బీజేపీ-టీడీపీ నేతల కలహాల కాపురం

కలహాల కాపురంలా ఉంది టీడీపీ-బీజేపీల తీరు. తమల పాకుతో ఒకరంటే తలుపు చెక్కతో మరొకరు అన్నట్లుగా ఉంది వారి వ్యవహార శైలి. బీజేపీని విమర్శించకుండా మా వాళ్లను ఆపుతున్నానని చెప్పిన సి.ఎం చంద్రబాబు ఇప్పుడు ఆ పనిచేయడం లేదు. ఫలితంగా బీజేపీ నేతలకు వ్యతిరేకంగా టీడీపీ నాయకులు విమర్శల దాడి చేస్తున్నారు. ఎక్కడ బీజేపీ ఉంటే అక్కడ వారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అది ఎంత వరకు వచ్చిందంటే బీజేపీ ఎంపీని ఘోరావ్ చేసేంత వరకు విషయం వెళ్లింది. దీనిపై కేంద్రం ఆరా తీస్తోంది. అసలే టీడీపీతో పొత్తును తెంచుకునే దిశగా పావులు కదుపుతోంది కమలం పార్టీ. ఇప్పుడు ఏపీలో ఇలా టీడీపీ వైఖరి వారిని ఆందోళనకు గురి చేస్తోంది. 
బీజేపీ ఎపీ ఘోరావ్
పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలంలో పర్యటించారు బీజేపీ నరసాపురం లోక్‌సభ సభ్యుడు గోకరాజు గంగరాజు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ నేతలకు ఆయనకు మధ్య వివాదం చోటుచేసుకుంది. ఎంపీ తీరును నిరసిస్తూ ఆయన పాల్గొన్న పలు కార్యక్రమాలను టీడీపీ నేతలు బహిష్కరించారు. వీరవాసరం మండలంలో ఎంపీ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు చేశారు గోకరాజు గంగరాజు. స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఆయనతో కలిసి ఉన్నారు. అండలూరు గ్రామం వద్ద మాజీ ఎంపీ, టీడీపీ మండల కమిటీ మాజీ అధ్యక్షుడు వీరవల్లి చంద్రశేఖర్ తన అనుచరులతో ఎంపీ గంగరాజుకు వినతిపత్రం ఇచ్చే ప్రయత్నం చేశారు. 
ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన మోడీ ఇంతవరకు రాష్ట్రానికి ఏ విధమైన సాయం అందించలేదని చంద్రశేఖర్ అడిగారు. ఇదే విషయంపై ఎంపీ గంగరాజుతో గొడవ పడ్డారు. మీకు ఏం తెలియదు. అలా మాట్లాడవద్దని ఎంపీ వారించినా వారు ఆగలేదు. ఇక చంద్రశేఖర్ కోపం కట్టలు తెగింది. ‘ఏమిచ్చిందో తెలుసుకో’ అని తనకు ఇచ్చిన వినతి పత్రం కాగితాలను చించేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని తెలుగుదేశం నేతలను పక్కకు లాగేయడంతో తాత్కాలికంగా సమస్య సద్దుమణిగింది. అక్కడే కాదు.. చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకుంది. 
తగ్గని సోము వీర్రాజు
సోము వీర్రాజుకు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వార్నింగ్ ఇచ్చారని టీడీపీ అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇందులో నిజం ఎంత ఉందో ఎవరికీ తెలియదు. దున్న ఈనింది అంటే… పాలు ఎన్ని ఇచ్చిందనే తరహాలో ప్రచారం జరిగింది. అమిత్ షా నిజంగా హెచ్చరించి ఉంటే సోము వీర్రాజు కొద్దిగానైనా తగ్గేవాడు. కానీ ఆయన ఎక్కడా తగ్గలేదు సరికదా టీడీపీ అంటేనే ఒంటి కాలి మీద లేస్తున్నాడు. ఫలితంగా వీర్రాజు మీద కావాలనే ఆయన వైరి వర్గం వ్యతిరేక ప్రచారం చేస్తుందనే వాదన లేకపోలేదు. 
ప్రత్యేక హోదాపై ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని తాజాగా సోము వీర్రాజు అంటున్నాడు. విభజన హామీలు, బడ్జెట్‌లో నిధుల కేటాయింపుపై తెదేపా చేస్తున్న ఆరోపణలు నిజం కావన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను ఎలా వినియోగించారో రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చెప్పడం లేదన్నారు. 2017 బడ్జెట్‌ తర్వాత ముఖ్యమంత్రి  చంద్రబాబు, రాష్ట్ర మంత్రులు కేంద్రాన్ని మెచ్చుకున్నారని గుర్తు చేశారు. ఏ రాష్ట్రానికి ఇవ్వనంతగా నిధులు ఇచ్చారని కొనియాడారని వీర్రాజు గుర్తుచేశారు. ఇప్పడేమో అసలు నిధులే ఇవ్వలేదన్నట్లుగా విమర్శించడం మంచి పద్దతి కాదన్నారు సోము వీర్రాజు చెప్పింది నిజమే. చంద్రబాబు అప్పుడ అలా అన్నారు. ఇప్పుడు కాదంటున్నారు. 
రాజధాని పరిపాలనా భవనాలకు రూ.1500 కోట్లు, ఉత్తరాంధ్ర జిల్లా అభివృద్ధికి రూ.2,500 కోట్లు కేంద్రం ఇచ్చిందని.. వీటన్నింటినీ ఎలా ఖర్చు చేశారో చెప్పడం లేదన్నారు సోము వీర్రాజు. అతన్ని అసలు పట్టించుకోవద్దని చంద్రబాబు చెబుతున్నా.. అతనే టీడీపీకి కొరకరాని కొయ్యగా మారాడనేది నిజం. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*