భాజపా : ఇంత సిగ్గుమాలిన చేష్టలా?

భారతీయ జనతా పార్టీ నాయకులు తాజాగా రాష్ట్రప్రభుత్వానికి చేస్తున్న ప్రతిపాదన చూస్తోంటే.. మరీ ఇంత సిగ్గుమాలిన తనానికి దిగజారుతున్నారా అని అనిపిస్తోంది. తమ వంచనను రాష్ట్ర ప్రజలు గుర్తించేస్తున్నారనే భయాందోళనల్లో వారికి పైత్యం ప్రకోపించి.. ఏది పడితే అది మాట్లాడుతున్నారేమో అనే సందేహాలు కలుగుతున్నాయి. రాష్ట్రం ఇప్పుడున్న సంక్లిష్ట పరిస్థితుల్లో కేంద్రంలో పెత్తనం సాగిస్తున్న పార్టీకి ప్రతినిధులుగా వీలైనంత సాయాన్ని రాబట్టడానికి ప్రయత్నించాల్సింది బదులు.. కేంద్రం చేస్తున్న ద్రోహానికి వంత పాడుతూ.. చెలరేగుతున్న భాజపా దళాలు కొత్తగా సిగ్గుమాలిన ప్రతిపాదన ఒకటి తెస్తున్నాయి. రాయలసీమలో రాష్ట్రానికి రెండో రాజధానిని ఏర్పాటు చేయాలని అడుగుతున్నాయి.
కర్నూలులో భాజపా నాయకుల మీటింగు జరిగింది. సచివాలయం, సీఎం, గవర్నర్ బంగళాలు, హైకోర్టు, అసెంబ్లీ లు ఉండేలా రెండో రాజధాని ఒక్కటి సీమలో కావాలనేది వారి కోరిక. దాన్ని వెంటనే ప్రకటించాలిట. 13 జిల్లాల చిన్న రాష్ట్రానికి రెండు రాజధానులు అవసరమా అనే కనీస విచక్షణ లేకుండా.. ఏదో రాజకీయ బూటకపు ప్రకటన కోసం వారు ప్రకటనలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
భాజపా నాయకులకు రాయలసీమ మీద అంత ప్రేమే ఉంటే గనుక.. కేంద్రంలోని తమ ప్రభుత్వ పాలకుల వద్దకే వెళ్లి.. ఓ లక్షకోట్లరూపాయల ప్యాకేజీ తెచ్చుకోవచ్చు కదా.. అనేది ప్రజల్లో కలుగుతున్న సందేహం. ఉత్తరప్రదేశ్ లో భాజపా పాలన సాగుతున్నది కాబట్టి… ఆ రాష్ట్రంలోని బుందేల్ ఖండ్ అనే అతి చిన్న ప్రాంతానికి ప్రధాని మోడీ రెండు రోజుల కిందట ఏకంగా 20 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించారు. అదే ప్రధాని వద్దకు ఈ రాయలసీమ నాయకులు వెళ్లి.. తమ సీమకు కూడా లక్షకాకపోతే.. యాభైవేల కోట్ల ప్యాకేజీ అయిన కోరి తెచ్చుకోవచ్చు కదా అనేది జనాభిప్రాయంగా ఉంది.
కేంద్రం ఇప్పటికే చాలా ఇచ్చేసింది వంటి కాకమ్మ కబుర్లు చెప్పడం.. సీమను ఉద్ధరించడానికి తాము ఏదో చేసేస్తున్నట్లుగా బిల్డప్ ఇచ్చుకోడానికి రెండో రాజధాని అడుగుతున్నాం అని బూటకపు డిమాండ్ చేయడం తప్ప.. భాజపా నాయకులు ఏమాత్రం చిత్తశుద్ధితో రాష్ట్ర సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మాట్లాడడం లేదని పలువురు ఎద్దేవా చేస్తున్నారు. మొదటి రాజధానికి అవసరమైన నిధులు ఇవ్వడం కోసం కేంద్రాన్ని అడిగే దమ్ములేని నాయకులు రెండో రాజధాని ప్రకటించాలంటూ చంద్రబాబును డిమాండ్ చేయడం అనేది సిగ్గుమాలని చర్యగా ప్రజలు ఈసడిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*