మహిళల పట్ల గౌరవం ఉంది : టాటా ప్రధాన కార్యదర్శి

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టాటా)లో వ్యవస్థాపక ప్రెసిడెంట్ ఝాన్సీరెడ్డి రాజీనామా వ్యవహారం, అనంతరం ఆమె సంస్థలోని కొందరు వ్యక్తుల వ్యవహార సరళి పట్ల చేసిన ఆరోపణలు అమెరికాలోని తెలంగాణ సమాజంలో ప్రకంపనలు సృష్టించాయి. ఆ వ్యవహారంపై పలువురిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. టాటా ప్రధాన కార్యదర్శి విక్రమ్ జంగం నమస్తే ఆంధ్రతో ప్రత్యేకంగా మాట్లాడారు. వ్యవస్థాపక ప్రెసిడెంట్ గా ఝాన్సీరెడ్డి సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు.

అయితే కొందరి పురుషాధిక్య ధోరణుల వలన సంస్థలో ఇమడలేకపోయాననే ఆరోపణలను సంస్థ తరఫున ప్రధాన కార్యదర్శి విక్రమ్ జంగం ఖండించారు. మహిళల పట్ల సముచిత గౌరవం ఉన్నది గనుకనే.. ఝాన్సీ రెడ్డిని తొలి ప్రెసిడెంట్ చేశాం అని ఆయన వెల్లడించారు. ఆమె తన పదవీకాలంలో సంస్థకు మంచి సేవలు అందించారని కూడా చెప్పారు. మహిళలపట్ల తమకు ఎప్పటికీ తరగని గౌరవం ఉన్నదని.. అందుకే తొలి జాతీయ తెలంగాణ సంఘం లో తొలిసారే మహిళకు అవకాశం ఇచ్చాం అని వెల్లడించారు.

అమెరికాలోని అనేక నగరాల్లో టాటా ప్రతి ఏటా ప్రత్యేకంగా మదర్స్ డే కార్యక్రమాలను చాలా వైభవంగా నిర్వహిస్తుందని, అమెరికా, మరియు భారత్ లలో టాటా సంస్థ తరఫున అనేక మహిళా సాధికారత సదస్సులను నిర్వహించాం అని, దేశవ్యాప్తంగా మహిళా సమస్యలపై పనిచేయడానికి తమలో ‘టాటా శ్రీ’ పేరుతో ప్రత్యేక మహిళా విభాగం కూడా ఉన్నదని విక్రం జంగం వివరించారు.

సంస్థలో పురుషాధిక్యత ఉన్నదనడంలో ఎలాంటి నిజం లేదని… అలాంటి అపోహలతో సంస్థ గురించి  సభ్యుల్లో ప్రతికూల అభిప్రాయాన్ని కలిగించడం మంచిది కాదని ఆయన పేర్కొన్నారు. ఝాన్సీరెడ్డి చేసిన ఆరోపణల్ని ఖండించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*