చంద్రబాబు అత్యధిక ధనవంతుడైన సిఎం

భారతదేశంలోని మొత్తం 31 మంది ముఖ్యమంత్రుల్లో 24 మంది (81 శాతం) కోటీశ్వరులు. వీరిలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధమ స్థానంలో చోటు దక్కించుకున్నాడు. ఆయన రూ.177 కోట్లకు పైగా ఆస్తులతో దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా నిలిచాడు. ఎన్నికల సంస్కరణల కోసం పాటుపడుతున్న అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌(ఏడీఆర్‌) ఈ మేరకు ఓ నివేదిక విడుదల చేసింది. చంద్రబాబు తర్వాత అరుణాచల్‌ప్రదేశ్‌ సీఎం పెమా ఖండూ రూ.129 కోట్ల ఆస్తులతో రెండో స్థానం సంపాదించారు. పంజాబ్‌ సి.ఎం అమరీందర్‌ సింగ్‌ రూ.48 కోట్లతో మూడోస్థానంలో నిలిచాడు. దేశంలో ముఖ్యమంత్రుల సగటు ఆస్తి రూ.16.18 కోట్లుగా ఉంది. 
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన సీఎంల అఫిడవిట్లను పరిశీలించిన ఏడీఆర్, నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌ (ఎన్‌ఎల్‌డబ్ల్యూ)లు ఈ నివేదికను రూపొందించాయి. దేశంలోని అతిపేద ముఖ్యమంత్రుల్లో త్రిపుర సీఎం మాణిక్‌ సర్కార్‌ రూ.27 లక్షల ఆస్తులతో తొలిస్థానంలో నిలిచారు. పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ (రూ.30 లక్షలుపైగా), జమ్మూకశ్మీర్‌ సీఎం మెహబూబా ముఫ్తీ(రూ.56 లక్షలు) తర్వాతి స్థానాలో ఉన్నారు. 
మొత్తం 31 మంది ముఖ్యమంత్రుల్లో 11 మంది(35శాతం)పై క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. దాదాపు 26 శాతం సీఎంలపై హత్య, హత్యాయత్నం, మోసం, బెదిరింపులు వంటి తీవ్రమైన క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు ఆ నివేదిక చెబుతోంది. విద్యార్హతల విషయానికి వస్తే.. మొత్తం ముఖ్యమంత్రుల్లో 10 శాతం మంది ప్లస్ టు పాస్ కాగా… 39 శాతం మంది డిగ్రీ, 32 శాతం మంది వృత్తి విద్యా డిగ్రీ, 16 శాతం మంది పీజీ, 3 శాతం మంది డాక్టరేట్‌ సాధించిన వారున్నారు. 
పేద సి.ఎంల్లో సిపిఎం నేత అగ్రస్థానంలో ఉండగా….  అత్యంత ధనిక సిఎంగా చంద్రబాబు ఉండటం భారత దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇదంతా రికార్డుల పరంగా చూస్తేనే… అనధికారికంగా తేల్చాలంటే లెక్కలు తారు మారు అవుతాయనేది నిజం. అభివృద్ధిలోనే కాదు.. ఆదాయంలోను సిఎం దేశంలోనే నెంబర్ వన్ అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. ఈ నివేదికపై వైకాపా నేతలు ఆరా తీస్తున్నారు. నెల్లూరులో జగన్ తో భేటీ అయిన సందర్భంలో ధనిక సిఎం చంద్రబాబునట అనే అంశం చర్చకు వచ్చింది. ప్రజల్లోకి ఈ విషయాన్ని పంపేందుకు ఆ పార్టీ నేతలు ప్లాన్ రూపొందించే పనిలో ఉండటం కొసమెరుపు.  
 
   

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*