‘మయసభ’ కడతారా : భాజపా వెటకారం!

రాష్ట్రానికి ఇచ్చిన మాటలను నిలబెట్టుకోకుండా వంచనకు పాల్పడుతున్న భారతీయ జనతా పార్టీని ఏపీ ప్రజలు సాంతం ఛీ కొడుతున్నా కూడా.. కనీసం స్థానిక నాయకుల్లో కూడా భయం పుట్టడం లేదు. ఇప్పటికీ తమ ప్రభుత్వం చేస్తున్న వంచనను ప్రజలు గుర్తిస్తున్నారని స్పష్టంగా అర్థం అవుతున్నప్పటికీ కూడా.. వారు తెగించి రాష్ట్రప్రభుత్వం మీద నిందలు వేయడానికి, వారి ప్రయత్నాలపై సెటైర్లు వేయడానికి ఎగబడుతున్నారు. ఆ రకంగా తెలుగుప్రజల మనోభావాలను దెబ్బతీసి, భారీ భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారు. వివరాల్లోకి వెళితే…

రాజధాని నిర్మాణానికి సంబంధించి.. నూరుశాతం నిధులను కేంద్రమే భరించాలన్నది విభజన చట్టం మనకు ప్రసాదించిన హక్కు. అనాథలాగా ఏర్పడిన రాష్ట్రానికి ఇతర రాష్ట్రాలతో సమానమైన స్థాయికి వచ్చే వరకు అన్ని రకాలుగానూ కేంద్రం సాయం అందిస్తూ ఉండాలి. రాజధాని నిర్మాణానికి పూర్తిగా సహకరించాలి. ఇది చట్టంలోని వెసులుబాటు కాగా, అందుకోసం నిధులు అడుగుతోంటే.. భాజపా నాయకులు- చంద్రబాబు సర్కారుపై జోకులు పేలుస్తున్నారు.

‘‘రాజధాని నిర్మాణం కోసం 48 వేల కోట్లు అవసరం అని అడుగుతున్నారని.. చంద్రబాబు కట్టదలచుకుంటున్నది రాజధానా? లేక, మయసభా?’’ అని భాజపా మేధావుల్లో ఒకరైన జీవీఎల్ నరసింహారావు వెటకారాలు చేస్తున్నారు. నిజానికి 48వేల కోట్లతో రాజధాని మొత్తం నగరం నిర్మాణం కూడా అసాధ్యం. కేంద్రం బాధ్యత కోర్ కేపిటల్ వరకు మాత్రమే గనుక.. అంతవరకే ఆ మొత్తాన్ని రాష్ట్రం అడుగుతోంది. దానిపై ఇలాంటి జోకులు రావడం.. ప్రజలను బాధిస్తోంది.

అయినా తిరుపతి సభలో హామీలు కురిపించినప్పుడే.. మీకు ఢిల్లీని తలదన్నే రాజధాని నగరాన్ని నిర్మించి ఇవ్వడం నాదీ బాధ్యత అని నరేంద్రమోడీ ప్రజలకు హామీ ఇచ్చారు. మరి ఢిల్లీని తలదన్నే రాజధాని అంటే.. అది కనీసం 48వేల కోట్లు కాకుండా, 48 లక్షల రూపాయలకు తయారవుతుందని జీవీఎల్ అనుకుంటున్నారా? అనేది ప్రజలకు అర్థం కావడం లేదు. ఇప్పటికే ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన అనేక హామీల విషయంలో.. భాజపా దారుణమైన వంచనకు పాల్పడుతోంది. ప్రజలు ఎన్నో కలలు కంటున్న రాజధాని విషయంలో  ఇలాంటి వెటకారాలకు పోతే.. కాంగ్రెస్ లాగానే భాజపాకు కూడా ఏపీలో సమాధి స్థితి తప్పదని వారు తెలుసుకోవాలి.

1 Comment

  1. Ward member ga kuda gelavalenivallu politics lo unte ilanti matal adutharu .They are stying on RSS basement. Ilanti vallu prajala madyaku ravali appudu telstundi prajala avasaram anto

Leave a Reply

Your email address will not be published.


*