లాబీల్లో జైట్లీకి క్లాసు పీకిన సుజనా!

‘‘పిప్పరమెంటు ఇస్తాలేమ్మా.. ఏడవకూడదు కన్నా.. మా బుజ్జి కదా.. చిన్ని కదా.. ’’ అంటూ తాయిలాల ఆశ చెబితే.. పసిపిల్లలు ఏడుపు మానేస్తారేమో. చెప్పిన తాయిలం ఇవ్వకపోయినా సరే.. కాసేపటికి ఇతర ఆటల వ్యాపకాల్లో పడి వారు పిప్పరమెంటు సంగతి మరచిపోవచ్చు. అదే సిద్ధాంతాన్ని తాము ఎవరికైనా అప్లయి చేసి బురిడీ కొట్టించవచ్చునని కేంద్రలోని మోడీ సర్కారు భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ప్యాకేజీ మరియు విభజన సాయం అన్నీ చేస్తాం.. చేస్తాం.. చేస్తాం అని చెప్పాం కదా.. అని పదేపదే చెబుతూ ఉంటే.. చాలు.. అక్కడితో అవతలి వారు డంగైపోయి.. మన్ను తిన్న పాముల్లా పడి ఉంటారని వారు అనుకుంటున్నారేమో.. కానీ.. ఆ పప్పులు ఉడకవ్ అని తెలుగుదేశం ఎంపీలు నిరూపిస్తున్నారు. రాజకీయ అనుభవం, తెలివితేటల విషయంలో.. వారికెంత పరిణతి ఉందో.. అంతకు మించిన కొమ్ములు తిరిగిన అనుభవం తమకు కూడా ఉన్నదని.. మిత్ర ధర్మం కొద్దీ ఊరుకుంటున్నాం గానీ.. అవసరం వస్తే.. ఢీ అంటే ఢీ అనగలం అని నిరూపిస్తున్నారు. ప్రజల ముందుకు ఎన్నికలకు వెళ్లి గెలిచే చరిత్ర, చరిష్మా లేని నాయకులకే అంత గోరోజనం ఉంటే.. ప్రజల్లో తిరుగుతూ ప్రజల్లో నెగ్గుతూ ఉండే ప్రజాబలం ఉన్న నాయకులకు ఇంకెంత గోరోజనం ఉండాలి.. అదే పార్లమెంటులో కనిపిస్తోంది. పార్లమెంటు లాబీల సాక్షిగా నలుగురి ఎదుటా.. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కినుక వహించేలాగా.. కేంద్రం మంత్రి తెలుగుదేశానికి చెందిన సుజనా చౌదరి సూటి మాటలతో క్లాస్ పీకడం ఇందుకు ఉదాహరణ. ఖంగుతిన్న అరుణ్ జైట్లీ నోట మాట రాక.. మౌనాన్ని ఆశ్రయించి అక్కడినుంచి నిష్క్రమించడం కొసమెరుపు.

తమ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రతిపాదస్తున్న సంయమనం అనేది తమలోని సహనాన్ని బట్టే ఉంటుందని.. ఆ సహనాన్ని తుంచేస్తే ఇక తలపడడమే జరగుతుందని సుజనా చౌదరి నిరూపించారు. పార్లమెంటులో ఆంధ్రకు ఎలాంటి సాయం ఇవ్వని, ప్రకటించని, ప్రస్తావించిన అరుణ్ జైట్లీ లాబీల్లో తారసపడగానే ఆయన అదే విషయం అడిగారు. గురువారం జైట్లీ ప్రకటనతో ఇంకాస్త నిరాశ కలిగినట్లు సుజనా ఆయనతో చెప్పారు.

రెండుసార్లు ప్రకటన చేసినా.. ఎందుకు సంతృప్తి లేదంటూ జైట్లీ ఆయనను అడిగారు. అయితే నెంబరు ప్రకారం రెండుసార్లు ప్రకటనలే గానీ.. ఆ ప్రకటనల్లో ఏం చెప్పారో.. అసలంటూ ఏం హామీ ఇచ్చారో, ఎంత డొంకతిరుగుడు తనాన్ని ఆశ్రయించారో ప్రజలకు తెలుసు.

ఈ నేపథ్యంలో సుజనా ఒక్కసారిగా ఆగ్రహంతో ‘‘డొల్ల ప్రకటనలతో ప్రజలను మోసం చేయలేరని, పార్టీలు ఉంటాయి, పోతాయి..  కానీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని, పార్టీలకు విలువ ఇవ్వాలే తప్ప సంఖ్యా బలానికి కాదని.. ’’ జైట్లీకి క్లాస్ పీకారు. ఈ వాదనతో ఖంగు తిన్న అరుణ్ జైట్లీ అక్కడినుంచి మౌనంగా వెళ్లిపోయారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*