లెక్కలు తేల్చిన జనసేన టీమ్

ఏపీకి చాలా సహాయం చేశామని కేంద్రం చెబుతోంది. చేయాల్సినంత చేయలేదని చంద్రబాబు సర్కార్ అంటోంది. ఇందులో ఏది నిజమో తేల్చే పని చేస్తోంది జనసేన అధిపతి పవన్‌ కల్యాణ్‌ నేతృత్వంలో ఏర్పడిన సంయుక్త నిజ నిర్ధారణ కమిటీ (జేఎఫ్ సి). ఇప్పటికే తన నివేదికను సిద్ధం చేసింది. ప్రజల ముందు ఉంచనుంది. రాష్ట్ర విభజన తర్వాత కేంద్రం కొన్ని నిధులు ఇచ్చింది నిజమే. కానీ హామీల అమలు విషయంలో చెప్పేదానికి చేసే దానికి పొంతన లేదని తేలింది. త్వరలోనే ఈ విషయాలను వెల్లడించనున్నారు నేతలు. విభజన చట్టంలో పేర్కొన్న హామీలు, అమలు తీరు వారి అధ్యయం చేసింది కమిటీ. రాజ్యసభలో నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ప్రత్యేక హోదాపై చేసిన ప్రకటన, చివరికి హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీ రూపంలో సాయం చేస్తామని కేంద్ర మంత్రి జైట్లీ ఇచ్చిన మాటలను పరిగణనలోకి తీసుకున్నారు. నిధుల బదిలీ సక్రమంగా అమలు కాలేదని నిర్ధారించినట్లు సమాచారం. 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్న లెక్కలపై కమిటీ సభ్యులైన కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య, లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి తోట చంద్రశేఖర్‌ లు బాగానే విశ్లేషణ చేశారు. కేంద్రం చేస్తున్న వాదనలు, రాష్ట్రం ఇచ్చిన లెక్కలను పూర్తిగా పరిశీలించారు సభ్యులు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను పేరావారీగా చూశారు. ఏ పేరా కింద ఏ అంశాలు ప్రస్తావించారు. వాటి అమలుకు ఇప్పటిదాకా ఏం చేశారు అనే లెక్కలు తేల్చారు. అందుకే సభ్యులతో చివరకిగా పవన్ కల్యాణ్ సమావేశమై తుది కసరత్తు చేశారు. 
కేంద్రం నుంచి వచ్చిన నిధుల వివరాలతో కూడిన సమాచారాన్ని కమిటీ సభ్యులు పవన్‌కు అందించారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం పవన్ కల్యాణ్ కు నోట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అన్ని వివరాలను రెండు రోజుల్లోనే ప్రకటించనుండటం ఉత్కంఠను పెంచుతోంది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*