పవన్ ఇంతకూ ప్రభుత్వాల్ని అడిగారా? లేదా?

ఇవాళ ఫిబ్రవరి 15. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధుల కేటాయింపు విడుదల, అందుబాటు ఖర్చు గురించి ఇప్పటిదాకా జరిగిన వివరాలను తనకు తెలియజేస్తే.. జెఎఫ్‌సి ద్వారా మదింపు చేయించి.. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని నిగ్గు తేలుస్తానని… అందరం కలిసి సమష్టిగా న్యాయం కోసం ప్రయత్నించ వచ్చునని ప్రతిపాదిస్తూ .. ప్రభుత్వాలు అలా వివరాలు ఇవ్వడానికి పవన్ కల్యాణ్ విధించిన డెడ్ లైన్ ఈరోజే. కానీ ఇప్పటిదాకా ఈ రెండు ప్రభుత్వాల నుంచి ఎలాంటి స్పందన లేదు. అయితే తాజాగా ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. అసలు పవన్ కల్యాణ్ అధికారికంగా ఏ ప్రభుత్వాన్ని కూడా వివరాలు అడగనే లేదని అనుకుంటున్నారు.

వపన్ కల్యాణ్ కేవలం ప్రెస్ మీట్ పెట్టి.. అందరూ వచ్చి వివరాలు చెప్పేయండి.. రెండు ప్రభుత్వాలు నాకు మొత్తం లెక్కలు అప్పజెప్పాలి అని మీడియా ముందు మాట్లాడితే.. వారు లెక్కలు ఎందుకు ఇస్తారు.. అదేం పద్ధతి అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం నుంచి వివరాలు తెలుసుకోవడానికి ఒక పద్ధతంటూ ఉంటుంది. ఏం వివరాలు కావాలో.. ఏ శాఖ నుంచి ఆ వివరాలు తెలుసుకోగోరుతున్నారో.. వారికి అధికారికంగా ఒక లేఖ రాయాలి.. దానికి స్పందన లేకపోతే.. ప్రభుత్వం విస్మరించినట్లుగా పరిగణించాలి. అంతే తప్ప.. మీడియాలో ఒక స్టేట్ మెంట్ ఇచ్చేసి ప్రభుత్వాలు స్పందించడం లేదు అంటే ఎలా కుదురుతుంది అని ప్రభుత్వ వర్గాలు తెలియజేస్తున్నాయి.

పవన్ కల్యాణ్ జెఎఫ్‌సి పేరుతో ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా.. చంద్రబాబునాయుడు మాత్రం ఆయనను తన మిత్రపక్షంగానే చూస్తున్నారు. పవన్ కల్యాణ్ ఏ వివరాలు అడిగినా కూడా మెతకగానే స్పందించాలని , దూకుడుగా రెస్పాన్స్ ఇవ్వవద్దని, ఆయన మన మిత్రపక్షమే అనే సంగతి గుర్తుంచుకోవాలని చంద్రబాబునాయుడు తన పార్టీ శ్రేణులకు హితబోధ చేస్తున్నారు. అదే సమయంలో.. ప్రభుత్వం తరఫున వివరాలు అందించే ఆలోచన మాత్రం ఆయన కొట్టి పారేస్తున్నారు. సకల వివరాలు ప్రభుత్వ వెబ్ సైట్లోనే ఉన్నాయని పవన్ తెలుసుకోవచ్చునని సూచిస్తున్నారు.

అయితే అదే సమయంలో.. పవన్ కల్యాణ్ శ్వేతపత్రం అడగాల్సింది రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదని..  కేంద్రాన్ని అని చంద్రబాబునాయుడు స్పష్టం చేస్తుండడం విశేషం. జరుగుతున్న అన్యాయం కేంద్రం ద్వారా అయినప్పుడు.. అందరూ అదే అంశం క్లెయిం చేస్తున్నప్పుడు.. ప్రశ్నించాల్సింది కేంద్రాన్ని గానీ.. రాష్ట్రాన్ని కాదు కదా.. అనే చంద్రబాబు లాజిక్ కూడా సబబుగానే ఉందని పలువురు అంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*