బాబుపై ‘ఆధారాలు’ అంటున్న నాటకాల జైరాం!

మసిగుడ్డ కాల్చి మొహాన పారేస్తేసరి.. ఎవరికి అంటిన మసిని వారే కడుక్కోవాలి.. అనేసామెత చందంగా ఉంది కాంగ్రెస్  పార్టీ వైఖరి. విభజన హామీల విషయంలో కేంద్రం మొండిచెయ్యి చూపిస్తుండగా.. విభజన చట్టమే సక్రమంగా లేదంటూ.. ఆ చట్టం చేసిన పాత కాంగ్రెస్ ప్రభుత్వం మీదకు నెపం నెట్టివేస్తున్న పరిస్థితుల్లో నాడు విభజన ప్రక్రియకు కీలకంగా వ్యవహరించిన అప్పటి  కేంద్రమంత్రి జైరాం రమేష్.. ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.

విభజన చట్టం అశాస్త్రీయంగా ఉన్నదని అంటున్నారు కదా.. కావాలంటే పార్లమెంటులో దానికి సవరణలు ప్రతిపాదించండి.. కాంగ్రెస్ కూడా సమర్థిస్తుంది అంటూ కొత్త పాట ప్రారంభించారు. కాంగ్రెస్ తప్పు ఏమీ లేదు.. పాపం మొత్తం ఇప్పుడున్న ప్రభుత్వాల చేతగాని తనం మాత్రమే అని చాటడానికి విభజనపర్వంలో విలన్ లా వ్యవహరించిన ఈ మంత్రి వ్యాఖ్యలు ఉండడం విశేషం.

జైరాం మాటలు ఎంత వంచనా పూర్వకంగా ఉన్నాయంటే.. ప్రస్తుతం పార్లమెంటు వేదికగా తెలుగు ఎంపీలు సాగిస్తున్న పోరాటానికి మద్దతు ఇస్తాం అని చెప్పడం లేదు. విభజన చట్టం హామీలు అమలైతే చాలు మేలు జరుగుతుందని అంతా అంటా ఉంటే.. ఆ పోరాటానికి సభలో ప్రధాన విపక్షంగా తాము  కూడా అండగా నిలుస్తాం అనే భరోసా ఇవ్వడం లేదు.. చట్టానికి సవరణలు ప్రతిపాదించండి అంటూ ఓ దుస్సాధ్యమైన ప్రతిపాదనతో కొత్త నాటకానికి తెరతీస్తున్నారు.

పనిలో పనిగా చంద్రబాబునాయుడు మీద కూడా బురద చల్లడానికి కూడా జైరాం రమేష్ సాహసించడం విశేషం. పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించి.. చంద్రబాబు నాయుడు కోట్లాది రూపాయలు ముడుపులు తీసుకున్నాడని, ఆయనకు విదేశాలలో ముడుపులు అందినట్లుగా తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఆయన అంటున్నారు. ఇలాంటి బూటకపు మాటలతో ప్రజలను ఎందుకు వంచిస్తారో అర్థం కావడం లేదు. ఆధారాలు ఉన్నట్లయితే.. వెంటనే బయటపెట్టండి. చంద్రబాబును ప్రజలు ఛీకొట్టేలా, ప్రభుత్వం అరెస్టు చేసేలా చేయండి.. అంతే తప్ప.. ఏదో బురద చల్లేస్తే వారి మరకలను వారే కడుక్కుంటార్లే మనకు పోయేదేముంది అనే దుర్మార్గపు వైఖరి విడనాడండి అని ప్రజలు అనుకుంటున్నారు. అయినా రాష్ట్రానికి చరిత్రలో తీరని ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసిన ఏపీ ప్రజలు, జైరాం వంటి నాటకాల నాయకులు ఎన్ని బూటకపు  మాటలు చెప్పినా మళ్లీ విశ్వసించరని ప్రజలు అంటున్నారు.

1 Comment

  1. AP people never ever value the utterings of congress leaders especially,Mr.Jairam ramesh,who is such a cruel politician and pseudo-intellectual and the main culprit behind the injustice happened to AP.

Leave a Reply

Your email address will not be published.


*