చేతగాని చంద్రబాబు… హోదా పై పూటకో మాట

ఏపీకి జరిగిన అన్యాయంపై జనం మండిపడుతున్నారు. విభజనతోనే కాదు.. ఆ తర్వాత ఇదే పరిస్థితి. కానీ మాకు పదవులు ఉంటే చాలు. ఇంకేం అక్కరలేదంటోంది తెలుగుదేశం పార్టీ. ఫలితంగా ప్రజలు చంద్రబాబు చేతగాని తనాన్ని అసహ్యహించుకుంటున్నారు. చంద్రబాబు రెండు నాల్కలధోరణినీ చీత్కరించుకుంటున్నారు. మేము ఇన్ని నిధులిచ్చాం. దమ్ముంటే చర్చకు రావాలని బీజేపీ సవాల్ విసిరినా ఏం చేయలేని పరిస్థితికి వచ్చింది టీడీపీ. ఫలితంగా ప్రజల్లో వైకాపాకు ఇచ్చిన సీన్ నే టీడీపీకి ఇచ్చే పరిస్థితి వచ్చింది.
బిజెపి నేత సోము వీర్రాజు ముఖ్యమంత్రి చంద్రబాబును అవినీతి పరుడని ముద్రవేశారు. రెండు ఎకరాల ఆసామికి 2 వేల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారని అడిగారు. కేంద్రం పంపుతున్న డబ్బు అవినీతి పాలు అవుతోందని ఆయన చేసిన ఆరోపణ. ఇందుకు చంద్రబాబు ఇంత వరకు సమాధానం చెప్పలేదు. పైగా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సోము వీర్రాజును తిట్టారని ఒక వర్గం మీడియాలో పతాకశీర్షికలతో కథనాలు రాయించారనే ప్రచారం వచ్చింది. అదే సోము వీర్రాజు మరింతగా రెచ్చిపోతున్నాడు. రండి చూసుకుందాం. మీ లెక్కల ప్రతాపం మా లెక్కల ప్రతాపం ఏంటో అని సవాల్ విసిరారు. ఇందుకు చంద్రబాబు నుంచి సమాధానమే లేకపోయింది. పైగా జగన్ ఆదేశాలతోనే సోము వీర్రాజు ఇలా మాట్లాడుతున్నారని బుద్దా వెంకన్నలాంటి వారితో చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. 
తాను కేంద్రంతో గొడవ పెట్టుకోనని, సఖ్యతగా ఉండి రాష్ట్రానికి అవసరమైనవి సాధించుకుంటామని గతంలో చెప్పారు చంద్రబాబు. జగన్ విపక్షాలు కేంద్రానికి తమకు మద్య గొడవలు పెడుతున్నాయని ఆరోపించారు…ఇప్పుడేమో తాము పోరాడుతున్నామని, కేంద్రంపై రాజీలేని పోరాటం చేస్తామని చెబుతున్నారు. కేంద్రంలో మంత్రులుగా ఇద్దరినీ కొనసాగిస్తూ రాజీలేని పోరాటం ఎలా చేస్తారు చెప్పండి. ఈ విషయంలో చంద్రబాబు అనుసరిస్తున్న విధానాన్ని ప్రజలు తప్పు పడుతున్నారు. వాస్తవంగా కేంద్రం ఎన్ని నిదులు ఇచ్చింది. ఎంత ఇవ్వాలి. దేనికి ఖర్చు పెట్టారు. రాజధాని నిర్మాణానికి రూ.2500 కోట్లు ఇచ్చామని కేంద్రం చెబుతోంది. కానీ 1500 కోట్లే ఇచ్చారని చంద్రబాబు సర్కారు చెబుతున్న మాట. పోలవరం పై శ్వేత పత్రం ఇచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం భయపడుతోంది. తప్పుచేయనప్పుడు వెనుకాడాల్సిన అవసరం లేదు. మేము దేనికైనా సిద్దమని ప్రకటించాలి. ఆ సాహసం చంద్రబాబు సర్కార్ చేయలేకపోతోంది. ఫలితంగా నిధుల విషయంలో అనుమానాలు తలెత్తుతున్నాయి. 
ఏపీకి బిజెపి, ప్రధాని మోడీ అన్యాయం చేస్తున్న మాట నిజమే. ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో చాలా వరకు చంద్రబాబు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. కానీ అదే సమయంలో తాను ఏం అన్నాడో కూడ జనాలు గుర్తు చేసుకుంటున్నారు. ఈ ఏడాది వివిధ పద్దుల కింద 31 వేల కోట్లు ఇచ్చిందని బిజెపి నేతలు చెబుతున్న మాట. అది నిజమా కాదా అనేది టీడీపీ తేల్చి చెప్పాలి. ఏపీకి కేంద్రం బాగానే సహకారం అందిస్తోందని అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాల కంటే దూసుకుపోతుందని చెప్పారు చంద్రబాబు. నాలుగేళ్ళు మౌనంగా ఉన్న చంద్రబాబు ఇప్పుడు ఎన్నికల ముందు బీజేపీ వల్ల నష్టపోయామని చెబుతున్నారు. ఇన్నాళ్లు ఆ పని ఎందుకు చేయలేకపోయారంటే సమాధానం లేదు. 
రెండునాల్కల ధోరణి
1998 కి ముందు బిజెపి మతతత్వ పార్టీ, మసీదులు కూల్చే పార్టీ అని చంద్రబాబు విమర్శించింది వాస్తవం. ఆ తర్వాత వాజ్ పేయి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. గుజరాత్ ముఖ్యమంత్రి మోడీని నరహంతకుడన్నారు. మోడీని ఆ పదవి నుంచి దించాలని డిమాండ్ చేసింది చంద్రబాబునే. 2014 ఎన్నికలకు ముందు మోడీ చాలా మంచోడుని చెప్పింది అదే చంద్రబాబు. ప్రత్యేక హోదా అంశంలో పదిహేను ఏళ్లు కావాలని కోరారు చంద్రబాబు. కానీ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా కావాలని అసెంబ్లీ తీర్మానం చేసింది. దాన్ని కేంద్రానికి పంపింది. ఆ తర్వాత మాట మార్చారు చంద్రబాబు. ప్రత్యేక హోదా అవసరం లేదన్నారు. కేంద్రం ఒత్తిడి చేయడమే ఇందుకు కారణమన్నది నిజం. అంతే కాదు..హోదా కంటే ప్యాకేజీ ఇవ్వడమే బెటర్ అన్నారు. ఆ తర్వాత హోదా ఏమైనా సంజీవినా అని మార్చారు. ఇలా ప్రతి సారీ చంద్రబాబు రెండు రకాల మాటలు మాట్లాడటం ప్రజల్లో వ్యతిరేకతను తీసుకువస్తోంది. 
ప్రత్యేక హోదా కోసం జనం పోరాటం చేస్తుంటే చూస్తు ఊరుకున్నారే తప్ప ఇప్పటికీ హోదా గురించి మాట్లాడటం లేదు. మొన్న పార్లమెంటులో టీడీపీ ఎంపీలు హోదా గురించి ప్రస్తావించలేదు. చిచ్చరపిడుగులా గల్లా జయదేవ్ మాట్లాడటం తప్ప టీడీపీ వైపు నుంచి ఏం జరగలేదు. ప్రధాని మోడీ మాట్లాడేటప్పుడు సభ్యులు మౌనంగా కూర్చోవాలని ఆదేశాలివ్వడం టీడీపీ రెండు రకాల వ్యూహాలకు అద్దం పడుతోంది. 
ఫిరాయింపు దార్లకు మంత్రి పదవులా…
చంద్రబాబు చెప్పేదానికి చేసేదానికి పొంతనే లేకుండాపోయింది. రాజకీయాల్లో నైతిక విలువలు పాటించాలని పెద్ద లెక్చర్ ఇస్తారు చంద్రబాబు. మీరు చేసేదేమిటి. పార్టీ ఫిరాయింపు దార్లకు మంత్రి పదవులు ఇవ్వడం నైతికత కిందకు రాదా..వీటన్నంటినీ విపక్షాలు కాదు..జనాలు చూస్తున్నారు. రేపు ఇదే టీడీపీకి ఇబ్బంది తెచ్చి పెట్టిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. విపక్షం సరైంది కాకపోవడంతో చంద్రబాబు ఎన్ని డబుల్ గేమ్ లు ఆడినా సరిపోతోంది. చంద్రబాబుకు ఓటుకు నోటు కేసు, జగన్ కు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు. మొత్తంగా ఆ రెండు పార్టీలు జనాలను మోసం చేస్తున్నాయి. ఇక కేంద్రం తీరు అలానే ఉంది. అందుకే విజ్ఞులైన జనాలు రాబోయే కాలంలో తమ సత్తా చాటేందుకు సిద్దమయ్యారనే విషయం తెలుసుకోవాలి.  
 

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*