని ఎలా అమ‌లు చేయాల‌నేదానిపై వ్యూహం లేక‌పోవ‌టంతో జ‌న‌సేనాని త‌ర‌చూ విమ‌ర్శ‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తోంద‌నేది జ‌న‌సైనికుల ఆవేద‌న‌. ప్ర‌త్యేక‌హోదా విష‌యంలో రోడ్డెక్కితే.. ల‌క్ష‌లాదిమంది ఆందోళ‌న‌కు మ‌ద్ద‌తు ఇచ్చేందుకు క‌ద‌లి వ‌చ్చేవారు. అయితే అయ‌న బ‌లం.. యువ‌త‌, విద్యార్థులు కావ‌టంతో ప‌రీక్ష‌ల స‌మ‌యంలో ఇవ‌న్నీ ఇబ్బంది అనేది ప‌వ‌న్ చెబుతున్న మాట‌. కానీ.. రాజ‌కీయాల్లో మంచిచెడుల‌కంటే.. ల‌క్ష్య‌మే ముఖ్య‌మ‌నేది అర్ధం చేసుకోలేక‌పోతున్నారు. పైగా జేపీ, ఉండ‌వ‌ల్లి వంటి పెద్ద‌లు, మేధావుల‌తో చెప్పించే మాట‌లు వినేందుకు సొంపుగానే ఉంటాయి. కానీ ఆచ‌ర‌ణ‌లో అవ‌న్నీ అమ‌లు చేసేందుకు అమెరికా, ఆస్ట్రేలియా కావాలి. కానీ మ‌నం ఉంటుంది భార‌త్‌లో.. ముఖ్యంగా రాజ‌కీయ చైత‌న్యం వున్న ఆంధ్ర‌ వంటి చోట‌.. ఆచితూచే కాదు.. అంతకుమించి వ్యూహంతోనే ముందుకు క‌ద‌లాలి. జేఎఫ్‌సీ ఇచ్చిన నివేదిక‌ల‌తో టీడీపీ, బీజీపీలే హోదా విష‌యంలో త‌ప్పులు చేశాయ‌ని చేతులు దులుపుకున్నారు. దానికి ఏం చేయాలి. ఎటువంటి స్టెప్పులేయాల‌నేది మాత్రం గాలికొదిలేశార‌నే విమ‌ర్శ‌లు కూడ‌గ‌ట్టుకున్నారు. ఫ‌లితంగా కొండ‌ను త‌వ్వి.. క‌నీసం ఎలుక‌ను ప‌ట్టినా బావుండేద‌నే మాట‌లు ప‌డ్డారు. ఈ నేప‌థ్యంలోనే ఈ నెల 14న ప‌వ‌న్‌క‌ళ్యాణ్ జ‌నసేన ఉత్స‌వాల‌కు గుంటూరు ను వేదిక‌గా చేసుకున్నారు. అక్క‌డ నుంచే త‌మ రాజ‌కీయ అడుగుల‌పై క్లారిటీ ఇస్తామంటున్నారు. ఎంత బ‌లం ఉంద‌నేది కాదు.. ఉన్న బ‌లాన్ని ఎలా స‌ద్వినియోగం చేసుకోవాల‌నేది ప‌వ‌న్ ఎప్ప‌టికి గ్ర‌హిస్తారో..

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*