సత్య నాదెళ్లతో ఏపీఎన్ఆర్‌టీ అధ్యక్షుడు రవి వేమూరి భేటీ

అంతర్జాతీయంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముద్దుబిడ్డలు, ఎన్నారైల సహకారం తీసుకుని ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలనే సదుద్దేశంతో.. ఏపీలోని చంద్రబాబునాయుడు ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున.. అంతర్జాతీయంగా ఉన్న తెలుగువారి సేవలను సమీకరించి.. రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడేలా చేయడానికి ప్రత్యేకంగా ఏపీఎన్ఆర్టీ అనే విభాగాన్ని కూడా ఏర్పాటుచేసి.. దాని ఆధ్వర్యంలో నిరంతరాయకృషి చేయిస్తున్నారు. అందులో భాగంగా.. ఆంధ్రప్రదేశ్ లో, అమరావతిలో ఓ అభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేయడం గురించి ఏపీఎన్ఆర్‌టీ అధ్యక్షుడు డాక్టర్ రవి వేమూరి, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో న్యూయార్క్ లో భేటీ అయ్యారు. ఈ ప్రతిపాదన పట్ల సత్య నాదెళ్ల కూడా సానుకూలంగానే స్పందించినట్లు డాక్టర్ రవి వేమూరి తెలిపారు.

ఇటీవల అమెరికాలో పర్యటించి.. పలుప్రాంతాల్లో ఎన్నారైలతో సమావేశాలు నిర్వహించిన ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తన షెడ్యూలు ప్రకారం న్యూయార్క్ లో సత్య నాదెళ్లను కలవాల్సి ఉంది. అయితే సమయాభావం కారణంగా లోకేష్… ఈ భేటీ జరగకుండానే.. తిరుగు ప్రయాణం అయ్యారు. దాంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఏపీఎన్ ఆర్‌టీ అధ్యక్షుడు రవి వేమూరి మరికొందరు సంస్థ ప్రతినిధులతో వెళ్లి సత్యనాదెళ్లను కలిశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రాష్ట్ర అభివృద్ధిలో విదేశాల్లో ఉన్న తెలుగువారి సేవలను ఏ విధంగా ఉపయోగించుకో దలచుకుంటున్నదనే సంగతిని డాక్టర్ రవి వేమూరి , సత్యనాదెళ్లకు వివరించారు. అన్ని విషయాలను సావకాశంగా విన్న సత్య నాదెళ్ల సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఇంకా ఆమెజాన్ తదితర సంస్థలతో కూడా మంత్రి నారా లోకేష్ భేటీ అయి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వాములు కావడం గురించి చర్చించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*