జగన్ రాజీనామా ఎత్తుతో టీడీపీ మేధో మథనం

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వక పోతే తమ ఎంపీలు రాజీనామా చేస్తారని ప్రకటించారు వైకాపా అధినేత జగన్. గతంలోనూ ఇదే మాట చెప్పారు. మాట తప్పడం, మడమ తిప్పడం మా ఇంటా వంటా లేదంటారాయన. ఈ మాట చెప్పి ఏడాదికి పైగానే అయింది. చెప్పిన పని చేయకపోవడంతో అంతా వైకాపాను విమర్శించడం ప్రారంభించారు. కొందరు ఎంపీలు ఎదురు తిరగడం వల్లనే ఈ పని చేశారనే ప్రచారం వచ్చింది. విషయం ఏదైనా.. ఎవరు ఏమన్నా ఏడాది నుంచి మౌనంగానే ఉన్నారాయన. ఇప్పుడు పవన్ కల్యాణ్ తో పాటు.. మిగతా వారు ఉద్యమించేందుకు సిద్దమయ్యారు. ఫలితంగా జగన్ పునరాలోచన చేశారు. మరోసారి రాజీనామా మాట ఎత్తారు. 
ఈ సారి నిజంగానే ఎంపీలు రాజీనామా చేసేలా ఉన్నారు. అదే జరిగితే టీడీపీకి మైనస్ అవుతోంది. ఏపీ ప్రయోజనాల కోసం వైకాపా పోరాడుతుంటే ఆ మేరకు ప్రజల్లో పలుకుబడి పెంచుకునే వీలుంది. అందుకే టీడీపీ దిద్దుబాటు చర్యలకు దిగనుంది. వీలున్నంత తొందరగా ఏపీకి నిధులు తెప్పించుకునే అంశాన్ని పరిశీలిస్తోంది. అంతేకాదు.. జనసేనతో పొత్తు పెట్టుకుని కమలం పార్టీకి దూరంగా వెళ్లే ఆలోచన చేస్తోంది. ఫలితంగా ఏపీ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మరోవైపు పవన్ కల్యాణ్ జేపీ, ఉండవల్లితో కలిసి లెక్కల సంగతి చూస్తున్నారు. ఇదే సమయంలో ఆలస్యం చేయకూడదనే ఆలోచనతో ఎంపీల రాజీనామాలను తెరపైకి తెచ్చారు వైసీపీ అధినేత. 
పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు పూర్తయ్యే లోపు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించకపోతే ఏప్రిల్‌ 6న వైకాపా ఎంపీలు రాజీనామా చేయనున్నారు. ప్రత్యేక హోదా అవసరం అని ఒకసారి, హోదా సంజీవినా అని మరోసారి అసలు హోదా కంటే ప్యాకేజి మంచిదని మరోసారి ఇలా మాటలు మార్చి మార్చి చెప్పారు చంద్రబాబు. అది చివరకు టీడీపీకి ఇబ్బందిని కలిగించే పరిస్థితికి తెస్తుందనే వాదన లేకపోలేదు. 
మార్చి 1న వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీలు కార్యకర్తలు కలిసి జిల్లా కలెక్టరేట్‌ల వద్ద ధర్నాలు, మార్చి 3న తాను పాదయాత్రలు, మార్చి 5న హస్తిన వీధుల్లో ధర్నాలతో హోరెత్తించనుంది. ఇందుకు టీడీపీ వ్యూహాత్మకంగానే ఎత్తులు వేయనుండటం ఆసక్తికరంగా మారింది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*