కేంద్రం జాప్యం దెబ్బ : లేటవుతున్న పోల‘వరం’

కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా ఖర్చుకాగల ప్రతిరూపాయీ తామే వెచ్చిస్తామటూ పోలవరం నిర్మాణానికి ఒప్పుకుంది. వారి నిర్వహణలో జాగు పెరుగుతుందనే భయంతో…. పర్యవేక్షణ బాధ్యతను రాష్ట్రప్రభుత్వం తీసుకుంది. అయితే.. డిజైన్లు మార్చాలని, ప్రతిపాదిత కాఫర్ డ్యాంలు అవసరమే లేదని. ఇలా నానా రకాల సాకులు చెబుతూ.. వాటి పరిశీలన నిమిత్తం వేర్వేరు కమిటీలను పంపి.. వారి నివేదికలను పరిశీలించి.. చివరికి తాము చేసిన కొత్త ఆలోచనలన్నీ తప్పు అని తేలిన తర్వాత.. పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రం. వారు చేసిన అనవసరమైన జాగు వల్ల.. దాదాపు ఆరునెలలకు పైగా సమయం వృథా అయింది. ఆ ప్రభావం డ్యాం నిర్మాణ పనులను ఎప్పటికి పూర్తిచేయాలనే లక్ష్యాలపై కూడా పడబోతోంది. 2018 చివరి నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ కాఫర్ డ్యాం అయినా పూర్తిచేసి  గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వాలన్న బాబు కల లేటవుతోంది. కాఫర్ డ్యాం పనులు, కాలువలకు నీళ్లు ఇవ్వడం అనేది 2019 జూన్ నాటికి గానీ సాధ్యం కాదని తాజాగా ఇంజినీర్ల అంచనాల ద్వారా తెలుస్తోంది. 2019 ఏడాది చివరి నాటికే డ్యాం మొత్తం పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు.

తెలుగుజాతికి వరప్రసాదిని వంటి పోలవరం ప్రాజెక్టును సత్వరం పూర్తిచేసి నీళ్లు అందివ్వాలని చంద్రబాబు చాలా పట్టుదలగా పనులను పర్యవేక్షించారు. కేంద్రం నుంచి నిధులు రావడంతో నిమిత్తం లేకుండా.. రాష్ట్రప్రభుత్వ ఖజానా మీద ఎంత భారం ఉన్నప్పటికీ.. పోలవరం పనులు ఆగకుండా సర్దుబాటు చేస్తూనే వచ్చారు. ఆ రకంగానే అంతో ఇంతో.. పనులు జరుగుతూ వచ్చాయి. ప్రతి సోమవారం పోలవారం గా ప్రకటించి.. పనులను ఫాలో అప్ చేస్తూ వచ్చారు.

అయితే మధ్యలో ఏదో పగబట్టినట్టుగా డిజైన్లు మార్చాలంటూ కేంద్రం అడ్డుపుల్ల వేయడంతో ఇబ్బంది మొదలైంది. ఎగువ, దిగువ కాఫర్ డ్యాం లే అక్కర్లేదని వారనడంతో.. ప్రతిష్టంభన ఏర్పడింది. తిరిగి కేంద్రం పంపిన ఇంజినీర్ల బృందమే కాఫర్ డ్యాం లేకుండా కట్టడం సాధ్యం కాదని తేల్చిన తర్వాత.. వారు ఒప్పుకున్నారు. అలాగే బాబు చెప్పొనట్లు కొన్ని పనులను కాంట్రాక్టరు నుంచి తప్పించి కొత్తవారికి కేటాయించడానికి కూడా కేంద్రం చాలా కాలం మోకాలడ్డింది. చివరికి చంద్రబాబు చెప్పిన ప్రతిపాదనకే ఒప్పుకోవాల్సి వచ్చింది. ఆ విషయంలో నవయుగ చేతికి పనులు రావడానికి కొన్ని నెలల ఆలస్యం జరిగింది. ఇలా కేంద్రం అనేక రకాలుగా చేసిన జాప్యం వల్ల.. పోలవరం పనులు లేటవుతున్నాయని అర్థమవుతోంది. 2019 నాటికి స్పిల్ వే, కాఫర్ డ్యాం పనులు అవుతాయని, అదే ఏడాది చివరికి మొత్తం ప్రాజెక్టు పూర్తవుతుందని అనుకుంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*