నిందల శృతి పెరిగితే అభాసుపాలౌతారు…

రాజకీయాల్లో ప్రత్యర్థుల మీద లేనిపోని నిందలు వేయడం అనే పనిచేయకుండా మనగలిగే వారు ఎవరూ ఉండరు. కాకపోతే అలా నిందలు వేయడానికి కూడా ఔచిత్యం చూసుకోవాలి. అందులో కాస్త తేడా వస్తే గనుక.. మొదటికే మోసం అవుతుంది. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే పరిస్థితిలో ఉంది. ప్రస్తుతం బడ్జెట్ కేటాయింపుల అన్యాయం నేపథ్యంలో ఏర్పడిన ప్రతిష్టంభనను వాడుకుని.. మోడీకి చంద్రబాబునాయుడు దాసోహం అయినట్లుగా, రాష్ట్ర ప్రయోజనాల్ని పణంగా పెట్టినట్టుగా తెలుగుదేశం గురించి విపరీతమైన ప్రచారం చేయడానికి వైకాపా ముచ్చట పడుతోంది. నిందల్లో నిజం ఉండాల్సిన అవసరం లేదు.. అవి రాజకీయంగా ఉపయోగపడితే చాలు. ఇలాంటి వైఖరిని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే వారు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే.. ఈ నిందల శృతిమించితే వారి పరువు పోయే ప్రమాదం కూడా ఉంది.

తెలుగుదేశం పార్టీ కేంద్రానికి వ్యతిరేకంగా గొంతెత్తడమే సాధ్యం కాదని వైకాపా ఆశించింది. కానీ వారి ఆశలకు భిన్నంగా.. తెలుగుదేశం చాలా ఉధృతస్థాయిలోనే పోరాటానికి దిగింది. ఒకవైపు కేంద్రంలోని పెద్దలు రాజీ చర్చలకు పిలుస్తూ ఉన్నప్పటికీ పట్టించుకోకుండా, సాయం విషయంలో స్పష్టత ఇస్తే తప్ప.. తగ్గేది లేదన్నట్లగా పోరాటం సాగించింది. ఇది వైకాపాకు అనూహ్యమైన పరిణామం. వారు జీర్ణం చేసుకోలేని సంగతి. తాము ఎంత పోరాడుతున్నా సరే.. తమకు పేరు రాకుండా తమకంటె ఎక్కువగా.. మిత్రపక్షంగా ఉండి కూడా పోరాటం సాగిస్తున్నందుకు తెదేపా కు కీర్తి దక్కడం చూసి వారు ఓర్వలేకపోతున్నారు.

ఈ నేపథ్యంలో తెదేపా మీద మాటల దాడి పెంచారు. వైకాపా ఎంపీ విజయసాయి  రాజ్యసభలో అనవసర ప్రస్తావన చేసి పరువు పోగొట్టుకున్నారు. మరోవైపు రాష్ట్రంలోని వైకాపా నాయకులు కూడా.. తెదేపా మోడీకి దాసోహం అయిందని, వారితో కుమ్మక్కు అయి ఉత్తుత్తి పోరాటాన్ని నడిపిస్తోందని ఇలా రకరకాలుగా  విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఏది నిజమైన పోరాటమో.. ఏది కాదో.. ప్రజలు గుర్తించలేనంత అవివేకులు ఎంత మాత్రమూ కాదు. తెలుగుదేశం సాగిస్తున్న పోరాటం ఏదో తెలుసుకోవడానికి ప్రజలు వైకాపా వారి కళ్లజోడులోంచి చూడాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదు. ప్రజలు చూస్తున్న వాస్తవాలకు భిన్నంగా డుష్ప్రచారం చేయడానికి పూనుకుంటే గనుక.. వైకాపానే నవ్వుల పాలు అవుతుంది. తెదేపా నిలకడైన పోరాటం సాగిస్తున్నప్పుడు.. దాని మీద అనుమానాలు రేకెత్తించే ప్రయత్నం చేస్తే.. వారి సంకుచిత దృష్టి కోణాన్నే ప్రజలు తప్పు పడతారు తప్ప మరోటి జరగదని వారు తెలుసుకోవాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*