సమరాంధ్రగా మారిన… ఆంధ్రప్రదేశ్…

సమైక్యాంధ్ర ఉద్యమం గుర్తుకు వస్తోంది. అంతగా తిరిగి పోరాటం చేసేందుకు సిద్దమవుతున్నారు జనాలు. తెలుగోడి సత్తా తెలుస్తోంది. ఎదురు తిరిగితే మా కంటే గట్టిగా పోరాడే వారు లేరని చెబుతున్నారు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ సమరాంధ్రగా మారింది. నిరసనలతో హోరెత్తుతోంది. కేంద్రం తీరుపై మండిపడుతోంది. బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందని వామపక్షాలు చేపట్టిన బంద్ సంపూర్ణంగా సాగుతోంది. బంద్‌కు అన్నివర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. స్కూళ్లు మూతబడ్డాయి. వ్యాపార సంస్థలు తెరుచుకోలేదు. ప్రజలంతా స్వచ్ఛందంగా వచ్చి నిరనసలో పాల్గొంటున్నారు. ఏపికి న్యాయం చేయాలని నినదిస్తున్నారు. కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బంద్‌తో ఏపీలో జనజీవనం స్థంభించిపోయింది. 
పార్టీలన్నీ కన్నెర్ర జేస్తున్నాయి….
సిపిఐ, సిపిఎం, వైఎస్ఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్, లోక్ సత్తా, జనసేన కార్యకర్తలు బంద్ లో పాల్గొన్నారు. టీడీపీ కార్యకర్తలు బంద్ లో పాల్గొని కేంద్రం తీరును తప్పు పట్టారు. వామపక్ష నేతలు, కార్యకర్తలు తెల్లవారుజాము నుంచే రోడ్లపైకి వచ్చి ఆందోళనలో పాల్గొన్నారు. బస్సు డిపోల వద్ద బైఠాయించి బస్సులు బయటికి రాకుండా అడ్డుకున్నారు. ర్యాలీలు చేస్తూ షాపులను మూసి వేయించారు. దీంతో కర్నూల్ నుంచి సిక్కోలు వరకు బంద్ సంపూర్ణంగా సాగుతోంది. వైసిపి కార్యకర్తలు ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏపీకి న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదని వారు హెచ్చరించారు. అధికార టిడిపి కూడా రోడ్డెక్కింది. పార్టీ నాయకత్వం పిలుపు మేరకు అన్ని మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విభజన చట్టంలోని హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. టిడిపి ప్రజాప్రతినిధులు ప్రదర్శనల్లో పాల్గొనడం విశేషం. 
టీడీపీ చివరిగా…
బంద్ కు మద్దతు పలకకపోతే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని టీడీపీ భావించింది. అందుకే చివరి నిమిషంలో బంద్ లో పాల్గొనేలా నిర్ణయం తీసుకుంది. మేము బంద్ లో పాల్గొనాలని అనుకుంటున్నాం. కాకపోతే మా పార్టీ హైకమాండ్ ఊరుకోదంటున్నారు ఇంకోవైపు బీజేపీ నేతలు. స్థానిక నేతలు అంతా ఏపీకి జరుగుతున్న అన్యాయం పై కోపంగానే ఉన్నారు. కానీ ఏం చేయలేని పరిస్థితి వారిది.  
గడ్డి తిన్న జనసేన...
ప్రధాని మోడీ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ ఆంధ్ర ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేదు. అందుకే తెలుగు ప్రజలు గడ్డి తిని బ్రతకాలి అంటూ ఏలూరు బిర్లా భవన్‌ సెంటర్లో జనసేన కార్యకర్తలు గడ్డిని తింటూ నిరసన తెలిపారు. ఇది ప్రత్యేకంగా అందరినీ ఆకట్టుకుంది. వామపక్షాలు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలు బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలపడం గతంలో చేసిన సమైక్యాంధ్ర ఉద్యమాన్ని గుర్తు చేసింది. 
బంద్ లో జగన్…
బంద్ కోసం తన పాదయాత్రను వాయిదా వేసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్… నెల్లూరు జిల్లాలో జరిగిన బంద్ లో పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి ఆయన ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. కేంద్రం తీరును తప్పు పట్టారు. ఇక్కడ పాల్గొన్నారు సరే. నిన్న మోడీ మాట్లాడేటప్పుడు మీ పార్టీ వాళ్లు ఎందుకు సభ నుంచి బయటకు వెళ్లారంటే సమాధానం లేదు. ముందు నుంచి హోదాపై ఏపీపై మాట్లాడుతుందే మేమేనని చెబుతున్నారాయన. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*