ఆ హీరోయిన్ల తోకలు కత్తిరిస్తారట

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకోనుంది. ఇందుకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వేడుకలకు సంబంధించిన వివరాలు చెప్పే సమయంలో మా అధ్యక్షుడు, నటుడు శివాజీ రాజా కాస్త ఘాటుగానే మాట్లాడారు. కొందరు హీరోయిన్లు పిలిస్తే రారు. కానీ తెలుగు సినిమాల్లో నటిస్తున్నారని చెప్పారు. వారు తమ పద్దతి మార్చుకోక పోతే తోకలు కత్తిరిస్తామని హెచ్చరించడం హాట్ టాపికైంది. ఎవరిని ఉద్దేశించి శివాజీరాజా ఈ మాటలన్నారనేది ఆసక్తికరంగా మారింది. మా నిర్వహించే కార్యక్రమాలకు హీరోయిన్లు హాజరు కావడం లేదు. తెలుగు వారిని కాదని వారిని తీసుకువచ్చి పెంచి పోషిస్తుంటే.. కనీసం ఆర్టిస్టుగా సభ్యత్వం కూడా తీసుకోవడం లేదని శివాజీరాజా అన్నారు. 
తెలుగు సినీ పరిశ్రమ మీద బతుకుతూ ఆ పరిశ్రమ నిర్వహించే కార్యక్రమాలకు దూరంగా ఉండటం, కనీసం సభ్యత్వం తీసుకోక పోవడం ఆశ్చర్యమే. అదే చెన్నైలో ఈ పరిస్థితి ఉండదు. తప్పకుండా అక్కడ సభ్యత్వం ఉంటేనే నటులను తీసుకుంటారు. కానీ తెలుగులోకి వచ్చేసరికి ఆ పరిస్థితి ఉండదు. శివాజీ రాజా హెచ్చరించిన ప్రముఖ హీరోయిన్లు కాజల్, తమన్నాలే అని చెబుతున్నారు. ఎన్నిసార్లు అసోసియేషన్ ప్రతినిధులు వారిని పిలిచినా లెక్క చేయడం లేదు. అదే సమయంలో మా అసోసియేషన్ కార్యక్రమాల కోసం నిధులు అడిగితే ఇవ్వడం లేదు. 
ఆ సంగతి పక్కన పెడితే అసోసియేషన్ కార్యక్రమాలకు వచ్చేందుకు హీరోయిన్లు కొందరు డబ్బులు అడుగుతున్నారట. అంటే అదేదో సినిమాలో కాల్షీట్స్ కోసం డబ్బులు డిమాండ్ చేసినట్లు ఉంది వారి పరిస్థితి. పరిశ్రమ పెద్దలకు ఈ విషయం చెప్పిన మా అసోసియేషన్ వారికి సినిమాల్లో చాన్స్ లు లేకుండా చేయాలని ఆలోచిస్తున్నారు. ఇది అయ్యే పనేనా అంటున్నారు మిగతా వాళ్లు. ఒకసారి హీరోయిన్లపై చర్యలు తీసుకుంటే మిగతా వారు దారిలోకి వస్తారని.. అందుకే తప్పని సరిగా చర్యలు తీసుకోవాలని.. ముందుగా నోటీసులు పంపాలని ఆలోచిస్తున్నారు. సమావేశాలకు రావాలంటే మా పిఏలతో మాట్లాడుకోవాలని చెప్పడంతో శివాజీ రాజాకు అంత కోపం వచ్చిందంటున్నారు. దర్శక, నిర్మాతల మండలికి ఫిర్యాదు చేసి వారికి సినిమాలు లేకుండా చేస్తే దారిలోకి వస్తారనే చర్చ సాగుతోంది. 

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*