డ‌బుల్ బెడ్‌రూంతో టీఆర్ఎస్‌కు ట్ర‌బుల్‌…

సీఎం కేసీఆర్ మాన‌స‌పుత్రిక “డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల పథకం”! గత ప్రభుత్వాల మాదిరిగా ఇరుకిరుకు పిట్టగూడు ఇళ్ళు కాకుండా.. అర్హులైన పేదల‌కు డ‌బుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మించి ఇస్తామ‌ని తమ పార్టీ ఎన్నిక‌ల మానిఫెస్టోలో కేసీఆర్ ప్రకటించారు. అన్నట్టుగానే డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల హామీ టీఆర్ఎస్‌కు ఓట్లవ‌ర్షం కురిపించింది. పార్టీ అధికారంలోకి వ‌చ్చింది. ప్రభుత్వం ఏర్పడ్డ త‌ర్వాత డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం నడుంకట్టింది. హైద‌రాబాద్‌ సహా సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గంలో తొలి విడ‌తగా కొన్ని ఇళ్లను శ‌ర‌వేగంగా నిర్మించి ఘ‌నంగా ప్రారంభోత్సవాలు జ‌రిపించారు. ఆ సందర్భంగా ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను చూసి పేద‌ప్రజలు ఎంతో ఆనందించారు. తమ ఊహకి అందని విధంగా ఉన్నాయి ఆ ఇళ్లు. దీంతో మిగతాచోట్ల ఉన్న అర్హులు కూడా త‌మ‌కూ అలాంటివే ద‌క్కుతాయ‌ని ఆశ‌లు పెంచుకున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి టెండ‌ర్లను ఆహ్వానించింది. గ‌త మూడేళ్లుగా చాలాచోట్ల జరిగిన ఈ టెండర్ల ప్రక్రియ ప్రహసనంగా మారింది. డ‌బుల్ బెడ్‌రూం ఇంటికి ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులకీ.. వాస్తవంగా అవుతున్న ఖ‌ర్చుల‌కు మధ్య భారీ వ్యత్యాసం ఉండ‌టంతో కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి! డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి గాను గ్రామాల్లో ఒక యూనిట్‌ కాస్ట్ 5 లక్షల 4 వేల రూపాయలుగా, పట్టణప్రాంతాల్లో 5 లక్షల 30 వేల రూపాయలుగా నిర్ణయించారు. వీటికి తోడు మౌలిక వసతుల కల్పనకోసం గ్రామాల్లో లక్షా 25 వేలు, పట్టణాల్లో 75 వేల రూపాయలు చొప్పున అదనంగా వెచ్చించ‌నున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. అయితే ఒక డ‌బుల్ బెడ్‌రూం ఇంటి నిర్మాణానికి అయ్యే ఖ‌ర్చు ప్రభుత్వం ఇస్తున్న నిధుల‌ కంటే 50 శాతం ఎక్కువ అవుతోందట. ముడిస‌రుకుల ధ‌ర‌లు పెరుగుతున్న కొద్దీ నిర్మాణ వ్యయం కూడా పెరుగుతోంది. దీంతో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లు జంకుతున్నారు. ఈ ప‌రిస్థితిని ప్రభుత్వ పెద్దలు కూడా గ్రహించారు. ఇసుక, సిమెంటు, ఇనుము త‌దితర ముడిస‌రుకును రాయితీపైన ఇప్పిస్తామ‌ని చెప్పారు. అయినా కాంట్రాక్టర్లు అంత‌గా ఆస‌క్తి చూపించ‌డం లేదు. ప‌ర‌ప‌తి ఉన్న కొంద‌రు మంత్రులు, ఇత‌ర ప్రజాప్రతినిధులు ఎలాగోలా గట్టెక్కే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇవి పూర్త‌వుతాయో లేదో అన్న అయోమ‌యం నేత‌ల్లో నెల‌కొంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*