క‌ర్నూలులో జ‌న‌సేన బ‌లంగానే ఉంద‌ట‌….కానీ..

జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ 2014 ఎన్నికలప్పుడు ప్రచారంలో భాగంగా కర్నూలు జిల్లాలో పర్యటించారు. అప్పట్నుంచి ఇప్పటి వరకు కర్నూలు జిల్లాలో పవన్‌ అడుగు పెట్టలేదు. నంద్యాల ఉప ఎన్నికలో తెలుగుదేశంపార్టీకి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పవన్‌ పాల్గొంటారని నేతలతో పాటు.. ఆయన అభిమానులు కూడా అనుకున్నారు. అయితే ఆ ఉప ఎన్నికకు జనసేన పార్టీ దూరంగా ఉంది.. పైగా టీడీపీకి మద్దతు ఇవ్వడం లేదంటూ ప్రకటించింది.. దాంతో పవన్‌ నంద్యాల పర్యటనకు బ్రేక్‌ పడింది.. నాలుగేళ్లుగా పవన్‌కల్యాణ్‌ జిల్లా పర్యటనకు రాకపోవడంతో జనసేన పార్టీ అభిమానులు నిరాశా నిస్పృహలు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితులలో పార్టీని పటిష్టపరిచేందుకు జనసేన రాష్ట్ర సమన్వయ కమిటీ సభ్యులు రంగంలోకి దిగారు. ఇటీవలే కర్నూలులో ప్రత్యేక శిక్షణా తరగతులను నిర్వహించారు. కార్యకర్తలకు చక్కటి శిక్షణను ఇచ్చారు.. ఈ సందర్భంగా స్పీకర్లు.. కంటెంట్‌ ఫైటర్లు.. ఎనలిస్టులను ఎంపిక చేశారు. లోక్‌సభ స్థానం కోసం ఓ సమన్వయకర్తను నియమించాలని అనుకున్నారు. ఇందుకోసం 20 మందితో ఓ షార్ట్‌లిస్టును తయారు చేశారు. అయితే సమన్వయకర్తల నియామకం మాత్రం ఇంకా పెండింగ్‌లోనే ఉన్నట్టు జిల్లా జనసేన కార్యకర్తలు చెబుతున్నారు. అంతేకాదు.. కర్నూలు జిల్లాకు సంబంధించినంత వరకు  జనసేన పార్టీకి జిల్లా.. మండల కమిటీలు కూడా ఏర్పాటు కాలేదు. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న లక్షలాది పవన్‌ అభిమానులను సమన్వయపరిచే నాయకులు లేకుండా పోయారు. పార్టీని ముందుండి నడిపే నాయకులు లేకపోవడం వల్లే పవన్‌ ఇప్పటి వరకు జిల్లాలో ఒక పెద్ద కార్యక్రమాన్ని కూడా నిర్వహించలేకపోతున్నారని పవన్‌ అభిమానులే చెబుతున్నారు. గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణం.. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు వంటి అంశాలపై పవన్‌ ఇక్కడికి వచ్చి మాట్లాడితే బాగుంటుందని జిల్లా నేతలు భావిస్తున్నారు. ఇటీవల అనంతపురం జిల్లా పర్యటనకు వెళుతున్న పవన్‌ను కర్నూలు శివారులో కలిసే ప్రయత్నం చేశారు అభిమానులు.. అయితే వారి విన్నపానికి పవన్‌ నుంచి సానుకూల స్పందనే వచ్చిందట! త్వరలో కర్నూలు జిల్లాలో పర్యటిస్తానని మాట ఇచ్చారట! కర్నూలు జిల్లాలో అధికార తెలుగుదేశంపార్టీ బలంగా ఉంది.. ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి కూడా పట్టుంది.. ఇలాంటి పరిస్థితులలో జనసేన పార్టీని జనంలోకి తీసుకెళ్లాలంటే పవన్‌ పర్యటన ఒక్కటే మార్గమని పార్టీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.. పార్టీ కార్యకర్తల మనోభావాలను గుర్తించిన పవన్‌ .. త్వరలోనే జిల్లాలో పర్యటించేందుకు సిద్ధమయ్యారట! జిల్లాలో నెలకొన్న సమస్యలను గుర్తించాలని రాష్ట్ర సమన్వయ కమిటీకి పవన్‌ ఆదేశించినట్టు తెలుస్తోంది. జిల్లాలో జనసేన పార్టీకి నాయకత్వ సమస్య వెంటాడుతున్నా… సేవాదల్ సేవా కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తోంది. మార్చిలో జరిగే జనసేన ప్లీనరీ సమావేశాల నాటికి జిల్లాలో బలమైన లీడర్ షిప్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు పవన్‌.. అధికార, ప్రతిపక్ష పార్టీలకు ధీటుగా జనసేనను తీర్చిదిద్దాలన్నది పవన్ లక్ష్యమట!  మొత్తానికి త్వరలో జరిగే పవన్ కల్యాణ్‌ టూర్ వల్ల జనసేన పార్టీ ప్రజల్లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*