చంద్రబాబు సర్కార్ పై పేలిన మోహన్ బాబు డైలాగ్స్…

కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు చాలా కాలం తర్వాత సూపర్ హిట్ ఇచ్చిన చిత్రం గాయత్రి. ఇందులో ద్విపాత్రాభినయం చేసిన మంచు మోహన్ బాబు చెప్పిన డైలాగ్స్ పేలిపోయాయి. గాయత్రీ పటేల్ పాత్రలో అయన నటన అద్భుతమని ప్రశంసలు దక్కాయి. మదన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో డైలాగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. సినిమాలో అయన పలికిన డైలాగ్స్ ఇప్పటి రాజకీయాలను గుర్తుకు తేవడమే ఇందుకు కారణం. అందుకే ఎక్కడ పెట్టినా ఇదే అంశం చర్చకు వస్తోంది. 
టిడిపి పక్షాన రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన అనుభవం ఉంది మోహన్ బాబుకు. మేజర్ చంద్రకాంత్ సినిమా తీసిన సమయంలో ఆయన ఎంపీనే. పార్లమెంటు సభ్యులకు అప్పుడు ప్రత్యేకంగా సినిమా వేసి చూపించారాయన. ఎంపిగా పనిచేసిన ఆయన ఇప్పుడున్న రాజకీయ నాయకుల తీరుని తన డైలాగ్ తో ఆటాడుకున్నారు. అయన పలికిన డైలాగ్స్ విన్నవారు కొందరు నాయకులని ఉద్దేశించి ఉన్నాయి. అవేంటో చూద్దాం…
‘అటవీశాఖ మంత్రికి జాతీయ పక్షి ఏంటో తెలియదు. క్రీడా శాఖా మంత్రికి ఒలంపిక్స్ లో ఎన్ని మెడల్స్ వచ్చాయో తెలియదు. బీకాంలో  ఫిజిక్స్ చదివానంటాడు ఒకడు. బిఎస్సీలో హెడ్ ఈసీ చదివానని అంటాడు మరొకడు. నేనిచ్చే పించన్ తీసుకుంటూ నేనేసిన రోడ్లపై నడుస్తూ నాకెందుకు ఓటు వేయరు అనే వాడు మరొకరు. భారతదేశ సార్వభౌమాధికారం అని పలకడం రాకా సార్వ బౌబౌ అని అరిచేవారు ఇంకొందరు. వీరు మన మంత్రులు. వీరికి మేం ఒట్లేయాలి’ అని తన స్టైల్ లో మోహన్ బాబు చెప్పిన డైలాగ్ సంచలనంగా మారాయి. 
బీకామ్ లో ఫిజిక్స్ చదివానని చెప్పింది వైకాపా నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్. బిఎస్సీలో హెచ్ ఈసీ చదివానంది వైకాపా నుంచి టీడీపీలో చేరిన కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి. అటవీశాఖ మంత్రిగా పని చేసిన సమయంలో బొజ్జల గోపాల కృష్ణారెడ్డికి సరిగా తెలియదనే ప్రచారం ఉంది. ఇక నంద్యాల ఉప ఎన్నికల సమయంలో నేనిచ్చే పింఛన్ తీసుకుని నాకే ఓటేయరా అని అడిగింది సిఎం చంద్రబాబునాయుడు. ఇలా చంద్రబాబు సర్కార్ పై డైలాగ్స్ పేల్చి తనదైన స్టైల్ లో ముందుకెళ్లారు మోహన్ బాబు. అందుకే అంతా ఇప్పుడు గాయత్రి సినిమాలో ఏముందంటూ ఆ చిత్రాన్ని చూసేందుకు వెళ్లడం ఆసక్తికరం.  

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*