బంద్ కానున్న సినిమా ధియేటర్లు

సినిమా ధియేటర్లు బంద్ కానున్నాయి. ఫలితంగా ప్రజలు వినోదం కోసం ప్రత్యామ్నాయ పద్ధతులను ఎంచుకోవాల్సిందే. ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా జేఏసీ ఆందోళన చేయనుండటమే ఇందుకు కారణం. డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్ల తీరును నిరసిస్తూ ఐదు రాష్ట్రాల్లో నిరసన కార్యక్రమాలు సాగనున్నాయి. ఈ మేరకు ద‌క్షిణ భార‌త చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ జాయింట్ యాక్ష‌న్ క‌మిటీ నిర్ణయించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళలో థియేటర్లను బంద్‌ చేసేందుకు జెఏసీ ఛైర్మన్‌ డి.సురేష్‌బాబు ఆధ్వర్యంలో  హైద‌రాబాద్ లో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 
ఐదు రాష్ట్రాల నిర్మాతల మండలి సంయుక్తంగా ఈ జేఏసీ ఏర్పాటు చేసుకుంది. ఇంగ్లీష్ సినిమాలకు వర్చువల్‌ ప్రింట్‌ ఫీజు వసూలు చేయడంలేదు. కానీ డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు ప్రాంతీయ చిత్రాలకు వర్చువల్‌ ప్రింట్‌ ఫీజు (వీపీఎఫ్‌) తగ్గించటం లేదు. వీపీఎఫ్‌ ధరలు తగ్గించాలని వారు కోరుతున్నారు. దీని పై ప్రభుత్వాలు స్పందించే వరకు థియేటర్ల బంద్‌ కొనసాగనుంది. ఐదు రాష్ట్రాల్లోని నిర్మాతలు, పంపిణీదారులు ఇందుకు మద్దతు తెలపడం కలకలం రేపుతోంది.
ప్రజలకు ఇష్టమైన సినిమా ట్రైలర్‌లను వేయడానికి ధియేటర్లల్లో ఎక్కువ వసూలు చేస్తున్నారు. ట్రైలర్లకు తక్కువ తీసుకునేందుకు చర్చలు జరిపారు. అమెరికాలోను అదే తీరు ఉంది. ధియేటర్లో సౌండ్‌, సినిమా ప్రొజెక్షన్‌, సీట్లు అన్ని థియేటర్‌ ఇవ్వాలి. ప్రొజెక్షన్‌ను విభజించి దానికి ప్రత్యేక ఛార్జీ వసూలు చేయడాన్ని వారు వ్యతిరేకించారు. ఇంగ్లీష్ సినిమాకు లేని వీపీఎఫ్‌ తెలుగు సినిమాకు ఎందుకని వారు అడిగారు.  జెఏసీ క‌న్వీన‌ర్ పి. కిర‌ణ్‌, తెలుగు ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ సెక్ర‌ట‌రీ ముత్యాల రామ‌దాసు, డిజిట‌ల్ క‌మిటీ చైర్మ‌న్ దామోద‌ర్ ప్ర‌సాద్, సి. క‌ల్యాణ్‌, తెలంగాణ ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ త‌రుపున కె. ముర‌ళీ మోహ‌న్, ఏషియ‌న్ ఫిల్మ్స్ సునీల్ నారంగ్, ఆర్కే త‌దిత‌రులు ఈ భేటీలో పాల్గొని కీలక నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు హాట్ టాపికైంది. ఇందుకు ప్రభుత్వం ఎలా స్పందింస్తుందో చూడాలి. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*