రాజీనామాల పై టీడీపీ ఎదురుదాడి

వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేస్తారని జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అది జనాల్లోకి వెళ్లక ముందే దిద్దుబాటు చర్యలకు దిగింది టీడీపీ. మంత్రులు కాల్వ శ్రీనివాసులు, గంటా శ్రీనివాసరావు, అచ్చెన్నాయుడు, జవహర్, దేవినేని ఉమ, బొండా ఉమ, బుద్దా వెంకన్న, జేసీ దివాకర్ రెడ్డి వంటి వారు వైకాపాపై విరుచుకుపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదాకు సమానమైన ప్యాకేజికి ఒప్పుకున్నామని అచ్చెన్నాయుడు ఇప్పటికీ పాత పాటే పాడటం విమర్శలకు తావిస్తోంది. హోదా కోసం పోరాడతామని చెప్పాలి. అంతేకానీ.. హోదా వద్దని మాటి మాటికి మాట మార్చిన చంద్రబాబు తీరును జనాలు తప్పుపడుతున్నారు. ఇప్పుడు అచ్చెన్నాయుడు అదే మాట చెప్పడం ఆశ్చర్యమే. 
జేసీ దివాకర్ రెడ్డి ఏం చెప్పినా సంచలనంగానే ఉంటోంది. మా వాడు మా వాడు అంటూనే కొరివి పెట్టినట్లు ఉంటుంది ఆయన వ్యవహారశైలి. ఏప్రిల్ లో వైకాపా ఎంపీలు రాజీనామా చేస్తారని చెప్పారు జగన్. దమ్ముంటే ఇప్పుడు రాజీనామాలు చేయాలని కోరారు జేసీ. ఆలస్యంగా రాజీనామాలు చేస్తే ఆరు నెలల్లోపు ఎన్నికలు వచ్చే వీలు లేదు. ఎలాగు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి వారు రాజీనామాలు చేసినా ఒకటే. చేయకపోయినా ఒకటే అంటున్నారు. వారి రాజీనామాలు నిజమైనవా.. కాదా అనే సంగతి తేల్చుకుని ఆమోదించే లోపు కనీసం రెండు నెలల సమయం పట్టే వీలుంది. 
మంత్రులు రాజీనామాలు చేస్తారా…
ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీలు ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నిస్తూ వచ్చిన తెలుగుదేశం పార్టీనేతలు ఇప్పుడు ఆత్మరక్షణలో పడ్డారు. అందుకు విరుగుడుగా తమ మంత్రి పదవులను వదులుకునేందుకు సిద్దమవుతున్నారనే లీకులిచ్చారు. జగన్ రాజీనామా ప్రకటన డ్రామా అని టీడీపీ ఎదురుదాడి చేస్తోంది. జగన్ రాజీనామాల ప్రకటనను ఎవరూ నమ్మరని అంటున్నారు. గతంలో ఇలానే జగన్ రాజీనామాలు చేస్తారని చెప్పిన చేయకపోవడమే ఇందుకు కారణం. కేంద్ర మంత్రులు అశోక్ గజపతి రాజు, సుజన చౌదరి లతో రాజీనామా చేయించాలా? వద్దా అన్నదానిపై టిడిపి నాయకత్వం తర్జన భర్జన పడుతోంది. 
తెలుగుదేశం సమన్వయ కమిటీ సమావేశంలో దీనిపై నేతలు తమ అభిప్రాయాలను సిఎం చంద్రబాబుకు చెప్పారట. చంద్రబాబు జాతీయ స్థాయిలో ఎదగ కూడదనే కుట్ర జరుగుతోందనేది జేసీ ఆరోపణ. గతంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటులో చంద్రబాబుది కీలక పాత్ర. ఈ సారి ఆ పని చేస్తారని బీజేపీ భయపడుతుందనేది టీడీపీ నేతల వాదన. రాజీనామాల ప్రకటనతో మరో నాటకానికి తెరలేపారనేది మంత్రి అచ్చెన్నాయుడు చెబుతున్న మాట. మొత్తంగా టీడీపీ ఎదురుదాడితో వైకాపా డైలమాలో పడిందనే చెప్పాలి. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*