జగన్ ‘‘టెంకాయ సీఎం’’

ప్రత్యేకహోదా కోసం తమ పార్టీ ఒక్కటే చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నట్లుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదేపదే చెప్పుకుంటూ ఉంటారు. అయితే ప్రత్యేక హోదా అనేది ఆయన ఎలా సాధిస్తారు? జగన్మోహన్ రెడ్డి సీఎం అయినంత మాత్రాన వెంటనే ప్రత్యేకహోదా లగెత్తుకుంటూ వచ్చేస్తుందా? తను సీఎం కావడానికి , హోదా రావడానికి మధ్య ఉన్న లింకేమిటి? హోదాను సాధించడానికి జగన్ వద్ద ఉన్న యాక్షన్ ప్లాన్ ఏమిటి? లాంటి ప్రశ్నలు తెలుగు ప్రజల్లో రేకెత్తుతుండడం సహజం. ఇలాంటి అనేకానేక ప్రశ్నలకు ఒకేసారిగా సమాధానం చెప్పేసే.. జగన్ పాదయాత్రకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. జగన్ పాదయాత్రలో ఓ మహిళ అడిగిన ప్రశ్న, దానికి జగన్ చెప్పిన సమాధానం చూపించే వీడియో క్లిప్ వైరల్ గా మారుతోంది. దాని ప్రకారం..

జగన్ యాత్రలో ఓమహిళ.. ‘‘జగనన్నా.. మీరు సీఎం అయితే ప్రత్యేకహోదా ఎలా సాధిస్తారు’’ అని అడిగింది.

ఈ ప్రశ్నకు జగన్ చాలా మురిసిపోయారు. చాలా చక్కటి ప్రశ్న అడిగావమ్మా.. అడగాల్సిన ప్రశ్నే అడిగావు.. అందరికీ తెలియాల్సిన ప్రశ్నే ఇది.. అంటూ అదే ప్రశ్న గురించి.. కాసేపు మాట్లాడుతూ.. జవాబు ఏం చెప్పాలో ఆలోచించుకున్నారు. ఆ పిమ్మట.. ‘‘అమ్మా.. నువ్వు ఇకమీదట గుడికెళ్ల దేవుడికి రెండు టెంకాయలు కొట్టాలి.. ఒక టెంకాయ జగనన్న సీఎం కావాలని కోరుకుంటూ కొట్టాలి. మరో టెంకాయను రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలని కోరుతూ కొట్టాలి…’’ అంటూ జగన్ చిత్రమైన సమాధానం ఇచ్చారు. దీంతో ఖంగుతినడం ప్రశ్న అడిగిన మహిళ వంతయింది.

జగన్ తన పాదయాత్ర ప్రసంగాల్లో తనను కలిసేందుకు వచ్చిన వారిని ఉద్దేశించి.. దేవుడి దగ్గరకు వెళ్లినప్పుడు.. జగనన్న సీఎం కావాలని మొక్కకుంటూ ఒక టెంకాయ కొట్టండి అని సూచిస్తూ ఉంటారు. ఇప్పుడు రెండు టెంకాయలు కొట్టాలని ఆయన అందరికీ పురమాయిస్తున్నారు. జనం మొత్తం జగన్ సీఎం కావడానికి ఒక టెంకాయ, ప్రత్యేకహోదా రావడానికి మరో టెంకాయ కొట్టాలన్నమాట.

జగన్ మాటలను బట్టి అర్థమవుతున్నదేంటంటే.. దేవుడికి మొక్కి ప్రత్యేకహోదా తెచ్చుకోవాల్సిందే తప్ప.. దాన్ని సాధించడానికి జగన్ చేసే ప్రయత్నం, పోరాటం ఏమీ ఉండదన్నమాట.

అందుకే కాబోలు.. జగన్ గురించి ‘టెంకాయ సీఎం’, ‘రెండు టెంకాయల సీఎం’ అంటూ జనాలు జోకులు వేసుకుంటున్నారు. అయితే దేవుడికి మొక్కి టెంకాయ కొడితే హోదా వచ్చేట్లయితే.. ఇప్పడే తలా ఒకటి కొట్టేస్తే సరిపోతుంది కదా.. దానికి జగన్ సీఎం కావాలా ఏమిటీ.. అని జనం నవ్వుకుంటున్నారు.

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*