హైదరాబాద్ ను తలదన్నేలా విశాఖలో సదస్సు

ఇటీవలనే హైదరాబాద్ లో పారిశ్రామిక వేత్తల సదస్సు ఘనంగా జరిగింది. ఏపీ సిఎం చంద్రబాబుకు కనీసం ఆహ్వానం పంపలేదు తెలంగాణ సిఎం కేసీఆర్. ఆ సదస్సుకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకాను రాణిలా చూశారు అక్కడి నేతలు, పాలకులు. అమెరికా అధ్యక్షుడి కంటే ఎక్కువగా గౌరవించారు. పెట్టుబడులు వచ్చాయా లేదా అనే సంగతి పక్కన పెడితే తన జీవితంలో ఈ సదస్సును మర్చిపోనని చెప్పారు తిరిగి వెళ్లాక ఇవాంకా. అదే సమయంలో ఐటీ మంత్రి కేటీఆర్ ను అమెరికాకు రావాల్సిందిగా ఆహ్వానం పంపారు. మొత్తంగా హైదరాబాద్ పేరు ప్రపంచ స్థాయిలో మారు మోగింది. 
ఇప్పుడు అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ లోను పారిశ్రామిక సదస్సు జరగనుంది. పోర్టుసిటీ వైజాగ్ కేంద్రంగా జరిగే ఈ సదస్సుకు భారీగానే పారిశ్రామిక వేత్తలు హాజరవుతున్నారు. ప్రపంచంలో ఎక్కడ పారిశ్రామిక సదస్సులు జరిగినా సిఎం చంద్రబాబు వెళ్లి వస్తారు. మొన్నదావోస్ కు కుటుంబ సమేతంగా వెళ్లారాయన. ఇంకోవైపు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అక్కడకు వెళ్లి చంద్రబాబును కలిసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు వల్లనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని కేటీఆర్ నిజాన్ని వెల్లడించారు. అందుకే ఇప్పుడు ఐటీనే కాదు..పారిశ్రామిక వేత్తల చూపు సన్ రైజింగ్ స్టేట్ పై పడింది. 
 
నవ్యాంధ్రప్రదేశ్ లో ఇప్పటికే రెండు సార్లు సీఐఐ సమ్మిట్ ను నిర్వహించారు. ముచ్చడగా మూడోసారి సిఐఐ సమ్మిట్ ను నిర్వహించేందుకు సిద్దమైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈనెల 24 నుంచి 26 వరకు మూడు రోజుల పాటు నిర్వహించే సీఐఐ సదస్సు ఏర్పాట్లను ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. స్మార్ట్ పవర్ గ్రిడ్, ఎలక్ట్రిక్ వెహికిల్స్, డిజరప్టివ్ టెక్నాలజీ, సోలార్ స్టోరేజ్ రంగాలకు చెందిన వారికి సదస్సులో అవకాశం కల్పించాలని బాబు చెప్పారు. 
ఎవరెవరు వస్తారంటే…
ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు చేతుల మీదుగా సీఐఐ సదస్సు ప్రారంభంకానుంది. కేంద్రమంత్రులు సురేష్ ప్రభు, ఎంజె అక్బర్, నితిన్ గడ్కరీ, అశోక్ గజపతిరాజు,  సుజనా చౌదరి, ధర్మేంద్ర ప్రదాన్, హర్షవర్థన్, రవిశంకర్ ప్రసాద్, విజయ్ గోఖలే, మనోజ్ సిన్హా తదితరులు విచ్చేయనున్నారు. వారే కాదు..నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అజయ్ కుమార్, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ ఖాన్ తో పాటు…బంగ్లాదేశ్, కెనడా, జపాన్, జోర్డాన్, మయన్మార్, మారిషస్, మొరాకో, సింగపూర్, శ్రీలంక, టాంజానియా, థాయ్ ల్యాండ్,  యూఏఈ, జాంబియా దేశాల మంత్రులు, ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. మొత్తం 40 దేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలుఈ సదస్సుకు వస్తారని అంచనా వేశారు అధికారులు. ఏడీబీ కంట్రీ డైరెక్టర్ కెనిచి యొకోయామా, కియా మోటర్స్ ప్రెసిడెంట్ కుక్ హున్ షిమ్, సింగపూర్ మంత్రి ఎస్ ఈశ్వరన్, యూకే హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడు బారోనెస్ సందీప్ వర్మ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు పండిట్ రవిశంకర్ తో పాటు..కీలక నేతలు ఈ సమావేశానికి హాజరుకానుండటం విశేషం. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*