ఆంధ్రప్రదేశ్ తో అంబానీ

నువ్వేమైనా పెద్ద అంబానీవా. అవి చేస్తావు. ఇవి చేస్తానని చెబుతున్నావు. ఇద్దరు స్నేహితుల మధ్య జరిగే వ్యాపార సంభాషణల్లో చోటు చేసుకునే సరదా మాటలివి. అలాంటి అంబానీనే ఆంధ్రప్రదేశ్ కు వచ్చాడు. ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. వారిద్దరి మధ్య జరిగిన చర్చలు ఫలవంతమయ్యాయి. రతనాల సీమ రాయలసీమలో జియోఫోన్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నాడు. అంతేకాదు… సి.ఎం చంద్రబాబు పాలనా తీరును రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రశంసించారు. ఏపీతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని చెప్పారు ముఖేష్ అంబానీ. ఏపీ సర్కార్ ఏర్పాటు చేసిన ఆర్టీజీఎస్‌ అద్భుతంగా ఉందని కొనియాడటం మాములు విషయం కాదు. 
అన్ని రాష్ట్రాలకు ఆర్టీజీఎస్‌ను చూపించాలని కోరారు అంబానీ. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి వ్యవస్థ లేదన్నాడు. అమరావతిలోని రియల్ టైం గవర్నెన్స్‌ సెంటర్‌ను పరిశీలించాక అంబానీ నోటి నుంచి వచ్చిన మాట ఇది. సెల్ ఫోన్ ను సామాన్యులకు అందుబాటులోకి తేవాలని కోరారు. ట్రిపుల్‌ ప్లే సిస్టమ్‌ ద్వారా ఫోన్‌, ఇంటర్నెట్‌, టీవీ, వైఫై కనెక్షన్‌ ప్రతి ఇంటికి ఫైబర్‌గ్రిడ్‌ను కనెక్ట్‌ చేస్తున్నామని అంబానీకి సీఎం వివరించారు. సెల్‌ ఫోన్‌ ధరను రూ.1500లకు తగ్గించగలిగిన ఘనత మాదేనని చెప్పారాయన. తిరుపతిలో 150 ఎకరాల్లో ఎలక్ట్రానిక్స్ పార్క్ ఏర్పాటు చేయనుంది రిలయన్స్ సంస్థ. రోజుకు 10 లక్షల జియో ఫోన్లు, టీవీలు, చిప్ డిజైన్, బ్యాటరీలు, సెట్‌టాప్ బాక్సుల తయారీలను చేయనుంది. అంతే కాదు.. వివిధ తయారీ కంపెనీలను ఏర్పాటు చేయనుంది. 
శివరాత్రి రోజున సీఎం చంద్రబాబుతో భేటీ ముగిశాక పారిశ్రామిక దిగ్గజం ముఖేశ్‌ అంబానీ ఈ మాటలు చెప్పడం తెలుగు వారికి పండుగలాంటిదే. అనుమతులు వస్తే రెండు వారాల్లోనే సంస్థ శంకుస్థాపనకు సిద్ధమని చెప్పడం అభినందనీయం. ఈ సంస్థ ఏర్పాటు వల్ల వేలాది ఉద్యోగాలు కొత్తగా రానున్నాయి. ఇప్పటికే కియో, అపోలో టైర్స్, ఇసుజూ లాంటి కంపెనీలు ఏపీకి వచ్చాయి. హెచ్ సిఎల్, జోహో, కాన్డ్యూయెంట్, ఏఎన్ఎస్ఆర్ లాంటి పెద్ద కంపెనీలు ఆంధ్రాలో అడుగు పెట్టాయి. మరిన్ని కంపెనీలు అదే బాట పట్టనుండటం విశేషం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*