అమెరికాలోనూ పురుషాహంకారమే : ‘టాటా’లో లుకలుకలు!

అమెరికాకు వెళ్లినా మనోళ్ల బుద్ధులు మాత్రం మారేలా కనిపించడం లేదు. సనాతనంగా ఒక సెటప్ లో పెరిగి అహంకార పూరితమైన ప్రవర్తనకు, పురుషాధిక్య వ్యవస్థలకు ప్రతీకలుగా తమ బుద్ధిని, అలవాట్లను, ఆలోచనల్ని మూసపోసుకున్న వాళ్లు.. దేశాన్ని దాటి ఖండాలను దాటి అమెరికా లాంటి దేశాలకు వెళ్లినా కూడా.. అవకాశం వస్తే అక్కడకూడా అదే అహంకారాన్ని ప్రదర్శిస్తారని, మహిళలను అణిచివేయడంలో క్రూరంగా వ్యవహరిస్తారని నిరూపించుకుంటున్నారు. అమెరికాలోని ఓ తెలుగు సంఘంలో చెలరేగిన వివాదం ఇప్పుడు ప్రవాసాంధ్ర తెలుగు వారిలో పెద్ద చర్చనీయాంశంగా ఉంది.
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అనే సంస్థ తెలంగాణ తెలుగువారిలో కీలకమైనది. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత.. అమెరికాలో ఆవిర్భవించిన మొదటి జాతీయ స్థాయి తెలంగాణ అసోసియేషన్ ఇది. ‘టాటా’ అనే పేరుతో దీనిని వ్యవహరిస్తారు. ఈ సంస్థకు వ్యవస్థాపక అధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి. ఈ తొలి తెలంగాణ సంఘానికి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఓ మహిళ కావడం ఎంతో విలక్షణమైన అంశం. నలభయ్యేళ్ల చరిత్ర ఉన్న తెలుగు సంఘం తానా లో కూడా 24 ఏళ్ల తర్వాత ఒక మహిళ అధ్యక్షరాలు అయ్యారు. అసలే వందేళ్ల అమెరికా చరిత్రలోనే ఇప్పటిదాకా ఒక్క మహిళ కూడా అధ్యక్షురాలు కాలేదు. అలాంటి ఝాన్సీరెడ్డి తొలి మహిళగా టాటా కు అధ్యక్షురాలు అయిన తర్వాత.. చాలా వ్యయప్రయాసల కోర్చి పనిచేశారు.
అయితే.. సంస్థలోని కొందరు వ్యక్తులు అహంకార పూరితమైన, వివక్షతో కూడిన ప్రవర్తన వల్ల ఏకంగా అధ్యక్షురాలే తన పదవికి రాజీనామా చేసి.. పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. కొందరు వ్యక్తులు వ్యవస్థాపక అధ్యక్షురాలనే కనీస గౌరవం కూడా ఆమె పట్ల చూపించకుండా చులకనగా వ్యవహరించడం, ఆమె ప్రయమేయం లేకుండా… ఇష్టానుసారంగా సంస్థకు సంబంధించిన సమష్టి నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకోవడం. ఆమెను పక్కదారి పట్టించడానికి ప్రయత్నించడం వంటి చర్యలు జరిగినట్లుగా ప్రచారంలోకి వచ్చింది.
చివరికి సంస్థ నిర్వహించే వాట్సప్ గ్రూపుల్లోంచి ఏకంగా అధ్యక్షురాలికే ఎడ్మన్ అధికారాలను ముందస్తు సమాచారం లేకుండా తొలగించేశారంటే అర్థం చేసుకోవచ్చు. ఇదేమని అడిగినందుకు ఇప్పటిదాకా మీరు సంఘానికి చేసిన నష్టం చాలు.. అంటూ సూటిపోటి మాటలతో బాధించడం మరో ఎత్తు. సంస్థ ఎగ్జిక్యూటివ్ కమిటీతో సంబంధం లేని వ్యక్తుల ద్వారా చవకబారు విమర్శలు చేయించి.. ఆత్మగౌరవాన్ని భంగపరిచేలా వారు వ్యవహరించడంతో టాటా వ్యవస్థాపక అధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా తాను ఎలాంటి వివక్షను ఎదుర్కొన్నానో, ఎంత వేదనను అనుభవించానో కూడా ఆమె ఓ లేఖలో పేర్కొన్నారు. టాటా సంస్థకు ఎవరు తర్వాతి సారథులు అయినప్పటికీ.. ప్రత్యేకించి విషపురుగుల వంటి కొందరు వ్యక్తులతో జాగ్రత్తగా మెలగాలని ఆమె సూచించడం గమనార్హం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*